నాగ్.. చైతన్య.. శౌర్య.. ఢీ అంటే ఢీ

ఇటుచూస్తే నాగచైతన్య.. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యయేల్ లాంటి స్టార్ కాస్ట్, మారుతి లాంటి డైరక్టర్, హారిక హాసిని లాంటి బ్యానర్ బ్యాకప్. అటుచూస్తే నాగశౌర్య వరకు ఓకె. కానీ శ్రీనివాస చక్రవర్తి లాంటి కొత్త…

ఇటుచూస్తే నాగచైతన్య.. రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యయేల్ లాంటి స్టార్ కాస్ట్, మారుతి లాంటి డైరక్టర్, హారిక హాసిని లాంటి బ్యానర్ బ్యాకప్. అటుచూస్తే నాగశౌర్య వరకు ఓకె. కానీ శ్రీనివాస చక్రవర్తి లాంటి కొత్త డైరక్టర్. కొత్త హీరోయిన్లు. ఐరా క్రియేషన్స్ రెండో సినిమా. అలాంటి ప్రొఫైల్ తో ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి.

శైలజారెడ్డి థియేటర్ మార్కెట్ 25కోట్లు. నర్తనశాల థియేటర్ మార్కెట్ 12కోట్లు. ఆ విధంగా నర్తనశాల, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు ఆగస్టు నెలాఖరులో ఢీకొంటున్నాయి. ఆగస్టు 30న నర్తనశాల విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ఉష నిన్నటి ప్రెస్ మీట్ లో సూత్రప్రాయంగా చెప్పేసారు. ఆ మధ్య ఈ సినిమా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వుండొచ్చు అని వినిపించింది. కానీకాదని ఆగస్ట్ 30న పక్కా అని ఇప్పుడు క్లియర్ అయింది.

శైలజారెడ్డి అల్లుడు సినిమా ఆగస్టు 31న అని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అందులో ఆశ్చర్యంలేదు. సాధారణంగా ఈ రోజుల్లో సోలో డేట్ కోసం అందరూ చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశం వుండి కూడా నర్తనశాల వారం ముందుగానే, అది కూడా అనుకున్నట్లుగానే ఆగస్టు 30నే రావాలని చూస్తోంది. ఇంతకుముందు నిర్మించిన ఛలో సినిమా విజయం ఇచ్చిన ధీమానో? లేదా ఈ సినిమా మీద విశ్వాసమో మరి. ఒకేలా కనిపిస్తున్న సినిమాలు ఈ రెండూ. అందువల్ల కంపారిజన్ కచ్చితంగా వుంటుంది.

ఎవరికి ఏమాత్రం మార్కులు తగ్గినా కష్టమే. జోనర్ లు వేరయినపుడు మార్కులు తేడావున్నా ఫరవాలేదు. యూత్ ఫుల్ ఫ్యామిలీ జోనర్ అన్నపుడు ఒకదానివైపే మొగ్గు వుండే ప్రమాదం వుంది. అయితే శైలజారెడ్డికి ఓ అడ్వాంటేజ్ వుంది. నర్తనశాల ఓరోజు ముందుగా విడుదలవుతుంది కాబట్టి ఓపెనింగ్స్ చీలిపోవడం లాంటి సమస్య అంతగా వుండదు. బాహుబలి తరువాత రమ్యకృష్ణ సినిమా కాబట్టి, అదో అడ్వాంటేజ్ వుంటుంది. కంటెంట్ కీలకమే కానీ, కాస్త బజ్, ఆసక్తి ఆ విధంగా శైలజారెడ్డికి వుంటుంది.

నర్తనశాల సినిమా కేవలం కంటెంట్ మీద ఆధారపడి ముందుకు వెళ్లాలి. కంటెంట్ బాగుంటే ఛలో సినిమా మాదిరిగా దూసుకు వెళ్తుంది. అదే సమయంలో ఏమాత్రం మార్కులు తక్కువ పడినా, శైలజారెడ్డి ఎఫెక్ట్ కాస్త ఎక్కువే వుంటుంది.. శైలజారెడ్డికి దిల్ రాజు నైజాంలో దన్నుగా వుంటే, ఆసియన్ సునీల్ నర్తనశాలకు అండగా వున్నారు.

ఈ నాగ్.. శౌర్య.. చైతన్య సినిమాలు ఎలా వుంటాయో? చూడాలి.