సినిమా రివ్యూ: విశ్వరూపం 2

రివ్యూ: విశ్వరూపం 2 రేటింగ్‌: 2/5 బ్యానర్‌: రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ తారాగణం: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, పూజా కుమార్‌, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు సంగీతం: జిబ్రాన్‌ కూర్పు: మహేష్‌…

రివ్యూ: విశ్వరూపం 2
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: రాజ్‌ కమల్‌ ఫిలింస్‌
తారాగణం: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, పూజా కుమార్‌, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు
సంగీతం: జిబ్రాన్‌
కూర్పు: మహేష్‌ నారాయణ్‌, విజయ్‌ శంకర్‌
ఛాయాగ్రహణం: సాను వర్గీస్‌, షామ్‌దత్‌ సైనుద్దీన్‌
రచన, నిర్మాత, దర్శకత్వం: కమల్‌హాసన్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 10, 2018

మేకింగ్‌లో, యాక్షన్‌ కొరియోగ్రఫీలో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ మెయింటైన్‌ చేసిన 'విశ్వరూపం'కి సీక్వెల్‌ అంటే వుండే కుతూహలాన్ని, మళ్లీ అలాంటి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆశించిన వెళ్లిన ప్రేక్షకుల ఉత్సాహాన్ని కిల్‌ చేయడానికి ఈ సీక్వెల్‌ ఎక్కువ సమయం తీసుకోదు. ఆరంభ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించినా కానీ ఆ తర్వాత డైరెక్షన్‌లెస్‌గా మారిపోయిన ఈ చిత్రం కేవలం మొదటిభాగం సక్సెస్‌ని క్యాష్‌ చేసుకునేందుకు చేసిన అటెంప్ట్‌లా అనిపిస్తుందే తప్ప, నిజంగా సీక్వెల్‌కి తగ్గ కంటెంట్‌ వుందని ఎక్కడా అనిపించదు.

హీరోపై విలన్‌ పగ తీర్చుకోవడమనేదే సింగిల్‌ పాయింట్‌ అజెండా అయిన ఈ చిత్రంలో రెండు టెర్రరిస్ట్‌ ఎటాక్స్‌ని కూడా హీరో ఎలా తప్పిస్తాడనేది ఇంటర్వెల్‌, క్లయిమాక్స్‌గా పెట్టుకున్నారు. స్పై థ్రిల్లర్స్‌ అంటే ఆద్యంతం వేగంగా నడుస్తూ, ఊహలకి అందని మలుపులతో సర్‌ప్రైజ్‌ చేస్తూ నాన్‌స్టాప్‌ యాక్షన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తాయి. 'విశ్వరూపం' అలాంటి ఒక ఉత్తమ చిత్రమే అయినా కానీ ఈ సీక్వెల్‌ మాత్రం దారీ తెన్నూ లేకుండా, ఒక సన్నివేశంతో ఒక సన్నివేశానికి సంబంధం లేకుండా అసలు తెరపై ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా బోధ పడని అయోమయానికి గురి చేస్తుంది.

గత చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలకి ముందు, వెనుక జరిగిన ఉదంతాలని అక్కడక్కడా రివీల్‌ చేస్తూ అటు మొదటి కథకి ప్రీక్వెల్‌లా, ఆపై అప్పుడు జరిగిన దానికి సీక్వెల్‌లా సమాంతరంగా నడిపించిన విధానం ఏమంత రక్తి కట్టలేదు. పేట్రియాటిక్‌ ముస్లిమ్స్‌ గురించి జరిగే సంభాషణ, ప్రభుత్వంపై కమల్‌ మార్కు సెటైర్లు మినహా ప్రథమార్ధంలో గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు. యాక్షన్‌ సన్నివేశాలు చాలానే వున్నా కానీ ఏదీ ఎక్సయిట్‌ చేయలేదు. పూజ, ఆండ్రియాలతో కమల్‌ సన్నివేశాలతో వినోదం అందించాలనుకున్నారు కానీ అలాంటి కామెడీకి కాలం చెల్లిపోయింది.

విపరీతంగా బిల్డప్‌ ఇచ్చిన అండర్‌ వాటర్‌ సునామీ సీక్వెన్స్‌ కూడా చాలా చప్పగా తేలిపోయింది. విశ్వరూపం ఎంత పకడ్బందీగా అనిపిస్తుందో ఈ చిత్రం అంత నీరసంగా, నిస్సారంగా సాగుతుంటుంది. మొదటి భాగంలోని తగులు, మిగులు సన్నివేశాలతో ప్రథమార్ధం వరకు ఏదో కానిచ్చేసామని చేతులు దులిపేసుకున్నా, కంటెంట్‌ లేమి ద్వితియార్ధంలో కొట్టొచ్చినట్టు కనిపించేస్తుంది. సెకండ్‌ హాఫ్‌ మొత్తం సరిగ్గా నాలుగు సుదీర్ఘ సన్నివేశాలతో ముగిసిపోతుంది. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫస్ట్‌ హాఫ్‌లో ట్రై చేసేసిన కమల్‌ సెకండ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చారు.

