రివ్యూ: చి|| ల|| సౌ||
రేటింగ్: 2.75/5
బ్యానర్: సిరుని సినీ కార్పొరేషన్, మనం ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: సుషాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హాసన్, జయప్రకాష్, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖ రామన్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
కూర్పు: చోటా కె. ప్రసాద్
ఛాయాగ్రహణం: ఎమ్. సుకుమార్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలసాల, హరి పులిజాల
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
విడుదల తేదీ: ఆగస్ట్ 3, 2018
చి|| ల|| సౌ|| అనే చిన్న చిత్రం ఆసక్తికరంగా మారడానికి చాలా కారణాలున్నాయి. నటుడైన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారడం, ఇంతకాలం మాస్ సినిమాలకే కట్టుబడిన సుషాంత్ పంథా మార్చుకోవడం… అన్నిటికీ మించి ఈ చిత్రానికి నాగార్జున నిర్మాణ భాగస్వామిగా చేరడం. చక్కని టైటిల్, ఆసక్తి రేకెత్తించే ట్రెయిలర్స్‌తో ఈ చిన్న చిత్రం సినీ ప్రియుల దృష్టిని బాగానే ఆకట్టుకుంది. నిర్మాణం పూర్తి చేసుకున్నాక నాగార్జున తన పేరుని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్రాండింగ్‌ని ఈ చిత్రానికి జత చేయడానికి ముందుకొచ్చారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ప్రత్యేకత అయితే వుందనేది స్పష్టమైంది.
దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ 'పెళ్లి చూపులు' థీమ్‌కి ఒక చిత్రమైన స్క్రీన్‌ప్లేతో, ఒక కొత్త రకం ప్రేమకథని చూపించాడు. భిన్న ధృవాలైన అమ్మాయి, అబ్బాయి అనుకోకుండా పెళ్లిచూపుల్లో కలిసి ఒక్క రాత్రిలో ఒకరికి ఒకరు తగిన జోడీ అని ఎలా తెలుసుకున్నారనేది ఈ చిత్రం కథ. ఈతరం యువతకి పెళ్లి పట్ల వున్న అభిప్రాయాలని ఇతివృత్తంగా తీసుకుని ఇటీవల పలు చిత్రాలొచ్చాయి. పెళ్లిచూపుల్లో అనుకోకుండా ఒక గదిలో ఇరుక్కుపోయిన జంట కథని 'పెళ్లిచూపులు' చిత్రంలో చూసాం. ఈ చిత్రం కూడా ఇంచుమించు అదే తరహాలో మొదలవుతుంది.
చిరంజీవి|| అర్జున్‌కి (సుషాంత్) 'చిరంజీవి|| లక్ష్మీ|| సౌభాగ్యవతి||'ని వెతికి పెట్టాలనేది అతని తల్లి (అను హాసన్) ఆరాటం. కానీ అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేది అర్జున్ పోరాటం. పెళ్లిచూపులకి వెళ్లి పెద్దల మధ్య ఇబ్బంది ఫీలవుతున్నాడని, అమ్మాయినే ఇంటికి రప్పించి, అక్కడే వారి మధ్య మీటింగ్ ఏర్పాటు చేస్తుందతని తల్లి. పెళ్లి చేసుకోరాదనేది అర్జున్ ఖచ్చితాభిప్రాయం అయితే, ఎలాగైనా పెళ్లి చేసుకుని 'బైపోలార్' అయిన తల్లిని (రోహిణి) సంతోషపెట్టాలనేది చి|| ల|| సౌ|| అంజలి (రుహాని) నిశ్చితాభిప్రాయం. అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకోననే అబ్బాయికి, అర్జంటుగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చూస్తోన్న అమ్మాయికి మధ్య కొన్ని గంటల్లో ఏమి జరిగింది. ఈ సమయంలో వారికి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని ఎలా తెలిసింది అనేది కథ.
పెళ్లిచూపుల్లో కలిసిన ఇద్దరు వ్యక్తులు ఒక్క రాత్రిలో విచిత్రమైన పరిస్థితులని ఎదుర్కోవడం, తద్వారా ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, ప్రేమలో పడడం అనేది ఆసక్తికరమైన కాన్సెప్ట్‌లానే వుంది. అయితే ఇక్కడ వ్యక్తుల స్వభావాలు, వారికున్న భావజాలం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్ వచ్చినా అయిదేళ్ల వరకు పెళ్లి చేసుకోను' అని పదే పదే చెప్పే కథానాయకుడు, తనని చూడ్డానికి వచ్చిన అమ్మాయి చెప్పిన కన్నీటి కథతో అప్పటికప్పుడు కన్విన్స్ అయిపోయి 'కనక్ట్ అయిపోయా' అంటాడు. 'కొన్నాళ్లు ఒకరిని ఒకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకుందాం' అన్నవాడే 'అయితే పెళ్లికి ఓకే చెప్పు. లేదంటే లేదు' అని ఆమె అనగానే 'సరే' అనేస్తాడు. 'ఇప్పుడు సరేనని రేపు కాదన్నావంటే మా అమ్మ ఏమైపోతుంది? వద్దు' అనేస్తుందామె.
