దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలే కాదు, ప్లానింగ్ కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. ఏళ్ల తరబడి సినిమాలు, కోట్ల కొలదీ పెట్టుబడి, భారీ వ్యవహారమే ప్రతీదీ. ఆయన లెటెస్ట్ వెంచర్ ఆర్.ఆర్.ఆర్ గురించి తెలిసిందే. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేస్తున్నారు. బ్రిటిష్ కాలాన్ని తలపించే సెట్ ఇది.
అయితే ఆ సెట్ తో పాటే మరో కట్టడం కూడా ప్రారంభమయింది. అది రాజమౌళి సినిమా ఆఫీస్. సెట్ దగ్గరే ఓ భారీ షెడ్ , ఓ మండువా ఇల్లు, తయారవుతున్నాయి. ఇందుకోసం రెండుకోట్లు ఖర్చు చేస్తున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే ఇక రాజమౌళి ఇల్లు వాకిలి పట్టించుకోరు. బాహుబలి టైమ్ లో కూడా ఆయన ఫ్యామిలీతో సహా ఆర్.ఎఫ్.సిలోనే వుండిపోయారు. తన స్వంత పనివారిని కూడా తెచ్చేసుకున్నారు అక్కడికి.
ఈసారి ఏకంగా కాపురమే పెట్టేస్తున్నారట. కుదిరితే ఇంటికి వెళ్లడం లేదూ అంటే షూటింగ్ స్పాట్ లోనే వుండిపోయేందుకు వీలుగా ఓ మండువా ఇల్లు నిర్మిస్తున్నారు. అందులో రాజమౌళికి అన్ని సదుపాయాలు కల్పిస్తారు. దానిపక్కనే ఓ షెడ్ ను ఆయన డైరక్షన్ యూనిట్ కోసం నిర్మిస్తున్నారు. దాని పక్కన మరో షెడ్ యాక్టర్ల రిహార్సల్స్ కోసం నిర్మిస్తున్నారు.
రాజమౌళి సినిమా అంటే ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్ వాల్వ్ అవుతారు. అందుకే అలాంటి ఇల్లు కడుతున్నారు. బ్రిటిష్ కథాకాలంతో, రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తాత్కాలికంగా 300కోట్లు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్య. ఆయనే సోలోగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.