వహీదా రెహమాన్‌ కారణంగా ఆ సన్నివేశాల వరకు ఓ మోస్తరుగా వున్నా, పతాక సన్నివేశాలు మాత్రం బాగా విసిగిస్తాయి. కేవలం కొన్ని క్షణాల టైమ్‌ ఫ్రేమ్‌ పెట్టి కమల్‌కి కఠిన పరీక్షలు పెట్టడం, అవన్నీ ఆయన సునాయాసంగా చేసేసారని చూపించడం చూడ్డానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేకుండా పోయింది. డూప్‌ సాయం లేకుండా నటించినందుకు కమల్‌ని అభినందించాలి కానీ ఈ పాత్రకి కావాల్సిన వేగం, చురుకు ఆయనలో కొరవడింది. యాక్షన్‌ సన్నివేశాలని మరీ ఆర్టిఫిషియల్‌గా రూపొందించడం వల్ల అవి కూడా ఎక్సయిట్‌ చేయలేకపోయాయి.

కమల్‌ ఎమోషనల్‌ సీన్‌లో తన అనుభవాన్ని చూపించినా కానీ చాలా సందర్భాల్లో ఆయన స్థాయి నటుడికి తగ్గ కంటెంట్‌ కాదని తెలుస్తూనే వుంటుంది. పూజా కుమార్‌, ఆండ్రియాల పాత్రలు, వారి మధ్య జరిగే సంభాషణలు మరికాసేపు విషయాన్ని సాగతీయడానికి మినహా పనికి రాలేదు. ఆండ్రియా అయినా టామ్‌బాయ్‌గా ఫర్వాలేదనిపిస్తుంది కానీ పూజా కుమార్‌ మాత్రం చాలా సందర్భాల్లో అవసరానికి మించి నటించేస్తుంది. రాహుల్‌ బోస్‌ పర్‌ఫార్మెన్స్‌ మినహాయిస్తే మిగిలిన వారిలో ఎవరి గురించి ప్రస్తావించుకోవడానికి కూడా ఏమీలేదు.

నేపథ్య సంగీతం బాగుంది. సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం కూడా యాక్షన్‌ దృశ్యాలని రియలిస్టిక్‌గా చూపించింది. బ్లాస్ట్‌ సీన్లలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ మెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో మేకింగ్‌ వేల్యూస్‌ చాలా బాగుంటే, కొన్ని సందర్భాల్లో మాత్రం బడ్జెట్‌ కొరత కనిపిస్తుంది. సెకండ్‌ హాఫ్‌ అయితే బడ్జెట్‌ లేకపోవడం వల్ల ఇలా ముగించేసారా అనే భావనని కూడా రేకెత్తిస్తుంది.

కమల్‌ అటెన్షన్‌ ఫర్‌ డీటెయిల్స్‌ పలు సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడిగా తనదైన ముద్ర వేయడానికి తగ్గ కంటెంట్‌ని ఆయనే సమకూర్చుకోకపోవడంతో తన చేతులు తానే కట్టేసుకున్నట్టయింది. ఏ కథ రాసినా కంటెంట్‌ పరంగా చాలా కేర్‌ తీసుకునే కమల్‌ ఈ చిత్రం విషయంలో మాత్రం రచయితగా అసలు రాణించలేకపోయారు. ఆ ఎఫెక్ట్‌ ఆయన డైరెక్షన్‌పై కూడా రిఫ్లెక్ట్‌ అవడంతో ఓవరాల్‌గా ఏ పాత్రలోను అలరించలేకపోయారు.

విశ్వరూపం చిత్రంలో ఎడిట్‌ అయిన కొన్ని దృశ్యాలని వాడేసుకోవడానికి అటు ఇటు కథ అల్లేసి సీక్వెల్‌ అంటూ సేల్‌ చేసేసారా అన్నంతగా ఆడియన్స్‌ చీటెడ్‌గా ఫీలయ్యేట్టు చేసిన ఈ సీక్వెల్‌ విశ్వరూపం కాదు కదా… కనీసం మామూలు రూపాన్ని కూడా ఆవిష్కరించలేకపోయింది. అగమ్యగోచరంగా సాగే ఈ సీక్వెల్‌ ప్రేక్షకులని అయోమయానికి గురి చేయడానికి, అసహనానికి లోను చేయడానికి మినహా ఈ విశ్వరూపం కొత్తగా సాధించిందేమీ లేదనే చెప్పాలి.

బాటమ్‌ లైన్‌: అస్తవ్యస్తం!
-గణేష్‌ రావూరి