శతృవు శతృవు మనకు మిత్రుడు అనే పాతకాలం సామెత ఇప్పడు కాంగ్రెస్ పార్టీ పాలిట వరంగా మారుతోంది. భాజపా వ్యవహారాలు కిట్టని పార్టీలు అన్నింటికీ కాంగ్రెస్ పార్టీనే శరణాలయం మాదిరిగా కనిపిస్తోంది. చాలావరకు దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్ కావచ్చు, భాజపా కావచ్చు, వారి అండతోనే ముందుకు వెళ్లాలి. కేంద్రంలో అందరూ కలిసి అందలం ఎక్కించేవారే కానీ, ఎక్కేది కాంగ్రెస్ నో, భాజపానో మాత్రమే. దీనికి కారణం, ప్రాంతీయ పార్టీల నేతలు అందరికీ ప్రధాని పదవిపై ఆశ వుండడమే. దాంతో మధ్యేమార్గంగా నాయకత్వ పగ్గాలు మాత్రం మళ్లీ జాతీయ పార్టీలకే అందుతున్నాయి.
ఇలాంటి టైమ్ లో భాజపా ప్రతి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చే ఓ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అది ఆలస్యంగానైనా ప్రాంతీయ పార్టీలు గమనించాయి. దీంతో దాన్ని ఓడించి, గద్దె దింపితే తప్ప తమకు మనుగడ లేదని అర్థం చేసుకున్నాయి. అందుకే ఇప్పడు దాదాపు దేశంలోని మెజారిటీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పక్కన చేరుతున్నాయి. భాజపాను తాము నేరుగా ఓడించలేమని, తమకు ముందుగా ఓ జాతీయ పార్టీ వుండక తప్పదని అర్థం చేసుకున్నాయి. అందుకే కాంగ్రెస్ నీడన చేరేందుకు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఒకటికి రెండు ప్రాంతీయ పార్టీలు రెడీ అవుతున్నాయి.
ఇది ఎంతవరకు చేరింది అంటే, కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద పుట్టిన తెదేపాలాంటి పార్టీలు కూడా ఆఖరికి భాజపాను ఏమీ చేయలేక, తమ సిద్దాంత రాద్దాంతాలను సైతం పక్కనపెట్టి, కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాయి. 2014లో ఇదే కాంగ్రెస్ పార్టీని తమ ప్రత్యర్థులతో రంకు కలిపిన తెదేపా ఇప్పుడు తానే దానిపక్కలో చేరేందుకు వ్యూహాలు రచించుకుంటోంది. అయితే ప్రజల్లో ముందుగా ఆ తరహా వార్తలు వ్యాప్తి చెందకుండా కాస్త జాగ్రత్తపడుతోంది. అంతే.
తమిళనాట కొత్త భావజాలంతో ముందుకు వెళ్తారు అనుకున్న కమల్ హాసన్ కూడా కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధం అంటున్నారు. ఇక కాంగ్రెస్ పై కాలుదువ్విన కర్ణాటక జనతాదళ్ అధికారం కోసం ఏం చేసిందో అందరికీ తెలిసిందే. మహారాష్ట్రలో శరద్ పవార్ కాంగ్రెస్ నేత సోనియాకు పదవీకాంక్ష లేదని కీర్తిస్తున్నారు.
ఇలా కాంగ్రెస్ పల్లకీ మోయడానికి సిద్ధమవుతున్న బోయీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందరూ కలిసి ఆ పార్టీని అందలం ఎక్కించేలాగే వున్నారు చూస్తుంటే. కేంద్రంలో మీరు.. రాష్ట్రంలో మేమూ అనే ఉభయ కుశలోపరి ఒప్పందం బెటరు కదా? భాజపా మాదిరిగా టోటల్ గా అంతా మాదే అనే వ్యవహారం కన్నా? అందుకే కాంగ్రెస్ ఇప్పుడు అందరికీ ముద్దువస్తోంది.