టాలీవుడ్ లో పెళ్లి తర్వాత హీరోయిన్ గా నటించిన వాళ్లు చాలా అరుదు. మరీ ముఖ్యంగా హీరోను పెళ్లి చేసుకున్న తర్వాత అతడితో స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు అరుదు. హీరోలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వెంటనే తెరమరుగైపోయారు. కృష్ణ-విజయనిర్మల జంట ఇందుకు మినహాయింపు.
అయితే బాలీవుడ్ లో మాత్రం పెళ్లయిన తర్వాత కూడా హీరోహీరోయిన్లు కలిసి నటిస్తున్నారు. ఇప్పుడదే బాటలో నాగచైతన్య-సమంత కూడా నడుస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా వీళ్లిద్దరూ కలిసి మరోసారి హీరోహీరోయిన్లుగా సినిమా చేస్తున్నారు. నిన్న ఈ సినిమా లాంఛ్ అయింది.
కృష్ణ-విజయనిర్మల జంట తర్వాత పెళ్లి చేసుకొని హీరోహీరోయిన్లుగా కలసి నటించిన దాఖలాలు లేవు. నాగార్జున జంటగా సూపర్ హిట్ సినిమాలు చేసిన అమల, పెళ్లి తర్వాత కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. కనీసం నాగ్ సినిమాల్లో గెస్ట్ రోల్ కూడా చేయలేదు.
మహేశ్ బాబు – నమ్రత జంట కూడా ఇదే కోవలోకి వస్తుంది. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా తెరమరుగైంది. భర్త సినిమాలకు సంబంధించి తెరవెనకే ఉండిపోయింది. పవన్ కల్యాణ్ – రేణుదేశాయ్ కూడా పెళ్లికి ముందు సినిమాలు చేశారు కానీ, వివాహ బంధంలోకి వచ్చాక కలసి తెరపైకి రాలేదు.
శ్రీకాంత్-ఊహ జంట కూడా.. పెళ్లైన తర్వాత ఊహ వెండితెరకు గుడ్ బై చెప్పేసింది. కలిసి నటించకపోయినా కీర్తిరెడ్డి-సుమంత్ ఒకర్ని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకే ఈ జంట విడిపోయిందనుకోండి. అయినప్పటికీ కీర్తిరెడ్డి తిరిగి సినిమాల్లోకి రాలేదు.
ఇకపోతే లేటెస్ట్ జోడీ నాగచైతన్య-సమంత. వీరిద్దరూ టాలీవుడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. తొలి సినిమా ఏమాయచేసావే షూటింగ్ టైమ్ లోనే ప్రేమలో పడ్డ చై-శ్యామ్ ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో కలిసి నటించారు. గతేడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేస్తోంది. ఇతర హీరోల సినిమాలతో పాటు, భర్తతో కలసి కొత్త సినిమాని స్టార్ట్ చేసింది. పెళ్లికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా హీరోహీరోయిన్లుగా కలసి నటిస్తూ.. టాలీవుడ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఈ జంట. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్-కాజోల్, సైఫ్-కరీనా, అభిషేక్-ఐశ్వర్య లాగే టాలీవుడ్ లో చైశ్యామ్ జోడీ అన్నమాట.