అంతవరకు పెళ్లే వద్దని తన ఐడియాలజీని అంత ఖచ్చితంగా చెప్పిన కుర్రాడు అప్పటికప్పుడు మనసు మార్చుకుని, ఆమె గురించి ఏమీ తెలియకుండానే పెళ్లి చేసేసుకుంటానని మాట ఇచ్చేయడం ఏమిటి? చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతే ట్యూషన్లు చెప్పి తల్లి, చెల్లిని పోషించిన అమ్మాయి వ్యక్తిత్వం ఎలా వుంటుంది? అలాంటి వ్యక్తిత్వమున్న అమ్మాయి పెళ్లి కోసం అంత బేలగా ప్రాధేయపడుతుందా? 'మదర్ సెంటిమెంట్' అని సర్ది చెప్పుకోవచ్చు కానీ… రాహుల్ రవీంద్రన్ రాసుకున్న పాత్రలు రెండూ చాలా స్ట్రాంగ్ 'కాన్‌ఫ్లిక్ట్' వున్న క్యారెక్టర్లు. ఒక పరిపూర్ణమైన ప్రేమకథని ఫుల్ డ్రామాతో నడిపించడానికి స్కోప్ వున్న బలమైన రెండు పాత్రలని తీసుకుని, వాటిని ఒక్క రాత్రి అనే టైమ్ ఫ్రేమ్‌లో బంధించేసి, అంతలోనే ప్రేమలో పడిపోవాలి, తెల్లవారే సరికి పెళ్లి చేసుకోవాలి లాంటి ఎలిమెంట్స్ పెట్టడం పాత్రౌచిత్యం అనిపించుకోదు. ఇక అంత బలమైన పాత్రల్ని దగ్గర చేయడం కోసం 'కన్వీనియంట్' సిట్యువేషన్స్ చాలానే జరుగుతాయి ఆ రాత్రి.
ఇద్దరి మధ్య వున్న కాన్‌ఫ్లిక్ట్ ఇంటర్వెల్‌కే దాదాపుగా తొలగిపోయిన తర్వాత ఇక ఈ కథని ఎటు తీసుకెళ్తాడు, ఇంకో గంట సేపు ఎలా నడుపుతాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతవరకు నడిచిన లవ్‌స్టోరీ కాస్తా ఒక మర్డర్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది. 'ఏం జరుగుతోంది?' అనుకునేలోగానే దానిని ఫన్నీగా ఎండ్ చేసేసి మళ్లీ రెగ్యులర్ ట్రాక్ ఎక్కించేస్తారనుకోండి. అయితే ఇక్కడ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం కోసం కన్వీనియంట్ రూట్‌ని దర్శకుడు ఎన్నుకున్నాడనిపిస్తుంది. గంట క్రితం పరిచయమైన అమ్మాయి కోసం చేయని నేరం మీద వేసుకోవడానికి, లైఫ్ సేవింగ్స్ మొత్తం ఇచ్చేయడానికి అతను సిద్ధపడతాడు. ఎందుకు? 'కనక్ట్' అయ్యానని చెప్పాడు కనుక ఆ కనక్షన్‌లో భాగంగానే తన ఇరవయ్యేడళ్ల స్వప్నాలని వదిలేసుకుని ఆమె కోసం త్యాగం చేసేస్తున్నాడనుకోవాలో ఏమో.
