పులివెందులలో చంద్రబాబు ‘ది గ్రేట్ కామెడీ షో’!

చంద్రబాబు నాయుడు తాజాగా ఒక కొత్త ప్రహసనం నడిపిస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన అంటూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు ఏ ఒక్క చుక్క నీటి బొట్టు అందుతున్నా సరే..  అదంతా కేవలం తన…

చంద్రబాబు నాయుడు తాజాగా ఒక కొత్త ప్రహసనం నడిపిస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన అంటూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు ఏ ఒక్క చుక్క నీటి బొట్టు అందుతున్నా సరే..  అదంతా కేవలం తన పుణ్యమే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రహసనంలో భాగంగా కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ ను కూడా చంద్రబాబు బుధవారం పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడి నుంచి పులివెందులకు వచ్చి అక్కడి పూలంగళ్ళ సెంటర్ వద్ద రోడ్డు షో నిర్వహించారు.  ఈ రోడ్ షో కాస్త చంద్రబాబు నిర్వహించిన గ్రేట్ కామెడీ షో లాగా తేలిపోయింది.

చంద్రబాబు ఏ ఊరిలో మాట్లాడినా సరే ఆయన స్క్రిప్ట్ లో పెద్దగా తేడాలేమీ ఉండదు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో దుష్టశక్తులను మట్టికరిపించి తెలుగుదేశం పార్టీ విజయ పతాకం ఎగరేయాలని ఆయన సింగిల్ పాయింట్ ఎజెండా.  పులివెందులలో కూడా ఇదే జరగాలని ఆయన ఆశిస్తున్నారు.. తమ పార్టీ నాయకులందరూ కూడా ‘వై నాట్ పులివెందుల’ అని తనతో అంటున్నారని ఆయన గర్జించారు.

‘ వై నాట్ పులివెందుల’ అనే నినాదం తీసుకోవడంలోనే చంద్రబాబు యొక్క పిరికితనం బయటపడుతోందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఈ నినాదమే ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి కాపీ కొట్టినటువంటిది.   అయితే జగన్ ఏనాడు ‘వై నాట్ కుప్పం’ అని అననే లేదు.  

కుప్పంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఓడిపోయినట్లే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది. ఆమేరకు కుప్పం నియోజకవర్గంలో తమ పార్టీ బలపడిందని వారు నమ్ముతున్నారు. కుప్పం మునిసిపాలిటీని చేజిక్కించుకోవడం ద్వారా ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నారు కూడా. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెసుకు బ్రహ్మరథం పట్టేలాగా అక్కడ అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని కూడా జగన్ ప్రభుత్వం విశ్వసిస్తోంది.  తప్పకుండా గెలుస్తామని నమ్ముతోంది. అందుకే ప్రత్యేకంగా అనాలని ఆలోచన వారికి రాలేదు. కేవలం వైనాట్ 175 అని మాత్రమే జగన్ అంటున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల అంటున్నారంటేనే అది ఆయనలోని పిరికితనానికి నిదర్శనం గా భావించాల్సి ఉంటుంది. గెలిచే ఛాన్స్ ఎటులేని చోట కనీసం కార్యకర్తలలో కాస్త స్ఫూర్తి నింపడానికైనా ఆ నినాదం ఆయన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.  

రోడ్డు మీద సెంటర్లో కాస్త జనం గుమికూడేసరికి ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు నాయుడు ‘‘నేను ఎప్పుడూ కొదమసింహాన్నే. నాతో మర్యాదగా ఉంటే నేను అలాగే ఉంటాను. తక్కువ అంచనా వేసిన రెచ్చగొడితే కొదమ సింహం లాగా విరుచుకుపడి అణిచివేస్తాను’’ అని వైకాపా నాయకులను హెచ్చరించడం పెద్ద కామెడీ. అమరావతి రాజధాని అంటూ ఊదరగొట్టిన ప్రాంతంలోనే సొంత కొడుకును కూడా గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు నాయుడు తాను కొదమసింహాన్ని అంటూ గర్జించడం చూసి జనం నవ్వుకున్నారు.

పులివెందుల శాసనసభ స్థానంలో తెలుగుదేశం గెలవాలన్నది నా చిరకాల వాంఛ.. బుల్లెట్ లాంటి బీటెక్ రవిని మీకు అప్పగిస్తున్నాను.. వచ్చే ఎన్నికలలో ఆయనను గెలిపించండి అని చంద్రబాబు నాయుడు పులివెందుల ప్రజలను కోరారు.  తన ముసలితనం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న  ప్రచారంపై ఉక్రోషాన్ని కూడా చంద్రబాబు బయట పెట్టుకున్నారు. నాకు వయసైపోయిందని ముఖ్యమంత్రి అంటున్నారు.  నా విషయంలో వయసు ఒక అంకె మాత్రమే.  సింహం ఎప్పటికీ సింహమే.. అని చంద్రబాబు సెలవిచ్చారు.  

ఇలా అనడంలో చంద్రబాబు ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. సింహం అయినంత మాత్రాన దానికి ముసలితనం రాకుండా ఉంటుందా?? వయసుడిగిపోయిన ముసలి సింహం వేటాడే శక్తిని కోల్పోయి ఎవరో ఒకరు వేటాడితే ఆ కళేబరాలను తిని బతకాలని అనుకోవడం సహజమే కదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే రకమైన వ్యూహంతో ప్రవర్తిస్తున్నట్టుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.