ఎమ్బీయస్‌: కుడి ఎడమైతే పొరబాటే లేదోయ్‌!?

తమిళ సినీసంగీతంలో మెలడీకి పట్టం కట్టిన స్వర్ణయుగం అనదగిన '50, '60లలో రారాజులుగా వెలిగిన సంగీతద్వయం విశ్వనాథన్‌-రామ్మూర్తి. 1952-65 మధ్య వారు సంగీతం సమకూర్చిన 100 సినిమాలు సంగీతపరంగా అగ్రశ్రేణికి చెందినవి. వారి ట్యూనులు…

తమిళ సినీసంగీతంలో మెలడీకి పట్టం కట్టిన స్వర్ణయుగం అనదగిన '50, '60లలో రారాజులుగా వెలిగిన సంగీతద్వయం విశ్వనాథన్‌-రామ్మూర్తి. 1952-65 మధ్య వారు సంగీతం సమకూర్చిన 100 సినిమాలు సంగీతపరంగా అగ్రశ్రేణికి చెందినవి. వారి ట్యూనులు తెలుగులోకి కూడా వచ్చాయి కాబట్టి, డైరక్టుగా పది తెలుగు సినిమాలకు సంగీతం అందించారు కాబట్టి వాళ్ల బాణీలన్నీ మనకు తెలిసినవే. వాళ్లిద్దరూ కలవడం ఒక వింతైతే, విడిపోవడం మరో వింత. ఎందుకు విడిపోయారో వారిద్దరూ ఎన్నడూ బయటకు చెప్పలేదు. ఇప్పుడు యిద్దరూ దివంగతులే కాబట్టి కారణాలు ఎవరికి వారు ఊహించుకోవలసినదే. ఆ చర్చలోకి వెళ్లే ముందు వాళ్లెలా కలిశారో తెలుసుకోవాలి.

ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ (1928-2015)ది పాల్‌ఘాట్‌కి చెందిన కుటుంబం. తండ్రి చనిపోతే తాత దగ్గర కణ్ణనూరులో పెరిగాడు. ఒక భాగవతారుగారి వద్ద హార్మోనియం నేర్చుకున్నాడు. పాటలు పాడేవాడు. నటుడై పోదామనుకుని కోయంబత్తూరుకి వెళితే ఆఫీసుబాయ్‌ పని దొరికింది. జూపిటర్‌ పిక్చర్స్‌ సంస్థ కోయంబత్తూరులోని సెంట్రల్‌ స్టూడియోను అద్దెకు తీసుకుని సినిమాలు తీసేది. అక్కడ సంగీతదర్శకుడు ఎస్‌ఎమ్‌ సుబ్బయ్య నాయుడు వద్ద హార్మోనిస్టుగా పాతిక రూపాయల జీతంపై చేరాడు. లీజు పూర్తయి వాళ్లు మద్రాసుకి షిఫ్ట్‌ అయిపోదామనుకున్నపుడు విశ్వనాథన్‌ను తీసేద్దామనుకున్నారు. అయితే సుబ్బయ్యనాయుడు 'నేను చేసిన పాటల్లో కొన్నిటికి అతనే ట్యూను కట్టాడ'ని నిజాయితీగా చెప్పి అతని ఉద్యోగాన్ని నిలిపాడు.

జూపిటర్‌ వాళ్లు విశ్వనాథన్‌ను మ్యూజిక్‌ డైరక్టరు సుబ్బురామన్‌ వద్ద హార్మోనిస్టుగా పని చేయమన్నారు. అక్కడ వయొలినిస్ట్‌గా పనిచేసే టికె రామమూర్తి (1922-2013) పరిచయమయ్యాడు. రామమూర్తిది తిరుచ్చి జిల్లా. కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన కుటుంబం నుంచి వచ్చాడు. తాత, తండ్రి కూడా వయొలిన్‌ విద్వాంసులే. సరస్వతీ స్టోర్స్‌ వారికి, ఎచ్‌ఎంవి రికార్డింగు సంస్థ వారి ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ మధ్యలో ఎవిఎం వాళ్లు పిలిస్తే వయొలిన్‌ వాయిస్తూ వుండేవాడు. ఎచ్‌ఎంవి సంగీతవిభాగం మూసివేయడంతో వచ్చి సుబ్బురామన్‌ వద్ద చేరాడు.

