ఎన్టీఆర్ బయోపిక్ రకరకాలుగా మారుతోంది. మారినపుడల్లా యూనిట్ లో వున్న రైటర్ పెద్దాయిన ఒకరు బయటకు ఫీలర్లు వదలుతూ అలసి పోతున్నారని బోగట్టా. ఇప్పుడు ది లేటెస్ట్.. అప్పుడు అది లేటెస్ట్ అంటూ. ఈలోగా సినిమాలో నిమిషం, అయిదు నిమిషాలు కనిపించేవారంతా, ఎవరికి వారు ట్వీట్ లు చేసుకుని బయోపిక్ లో వున్నామోచ్ అంటున్నారు. అసలు వ్యవహారం చూస్తుంటే బయోపిక్ పూర్తిగా రాజకీయ ప్రయోజిత సినిమాగా మారిపోతున్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే ఎన్టీఆర్ అంటే సినిమా, ఆ తరువాతే రాజకీయం, తెలుగువారి ఆత్మగౌరవం వంటి వ్యవహారాలు. అయితే ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలు మొత్తం తొలిసగంలోకి కుదించేస్తున్నారు. పాపం, ఎన్టీఆర్ పాత్రలు అన్నింటిలో తనను చూసుకోవాలనే బాలయ్య కోరిక ఆ విధంగా అణగారిపోతోంది. ఎందుకంటే, కేవలం మహా అయితే గంటంపావులో ఎన్ని క్యారెక్టర్లు చూపిస్తారు.
ఇక అసలు కథ, రాబోయే ఎన్నికలకు ఉపయోగపడే అసలు కథ అంతా మలి సగంలో అన్నమాట. ఢిల్లీ పార్టీ గద్దెదింపడం, ప్రజా ఉద్యమాలు, వాటిల్లో చంద్రబాబు పాత్ర, ఆ వీరోచిత పోరాటం అన్నీ సినిమా క్లయిమాక్స్ ముందు. ఆ విధంగా తెలుగుదేశం పోరాటాన్ని మరోసారి రానా అనే చంద్రబాబు పాత్రధారి సాక్షిగా జనాలకు చూపించాలి.
ఒకె అంతా బాగుంది. కానీ ఆనాటి ప్రజాపోరాటంలో కీలకపాత్ర పోషించింది భాజపా కూడా. వెంకయ్య నాయుడు, ఆరెస్సెస్ జనాలు కూడా అందులో అప్పట్లో కీలకంగా పాల్గొన్నారు. మరి ఇప్పుడు అలా అని భాజపా సహాయం వున్నట్లు కానీ, వెంకయ్య సాయం వున్నట్లు గానీ చూపించగలరా?
సరే, కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించక తప్పదు ఈ ఎపిసోడ్ తో. మరి రాబోయే ఎన్నికల్లో అదే కాంగ్రెస్ తో పరోక్షపొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారే? మరి దాని సంగతేమిటి? అయినా బాహుబలి వన్ ఎక్కడ ఆపారు. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినపుడు. అప్పుడు కదా దేశం అంతా ఎందుకు వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడుకుంది,. ఇప్పుడు బయోపిక్ కూడా అలాంటి చోట ఆపితే.. ఉంటుంది.. నా సామిరంగా.. పార్ట్ 2 (ఇది ఇప్పుడు చెప్పరు.. సినిమా చివర్న కార్డ్ వేస్తారు) పై ఆసక్తి అదిరిపోద్ది కదా?
దీనిపై బయోపిక్ ఆస్థాన రచనా విద్వాంసులు ఎప్పడు ఫీలర్లు వదులుతారో? చూడాలి. కానీ ఏమైనా రాజకీయం సగం ప్లేస్ ఆక్యుపై చేస్తే, మహిళలు సినిమాకు వస్తారా? మహానటి లాంటి సినిమా అంటే మహిళలు కిలోమీటర్ లైన్ లో వున్నారు కానీ, రాజకీయాలు, స్లోగన్ లు అంటూ కిలోమీటర్ దూరంలో వుంటారు. అప్పుడు వందకోట్ల మార్కెట్ అన్నది కాస్త అనుమానంలో పడుతుంది.