ఒక కథ మీద దర్శకుడు, హీరో కలిసి కూర్చుంటారు. మహా అయితే డైరక్షన్ టీమ్ కలుస్తుంది. మరి ఒక స్టోరీలైన్ మీద ఏకంగా టాప్ డైరక్టర్స్ కూర్చొని డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన చర్చ అల వైకుంఠపురములో సక్సెస్ పార్టీలో జరిగింది.
అల వైకుంఠపురములో మూవీ సక్సెస్ అయిన సందర్భంగా వరుసపెట్టి అందరికీ పార్టీలిస్తున్నాడు అల్లు అర్జున్. ఇందులో భాగంగా డైరక్టర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందనే చర్చ వచ్చింది. దీంతో టాప్ డైరక్టర్స్ అంతా తమకు తోచిన ఐడియాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా అందరూ డ్రింక్ ఓ సిప్ చేస్తూ, సీక్వెల్ ఎలా ఉంటే బాగుంటుందో ఐడియాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు.
సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా పరిచయమైన బంటు, క్లైమాక్స్ కు వచ్చేసరికి కోట్ల రూపాయల అధిపతి అవుతాడు. అతడు కాస్ట్ లీ సూట్ వేసుకొని, హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయే సన్నివేశంతో సినిమాను ముగించారు. అక్కడ్నుంచి సీక్వెల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉండాలనే టాపిక్ పై దర్శకులంతా సరదాగా మాట్లాడుకున్నారు. నిజం చెప్పాలంటే అన్నీ వాలీడ్ పాయింట్సే. సీక్వెల్ కు పనికొచ్చే సరుకే.
సీక్వెల్ పై వరుసపెట్టి ఐడియాలు వస్తుంటే ఒక దశలో త్రివిక్రమ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ఐడియాలన్నీ కలిపితే సినిమా అయిపోతుంది కదా అంటూ సరదాగా కామెంట్ కూడా చేశాడు. మొత్తానికి అల వైకుంఠపురములో సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన మాత్రం ఈ పార్టీ ద్వారా బన్నీ మనసులో నాటుకుపోయింది. డైరక్టర్స్ అందరూ ఇచ్చిన ఐడియాలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి, సీక్వెల్ ఎప్పటికైనా కార్యరూపం దాల్చడం గ్యారెంటీ.