అసంబద్ధంగా జరిగే పలు సన్నివేశాల అనంతరం తెల్లవారేలోగా సోల్‌మేట్స్ అయిపోయే ఈ జంట లవ్‌స్టోరీ అందరికీ సెన్సిబుల్‌గా, రీజనబుల్‌గా అనిపించకపోవచ్చు. అయితే ఎమోషన్స్‌ని అండర్‌ప్లే చేస్తూ షుగర్ కోటింగ్‌తో చెప్పిన విధానం వల్ల కాలక్షేపం అయిపోతుంది. రాహుల్ రవీంద్రన్‌కి మంచి సెన్సాఫ్ హ్యూమర్ వుంది. వెన్నెల కిషోర్ పాత్రతో అతను పండించిన వినోదం ఈ చిత్రానికి పెద్ద బోనస్ అయింది. ఎవరో అమ్మాయికి పంపాలనుకున్న లవ్ మెయిల్ తన టీమ్ అందరికీ పంపించేయడం, పధ్నాలుగు ఫ్లోర్లు ఎక్కేస్తానంటూ క్యాలిక్యులేషన్ చెప్పి ఆరవ ఫ్లోర్ ఎక్కేసరికే ఆయాసంతో కుప్ప కూలిపోవడం, అర్థరాత్రి జ్యూస్ కోసం పక్కింటి ఆంటీ దగ్గరకి వెళ్లడం వగైరా సన్నివేశాలన్నీ బాగా నవ్విస్తాయి.
ఎక్కువ కష్టపడకుండానే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ మాడ్యులేషన్‌తో కామెడీ పండించే వెన్నెల కిషోర్‌కి వున్న స్క్రీన్ టైమ్ తక్కువ అయినా కనిపించిన ప్రతిసారీ విపరీతంగా నవ్విస్తాడు. అలాగే 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ రాహుల్ రామకృష్ణ చేసే 'పన్నెండు లక్షల బేరం' సీన్ కూడా బాగానే పండింది. అసలు కథ కంటే ఇలాంటి కొసరు సన్నివేశాలే ఈ చిత్రాన్ని నిలబెట్టాయి. ఒక్క రాత్రిలో ఇద్దరు బలమైన వ్యక్తిత్వమున్న వ్యక్తులు ప్రేమలో పడిపోయి జీవిత భాగస్వామిని ఫిక్స్ అయిపోవాలంటే మాత్రం ఇందులో చూపించిన కారణాలు అయితే ఖచ్చితంగా సరిపోవు. టైమ్ ఫ్రేమ్ లేకపోతే రొటీన్ అయిపోతుందేమోననే అభిప్రాయంతోనో, మరేమిటో కానీ ఆ కాసేపట్లోనే జీవితంలోని అతి పెద్ద ఈవెంట్‌ని సింపుల్‌గా కానిచ్చేయడం లాజిక్‌కి అందదు.
ఎనాలిసిస్ జోలికి పోకుండా కేవలం టైమ్‌పాస్ కోసమని చూసేట్టయితే మాత్రం ఇందులో ఫన్ చాలానే వుంది. కేవలం కామెడీ సీన్లే కాకుండా సుషాంత్, రుహాని మధ్య కాన్వర్‌జేషన్స్ కూడా బాగున్నాయి. సుషాంత్‌కి నటుడిగా తనలో మనకి తెలియని కోణం చూపించే వీలు చిక్కింది. తన పాత్రకి అతను బాగానే న్యాయం చేసాడు. అలాగే రెగ్యులర్‌కి భిన్నమైన లక్షణాలున్న పాత్ర అయినా రుహానీ అనుభవమున్న నటిలా తన పాత్రని చక్కగా పోషించింది. వెన్నెల కిషోర్ గురించి ముందే చెప్పేసుకున్నాం. నేపథ్యంలో వచ్చే పాటలు బాగున్నాయి.
నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, కళ, కూర్పు అన్నీ చక్కగా కుదిరాయి. పెద్దగా ఖర్చు అవసరం పడని చిత్రం కనుక నిర్మాతలకి లాభమే తప్ప నష్టానికి ఆస్కారం లేనట్టే అని చెప్పాలి. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా కొన్ని సందర్భాల్లో మెప్పించాడు. ముఖ్యంగా లైటర్‌వీన్ సీన్స్ బాగా హ్యాండిల్ చేసాడు. చిన్న చిన్న మాటలతో ఎమోషన్స్ కూడా బాగానే పలికించాడు. కొత్త రకం రొమాన్స్ చూపించాలనే అతని తపన మెచ్చుకోతగింది. కన్వీనియన్స్ కంటే కన్విన్సింగ్‌గా ఆ ప్రేమకథ డీల్ చేసినట్టయితే ఇంకా బాగుండేది.
ప్రధానంగా లవ్‌స్టోరీ అయినా కానీ కామెడీనే సేవియర్ అయింది. కనుక హాస్య సన్నివేశాల కోసం చూసేవారికి కాలక్షేపమైపోతుంది. పెళ్లిచూపులు లాంటి రిలేటబుల్ క్యారెక్టర్స్, ఆకట్టుకునే ఎమోషన్స్ వున్న లవ్‌స్టోరీ అయితే మాత్రం కాదిది.
బాటమ్ లైన్: కాలక్షేపానికి..!
-గణేష్ రావూరి