స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌పై సినీ రాజకీయ వర్గాల్లో వున్న ఆసక్తి అంతా ఇంతాకాదు. నిజానికి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరచిన పుస్తకమే. జనానికి తెలియని 'పేజీలు' పెద్దగా లేవంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు. చివరి రోజుల్లో లక్ష్మీపార్వతిని పెళ్ళాడడం దగ్గర్నుంచి, రాజకీయంగా 'వెన్నుపోటు'ను చవిచూడటం వరకు.. అంతా అందరికీ తెల్సిన వ్యవహారమే. మరి, స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించడమంటే అందులో 'వెన్నుపోటు' ఎపిసోడ్ లేకపోతే ఎలా.? కానీ, ఆ వెన్నుపోటు ఎపిసోడ్‌ని సినిమాలో చూపిస్తే.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి 'పోటు' తప్పదు.
ఎంతైనా చంద్రబాబు, బాలయ్యకి 'బావ' కదా.! పైగా, తనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన చంద్రబాబు రుణాన్ని బాలయ్య తీర్చుకోవాల్సి వుంటుంది. అందుకే, 'వెన్నుపోటు' ఎపిసోడ్ విషయంలో బాలకృష్ణ చాలాకష్టాలు పడ్తున్నారు. ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌ని చంద్రబాబుకి అనుకూలంగా డిజైన్ చేసే విషయంలోనే దర్శకుడు తేజకీ, బాలకృష్ణకీ మధ్య 'క్రియేటివ్ డిఫరెన్సెస్' వచ్చాయి. దాంతో, బాలకృష్ణ నిర్మొహమాటంగా తేజని తప్పించేసిన విషయం విదితమే. తేజ ఔట్ అవడంతో క్రిష్ ఇన్ అయ్యాడు.
తాజాగా క్రిష్, బాలకృష్ణని వెంటేసుకుని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్నట్టు, ఈ భేటీలో 'చంద్రబాబు' పాత్రధారి రానా కూడా పాల్గొన్నాడండోయ్. వెన్నుపోటు ఎపిసోడ్‌ని చంద్రబాబుకి అనుకూలంగా మలచడమంటే చిన్న విషయంకాదు. ఐదారు వెర్షన్లను క్రిష్ సిద్ధం చేసుకుని మరీ, చంద్రబాబు దగ్గరకు వెళ్ళారట. వాటిని పూర్తిగా పరిశీలించిన చంద్రబాబు, ఓ వెర్షన్‌కి ఆమోదం తెలపడంతోపాటు, కొన్ని 'సవరణల్ని' కూడా సూచించినట్లు తెలుస్తోంది.
ఆ సవరణల మేరకు 'వెన్నుపోటు' వెర్షన్‌కి తుదిమెరుగులు దిద్దడంలో క్రిష్ బిజీగా వున్నట్లు సమాచారం. ఆ మెరుగులు, సవరణలు పూర్తయ్యాక ఇంకోసారి ఆ వెర్షన్, చంద్రబాబు వద్దకు వెళ్ళనుంది. ఇదిలా వుంటే, ఎన్టీఆర్ బయోపిక్‌లో అసలు 'వెన్నుపోటు' ఎపిసోడ్ వుండకపోవచ్చంటూ మరో వాదన విన్పిస్తోంది. కానీ, ఆ వెన్నుపోటు ఎపిసోడ్ లేకపోతే బయోపిక్‌కి అర్థంలేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్న వేళ.. దానికోసం, హీరో బాలకృష్ణ (నిర్మాత కూడా బాలయ్యే కదా..) పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
బాలయ్య ఆలోచనలకు తగ్గట్టుగా చంద్రబాబు సూచనల మేరకు 'వెన్నుపోటు' ఎపిసోడ్‌ని డిజైన్ చేయడమంటే క్రిష్‌కి అది కత్తి మీద సామే మరి.!