కాలం ఎంతో మార్పు తీసుకొచ్చింది. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులకు వెళ్లిన చంద్రబాబు వ్యూహాత్మకంగా నడుచుకున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి, మరోవైపు ఆయనతో పరోక్షంగా పోరాడుతున్న వైఎస్ ఆడబిడ్డలు డాక్టర్ సునీత, షర్మిలపై ప్రశంసలు కురిపించడం చంద్రబాబుకే చెల్లింది. తద్వారా వైఎస్ అభిమానుల ఆదరణ చూరగొనేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా నడుచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పులివెందుల సభలో చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “వివేకా కుమార్తె సునీత పులివెందుల పులి. తన తండ్రిని చంపిన వాళ్లెవరో ప్రపంచానికి తెలియజేయకపోతే ,ఆయన ఆత్మకు శాంతి కలగదు కాబట్టి ఆడబిడ్డయినా ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడుతోంది”
“పాపం షర్మిల. ఎన్నికలకు ముందు జగన్ ఆమెను ఊరూరా తిప్పారు. నాకు కౌంటర్‌గా పాదయాత్ర చేయించారు. ఎంపీని చేస్తానన్నారు. ఆమెకు ఆస్తిలో సమాన వాటా ఇస్తానని వైఎస్ ఎప్పుడో చెప్పారు. కానీ జగన్ ఇవ్వలేదు. పాపం ఆమె తెలంగాణలో తిరుగుతోంది”
వైఎస్ రాజశేఖరరెడ్డితో సమానంగా ఆయన తమ్ముడు వివేకాను పులివెందుల ప్రజానీకం ప్రేమిస్తోంది. వైఎస్సార్ రాష్ట్ర రాజకీయాలు, పరిపాలన పరమైన అంశాల్లో తలమునకలై వుంటే, అన్న ఆకాంక్షలకు తగ్గట్టు వివేకా ప్రజలతో మమేకం అయ్యేవారు. అన్న పులివెందుల్లో లేని లోటును వివేకా భర్తీ చేసేవారు. అందుకే వైఎస్సార్‌తో కంటే వివేకాతోనే పులివెందుల వాసులకు కొంత ఎక్కువ అనుబంధం వుంది.
అలాంటి వివేకాను హత్య చేయడానికి ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తన తండ్రిని హత్య చేసిన వారిని సమాజం ముందు దోషులుగా నిలబెట్టేందుకు వివేకా కుమార్తె చేస్తున్న పోరాటంపై ప్రజల్లో సానుభూతి ఉంది. కొన్ని సందర్భాల్లో టీడీపీ నాయకులకు లాభం కలిగించేలా సునీత వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా, ఆడబిడ్డకు ఎవరో ఒకరి అండ కావాలి కదా? అనే అభిప్రాయం వుంది. సునీతను పులివెందుల పులిగా అభివర్ణించడం ద్వారా వైఎస్సార్ అభిమానుల ప్రేమను పొందేందుకు చంద్రబాబు ఎత్తుగడ వేశారని అంటున్నారు.
ఇక షర్మిల విషయంలోనూ చంద్రబాబు అదే రీతిలో వ్యవహరించారు. షర్మిలపై సానుభూతి చూపడం ద్వారా జగన్ వ్యతిరేకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సొంత కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకునేంత దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు చూపే ప్రయత్నాన్ని గమనించొచ్చు. తన కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిలకు జగన్ అన్యాయం చేశాడని, ఇక మీరు, నేను ఎంత అని చంద్రబాబు ప్రశ్నించడం ఆలోచన రేకెత్తించేదే.
వైఎస్ కుటుంబ సభ్యుల వేళ్లతోనే జగన్‌ను పొడిచేందుకు పులివెందుల పర్యటనను చంద్రబాబు వాడుకున్నారు. ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలబ్బా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.