విశ్వనాథన్‌ కంటె రామమూర్తి ఆరేళ్లు పెద్దవాడు. మితభాషి. సిగ్గరి. లౌక్యుడు కాదు. విశ్వనాథన్‌ దీనికి పూర్తిగా విరుద్ధం. సందడైన వాడు. కలుపుగోరు మనిషి. మార్కెటింగు కళ తెలిసినవాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ సుబ్బురామన్‌ అభిమానం సంపాదించుకున్నారు. విశ్వనాథన్‌కు చురుకుదనం ఎక్కువ. పియానో కూడా నేర్చుకున్నాడు. గబగబా పైకి వచ్చేద్దామనే ఆత్రుత వుంది. సుబ్బురామన్‌ వద్ద పని చేస్తూనే ''జెన్నోవా'' (1953) అనే మలయాళ-తమిళ ద్విభాషాచిత్రానికి మూడో సంగీతదర్శకుడిగా చేరాడు. దానికి జ్ఞానమణి, కళ్యాణం అనే సీనియర్‌ సంగీతదర్శకులు అప్పటికే ఉన్నారు. ఇతను మూడోవాడు. కర్ణాటక సంగీతంలో జ్ఞానం లేదు కాబట్టి సరిగ్గా బాణీలు కట్టలేకపోయాడని సుబ్బురామన్‌ ఫీలయ్యారని అంటారు.

ఏది ఏమైనా ఆ సినిమా తయారవుతూండగానే 1952లో సుబ్బురామన్‌ హఠాత్తుగా చనిపోయారు. ఎన్నో సినిమాలకు సంగీతం అర్ధాంతరంగా ఆగిపోయింది. రామమూర్తి తదితరులకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు విశ్వనాథన్‌ చొరవ తీసుకుని 'మనిద్దరం జట్టు కడదాం. సుబ్బురామన్‌ వదిలేసిన బాణీలు, నేపథ్య సంగీతం పూర్తి చేసి, తక్కిన పాటలకు కూడా బాణీ కడదామని నిర్మాతలకు ఆఫర్‌ యిద్దాం.' అని ప్రతిపాదించాడు. రామమూర్తి తటపటాయించాడు. అయితే ఎన్‌ఎస్‌ కృష్ణన్‌, బిఎస్‌ రంగా లాటి వాళ్లు అతన్ని మెత్తబరిచారు.  జంటకు పేరు ఏం పెట్టాలా అనుకుని రామ్మూర్తి వయసులో పెద్దవాడు, రంగంలో సీనియర్‌ కాబట్టి 'రామ్మూర్తి-విశ్వనాథన్‌' అని పెట్టుకున్నారు. విశ్వనాథనే మాటామంతీ చూసుకున్నాడు. నిర్మాతలందరూ అమ్మయ్య అనుకున్నారు.

భానుమతి ''చండీరాణి'', వినోదా వారి ''దేవదాసు'', ''మరుమగళ్‌'' అలాగే పూర్తి చేశారు. దేవదాసులో ''జగమే మాయ'', ''ఇంత తెలిసి..'' పాటలకు రామమూర్తి బాణీ కూర్చాడు. త్రిభాషా చిత్రమైన ''చండీరాణి''లో కొన్ని పాటలకు విశ్వనాథన్‌ బాణీలిచ్చాడు. రామమూర్తి నేపథ్యం అందించాడు. అయితే ''చండీరాణి'' సినిమా టైటిల్స్‌లో సుబ్బురామన్‌ పేరుతో బాటు విశ్వనాథన్‌ పేరు ఒక్కటే కనబడుతుంది. ఇద్దరికీ కలిపి ''పణమ్‌'' అనే సినిమా ఆఫర్‌ వచ్చింది. అది శివాజీ రెండో సినిమా. ఎఎల్‌ శ్రీనివాసన్‌ నిర్మించగా, అతని సోదరుడు, కవి ఐన కణ్ణదాసన్‌ పాటలు రాయగా, రుణానిధి మాటలు రాయగా, హాస్యనటుడు ఎన్‌ఎస్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించాడు.

