కొంతమంది రైటర్లకు కొన్ని విభాగాల్లో పట్టు వుంటుంది. ఆచార్య ఆత్రయ మాంచి డెప్త్ వున్న డైలాగులు రాసేవారు. కానీ ఆయన పనిచేసిన సినిమాలకే అప్పలాచార్య కూడా పని చేసేవారు. ఆయన ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ రాసేవారు. ఆ తరువాత తరువాత టాలీవుడ్ పరిస్థితుల మారాయి. అన్ని రంగాలు హ్యాండిల్ చేసే రైటర్లు వచ్చారు. కానీ ఈ మధ్యన మాంచి విషయం, డెప్త్ వున్న డైలాగులు రాస్తారని పేరు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ మాత్రం కామెడీ హ్యాండిల్ చేయలేరన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆయన మాంచి ఆలోచింపచేసే డైలాగులు రాయగలరని, అందులో తిరుగులేదని, కానీ కామెడీ దగ్గర ఫెయిల్ అవుతున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇటీవల వచ్చిన సాక్ష్యం సినిమాకు ఆయనే డైలాగ్ రైటర్. ఆ సినిమాలో కామెడీ సరిగ్గా పండలేదు. పైగా కాస్త పాతవాసన వుందన్న కామెంట్లు వినిపించాయి. ఇక ఆ మధ్య వచ్చిన ఖైదీ 150 సినిమాకు బుర్రా మంచి డైలాగులు అందించారు. కానీ ఆ సినిమాలో బ్రహ్మీ, ఆలీ కామెడీ ట్రాక్ కూడా కాస్త పాతవాసనలతోనే వుంటుంది.
సర్దార్ గబ్బర్ సింగ్ లో బ్రహ్మీ-పవన్-తదితరుల మధ్య కామెడీ ట్రాక్ కూడా ఓల్డ్ టైప్ లోనే వుంటుంది. బుర్రాకు పేరు తెచ్చిన కృష్ణం వందేజగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, మహానటి ఇవన్నీ సీరియస్ టోన్ వున్న సినిమాలే. ఈ జోనర్ లో బుర్ర తిరుగులేని పేరు తెచ్చుకుంటున్నారు.
కానీ కమర్షియల్ సినిమాలకు వచ్చేసరికి కామెడీ ట్రాక్ కూడా రాయాల్సి వుంటుంది. అక్కడ మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఇకపై బుర్రా చేత డెప్త్ డైలాగులు రాయించుకుని, కామెడీ ట్రాక్ వేరే వాళ్లతో రాయిస్తారేమో, పూర్వకాలంలో మాదిరిగా.