మోకాలడ్డేస్తున్న దగ్గుబాటి అండ్ కో?

దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డంపడ్డాడన్న సామెతలా వుంది మల్టీ ఫ్లెక్స్ లు, థియేటర్లలో తినుబండారాల అమ్మకం వ్యవహారం. బయట పది పన్నెండు రూపాయిలు వుండే కూల్ డ్రింక్ ను మామూలు థియేటర్లు ఇరవైకి అమ్ముతాయి.…

దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డంపడ్డాడన్న సామెతలా వుంది మల్టీ ఫ్లెక్స్ లు, థియేటర్లలో తినుబండారాల అమ్మకం వ్యవహారం. బయట పది పన్నెండు రూపాయిలు వుండే కూల్ డ్రింక్ ను మామూలు థియేటర్లు ఇరవైకి అమ్ముతాయి. ఎమ్మార్పీల సమస్య లేకుండా ఫౌంటెన్ మెషీన్లు పెట్టి, యాభై నుంచి 150 రేంజ్ లో అమ్ముతాయి మల్టీ ఫ్లెక్స్ లు. అయితే ఇటీవల కోర్టు పుణ్యమా అని మహరాష్ట్రలో బయటి పుడ్ ను కూడా థియేటర్లలోకి అనుమతించాలని, అలాగే ఎమ్మార్పీలు దాటి అమ్మరాదని అక్కడి ప్రభుత్వం డిసైడ్ చేసింది.

ఆంధ్రలో ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు. ఎందుకంటే థియేటర్లను శాసించేవారిలో చాలామంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులే. అందుకే వారిని ఇరుకునపెట్టే పని ప్రభుత్వం చేయదు. తెలంగాణలో పార్కింగ్ చార్జీలు ఎత్తివేసినా ఆంధ్ర ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మహరాష్ట్ర మాదిరిగా తినుబండారాల ధరలపై దృష్టి సారిస్తోంది. దీంతో తెలంగాణలో దాదాపు 90శాతం థియేటర్లను చేతిలో వుంచుకున్న వాళ్లకు సమస్య మొదలైంది.

ముఖ్యంగా దగ్గుబాటి సురేష్, ఆసియన్ సునీల్ లాంటివాళ్లు ఇప్పుడు ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి రెడీ అయిపోయారు. అర్జెంట్ గా ఆఘమేఘాల మీద ఫిల్మ్ చాంబర్ లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యిజమానులు ఇలా అందరితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు.

బహుశా పార్కింగ్ చార్జీలు, తినుబండారాల ఆదాయం అంతా నష్టపోతున్నందున, రెంట్లు, పెంచుతామని ఎగ్జిబిటర్లు కోరే అవకాశం వుంది. ఆ విధంగా నిర్మాతల మీద, పంపిణీదారుల మీద ఈ సమస్య బాధ్యత పడేస్తారు. అప్పుడు అది టాలీవుడ్ సమస్యగా మారి, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాన్ని అమలుకాకుండా ఆపే అవకాశం వుంది.