సినిమా పూర్తయి తెరపై పేర్లు వేసే సమయంలో కణ్ణదాసన్‌ మీ పేర్లు అటూయిటూ చేస్తే బాగుంటుంది అని సూచించాడు. కణ్ణదాసన్‌కు, విశ్వనాథన్‌కు బాగా దోస్తీ కుదిరింది. అతని పేరు ముందు ఉంటే అతనికి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుందనుకున్నాడో ఏమో తెలియదు. 'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్‌..' అనే ''దేవదాసు'' పాట గుర్తుకు తెచ్చుకుని రామ్మూర్తి సరేనన్నాడు. నిజానికి శంకర్‌-జైకిషన్‌లలో శంకర్‌ పెద్దవాడు, హుస్న్‌లాల్‌-భగత్‌రామ్‌లలో హుస్న్‌లాల్‌ పెద్దవాడు. రాజన్‌ నాగేంద్రలలో రాజన్‌ పెద్దవాడు. పెద్దవాళ్ల పేర్లే ముందుండడం ఆనవాయితీగా ఉంది. అయినా రామమూర్తి సర్దుకున్నాడు.

వాళ్లిద్దరి జోడీ అద్భుతంగా కుదిరింది. రామమూర్తి వెనక్కాల వుండి అన్నీ చూసుకునేవాడు. వయొలిన్‌పై బాణీ కట్టి చూపిస్తే విశ్వనాథన్‌ దాన్ని నిర్మాతల ముందు హార్మోనియంపై పలికించి తనే ముఖ్యుడైనట్లు బిల్డప్‌ యిచ్చేవాడు. ఆర్కెస్ట్రా, నేపథ్యసంగీతం వాటిలో రామమూర్తిదే పైచేయి. అయితే అతనిది రాజీపడే స్వభావం కాదు. అతనిపై గౌరవంతో విశ్వనాథన్‌ అతని మాట మన్నిస్తూ, నిర్మాతలతో లౌక్యంగా మాట్లాడుతూ, వాళ్లకు కావలసినట్లుగా ఒదుగుతూ, పబ్లిక్‌ రిలేషన్స్‌ పని బాగా చేసేవాడు. వాళ్ల పారితోషికం 1952లో 4000, 1965లో విడిపోయే నాటికి 30000కు చేరిందిట.

1960 తర్వాత రామమూర్తి డైరక్టర్లకు ఒకటి, రెండు ట్యూనుల కంటె ఎక్కువ యిచ్చేవాడు కాదు. ఇంకా యిమ్మంటే 'నీకు తెలియదు, యివి బావున్నాయి' అనేవాడు. గీతం నచ్చకపోతే 'దీనికి బాణీ యివ్వడం అనవసరం. మళ్లీ రాయించి పట్టుకురండి' అనేవాడు. దీనివలన కొంతమంది దర్శకులతో, నిర్మాతలతో అతనికి పడలేదు. 'చిత్రాలయ' శ్రీధర్‌ వారిలో ఒకడు. అతనికి ఎఎం రాజాతో పేచీ వచ్చిన తర్వాత విశ్వనాథన్‌-రామ్మూర్తిలను పెట్టుకున్నాడు. అయితే ''కాదలిక్క నేరమిల్లయ్‌'' (తెలుగులో ప్రేమించి చూడు) సినిమాలో ఒక పాటకు కట్టిన ట్యూన్‌ మార్చమంటే రామమూర్తి మార్చనన్నాడు. కణ్ణదాసన్‌ ''కరుప్పణమ్‌'' అనే సినిమా తీస్తూ పెట్టుబడి పెట్టమని రామమూర్తిని అడిగితే పెట్టనన్నాడు. దాంతో అతను కక్ష కట్టాడు. ఈ తిక్క మనిషితో విడిపోతే తప్ప నీకు భవిష్యత్తు లేదు అని విశ్వనాథన్‌కు నూరిపోశాడు. శ్రీధరూ అదే సలహా యిచ్చాడు.

