విడుదల ముందుదాకా సెన్సారు చేయించకుండా, సినిమా ఎవరికీ కొంచెం కూడా చూపించకుండా అన్నీ గుట్టుగా దాచి, ఆపైన విడుదల చేస్తున్న రోజులు ఇవి. అలాంటిది సినిమా విడుదలకు నాలుగు రోజులు ముందే చూపించేయడం అంటే ఏమనాలి? పైగా సినిమా మీద టాక్ వినే, విడుదల ముందురోజు డబ్బులు తగ్గించి కట్టే బయ్యర్లకే సినిమా చూపించి, డబ్బులు కట్టమని చెప్పడం అంటే ఇంకేమనాలి?
నిర్మాత దిల్ రాజుకు శ్రీనివాస కళ్యాణం సినిమా మీద వున్నది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్సిడెన్సా? పైగా ఇప్పుడు మరో స్కీము కూడా అనౌన్స్ చేసారు. ఈ శ్రావణంలో పెళ్లి చేసుకునే జంటలు వాళ్ల శుభలేఖలు పంపితే పట్టుబట్టలు ఇంటికే పంపిస్తారట. శ్రావణంలో పెళ్లిళ్లు తక్కువ అవుతాయా? లిమిట్ ఏమీలేదు అని యూనిట్ వర్గాలబోగట్టా. పైగా 30, 40 జంటలకు యూనిట్ జనాలే బట్టలు అందిస్తారట. దీనికి కాస్త గట్టిగానే ఖర్చయ్యేలా వుంది.
జంటకు రెండువేల రూపాయలు అనుకున్నా, వేలల్లో శుభలేఖలు వచ్చే అవకాశం కూడా వుంది. ఏమైనా దిల్ రాజు శ్రీనివాసకళ్యాణం సినిమా మీద ఓవర్ ది బోర్డ్ వెళ్లిపోతున్నారేమో? ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఇంత యునానిమస్ ప్రీరిలీజ్ పాజటివ్ టాక్ వచ్చిన సినిమా మరోటిలేదు. అందుకే దిల్ రాజు ఫిదా అయిపోతున్నారేమో?