తెలుగు డబ్బింగ్ సినిమాల హక్కుల్లో రోబో-2 ఓ సంచలనం. ఏ డబ్బింగ్ సినిమాకు ఇవ్వనంత రేటు. సుమారు 78కోట్ల బేరం. అది కూడా కేవలం తెలుగు వెర్షన్ థియేటర్ హక్కులకు మాత్రం. నైజం, ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కీరోల్ ప్లే చేస్తున్న ఆసియన్ సునీల్, ఆయన మిత్ర బృందం ఈ సినిమా హఖ్కులు తీసుకున్నారు. ముందుగా 20కోట్లు ఏకమొత్తంగా అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
ఇరవైకోట్లు అడ్వాన్స్ అంటే చిన్న మొత్తంకాదు. ఓ మీడియం సినిమా బడ్జెట్ అనుకోవాలి. అయితే రోబో-2 వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఆ మధ్య కాలా సినిమా విడుదల టైమ్ లో రోబో-2 నిర్మాతలయిన లైకా ప్రొడక్షన్స్ ను అడ్వాన్స్ లో 10కోట్లు వెనక్కు ఇవ్వమని, మళ్లీ ఇస్తామని ఆసియన్ సునీల్ అడిగినట్లు వార్తలు వచ్చాయి.
అయితే కావాలంటే మొత్తం అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేస్తామని, అంత అనుమానం వుంటే తీసేసుకోవచ్చని లైకా అధినేతలు అన్నారని కూడా వదంతులు వినిపించాయి. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియలేదు. లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, లైకా అధినేతలు ఆసియన్ సునీల్ కోరినట్లు 10కోట్లు అడ్వాన్స్ వెనక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 10కోట్లు కూడా కావాలంటే ఇస్తామని కబురు చేసినట్లు టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
రోబో-2 విడుదల నవంబర్ లో వుంటుందని ప్రకటించారు. ఈసారి పక్కాగా వస్తుందని వినిపిస్తోంది. మళ్లీ మళ్లీ డేట్ మారదని చెన్నయ్ వర్గాల బోగట్టా. అందువల్ల ఆసియన్ సునీల్ మిగిలిన అడ్వాన్స్ కూడా వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయకపోవచ్చు. ఎందుకంటే, ఆయన అడ్వాన్స్ పూర్తిగా వెనక్కు తీసుకుంటే, రంగంలోకి దిగి రోబో-2 హక్కులు తీసుకోవాలని మరో భారీ డిస్ట్రిబ్యూటర్ రెడీగా వున్నట్లు, ఆ మేరకు లైకాకు కబురు చేసినట్లు తెలుస్తోంది.
ఏమైనా, ఎన్ని డిజాస్టర్లు వచ్చినా రజనీ క్రేజ్ వేరు. దానికి తోడు డైరక్టర్ శంకర్ క్రేజ్ కూడా వుండనే వుంది.