వీటికి తోడు శంకర్‌ జైకిషన్‌ల మధ్య గాయని శారద అంశం వచ్చినట్లే ఎల్‌ఆర్‌ ఈశ్వరి అంశమొకటి వీరి మధ్య వచ్చిందంటారు. ఈశ్వరిని కెవి మహదేవన్‌ పరిచయం చేసినా విశ్వనాథన్‌-రామ్మూర్తి సంగీతం అందించిన ''పాశమలర్‌''(1961, తెలుగులో రక్తసంబంధం)లో 'బంగారుబొమ్మ రావేమే..' ఒరిజినల్‌ పాట పాడడంతో గుర్తింపు వచ్చింది. అప్పుడామెకు 22 ఏళ్లు. విశ్వనాథన్‌కు 33. విశ్వనాథన్‌కు ఆమె చేత ఎక్కువగా పాడిద్దామని పట్టుబట్టేవాడని, అది రామమూర్తికి రుచించలేదని వినికిడి. నిజానిజాలు యిప్పటిదాకా బయటకు రాలేదు. ఏది ఏమైతేనేం ''ఆయురత్తిల్‌ ఒరువన్‌'' (1965) తర్వాత యిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రామమూర్తికి చాలా అన్యాయం జరిగిందంటారు వారితో పనిచేసిన వారు.

అప్పటికి చేతిలో ఉన్న 27 సినిమాలలో రామమూర్తి చేసిన బాణీలెన్నో ఉన్నా అన్ని సినిమాలనూ కణ్ణదాసన్‌ సహాయంతో విశ్వనాథన్‌ తన పేర ప్రకటించుకున్నాడని, ఎవరితో సత్సంబంధాలు లేని రామమూర్తి దాన్ని అడ్డుకోలేక పోయాడని అంటారు. విడిపోయాక విశ్వనాథన్‌ దాదాపు 600 సినిమాలు చేయగా రామమూర్తి 1966-86 మధ్య 16 సినిమాలు మాత్రం చేయగలిగాడు. ఆకాశవాణికి పనిచేస్తూ ఆల్బమ్స్‌ అవీ యిచ్చాడు. అందువలన జోడీలో విశ్వనాథనే ప్రతిభావంతుడని, రామమూర్తి అసిస్టెంటు మాత్రమేననీ అనుకోవడానికి ఆస్కారం కలిగింది.

పేరులో లాగానే రామమూర్తి వెనకబడిపోయాడు. కానీ ఇద్దరూ కలిసి అందించిన సంగీతానికి, తర్వాతి రోజుల్లో విశ్వనాథన్‌ విడిగా అందించిన సంగీతాన్ని పోల్చి చూస్తే మెలొడీ విషయంలో లోటు కొట్టవచ్చినట్లు కనబడుతుంది. 30 ఏళ్ల పాటు వారు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉన్న తర్వాత ఓ రోజు విశ్వనాథన్‌ రామమూర్తికి కబురంపించాడు. ఇద్దరూ కలిసి ''ఎంగిరిందో వందాన్‌'' (1995) సినిమా చేశారు. సినిమా, సంగీతం రెండూ ఫెయిల్‌ కావడంతో కథ ముందుకు సాగలేదు.
(ఫోటో – నలుపు తెలుపు ఫోటో రామమూర్తి-విశ్వనాథన్‌, వర్ణచిత్రం విశ్వనాథన్‌-రామమూర్తి)
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
[email protected]