సినిమా రివ్యూ: వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

రివ్యూ: వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ తారాగణం: లక్ష్మీ మంచు, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆదర్శ్‌, సామ్రాట్‌ తదితరులు సంగీతం: రఘు దీక్షిత్‌ కూర్పు:…

రివ్యూ: వైఫ్‌ ఆఫ్‌ రామ్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: లక్ష్మీ మంచు, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆదర్శ్‌, సామ్రాట్‌ తదితరులు
సంగీతం: రఘు దీక్షిత్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: సామల భాస్కర్‌
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్‌, లక్ష్మి మంచు
కథ, కథనం, దర్శకత్వం: విజయ్‌ యెలకంటి
విడుదల తేదీ: జులై 20, 2018

భర్తని, కడుపులో బిడ్డని పోగొట్టుకున్న స్త్రీ ఒక అగంతకుడు తమపై దాడి చేసి ఆ హత్యలకి కారణమయ్యాడని పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది. పోలీసుల నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఆ హత్య ఎవరు చేసారనే దానిపై తన దగ్గరున్న కాస్త సమాచారంతో కూపీ లాగుతూ వెళుతుంది. ఆసక్తికరమైన కథాంశం వున్న ఈ చిత్రానికి కట్టి పడేసే కథనం తోడయితే ఖచ్చితంగా ఆకట్టుకునే థ్రిల్లర్‌ అయి వుండేది. ఈ చిత్రం విషయంలో మంచు లక్ష్మి అంతగా ఎక్సయిట్‌ అవడంలో వింత లేదు. ఎందుకంటే నటిగా పర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఇవ్వడమే కాకుండా కథగా థ్రిల్‌ చేసే పాయింట్స్‌ చాలానే వున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక జాఢ్యంగా మారిపోయిన ఒక సమస్యని నేపధ్యంగా తీసుకుని దాని చుట్టూ ఈ మిస్టరీని అల్లారు. మంచి స్టోరీ టెల్లర్‌ చేతిలో పడితే మాత్రం ఇది నిజంగా మంచు లక్ష్మి ఆశించిన స్థాయిలో సంచలనం కాగలిగేది.

సమయం వృధా చేయకుండా పాయింట్‌లోకి వెళ్లిపోయే ఈ మర్డర్‌ మిస్టరీలో సస్పెన్స్‌ని బాగానే హోల్డ్‌ చేసినప్పటికీ, స్క్రీన్‌ప్లే పరంగా గ్రిప్‌ మెయింటైన్‌ చేయకపోవడంతో థ్రిల్‌ కలిగించాల్సిన చోట కూడా నిస్సారంగా సాగిపోతూ వుంటుంది. తన భర్త హత్య వెనుక మిస్టరీని చేధించడానికి దీక్ష (లక్ష్మి) చేస్తోన్న ఇన్వెస్టిగేషన్‌లో స్టఫ్‌ వున్నా కానీ దానిని ఎగ్జిక్యూట్‌ చేసే విధానం పేలవంగా అనిపించడంతో ఆ దృశ్యాలన్నీ ఇంపాక్ట్‌ లేకుండా వచ్చి పోతుంటాయి. రెండు గంటల కంటే తక్కువ నిడివి వున్న ఈ చిత్రంలో ఎలాంటి డీవియేషన్స్‌ లేకుండా ఫోకస్‌ మొత్తం పాయింట్‌ మీదే పెట్టినా కానీ పట్టు లేని కథనం కారణంగా చివరి సన్నివేశాల వరకు తెరపై జరిగే ఏ విషయంపైనా ఆసక్తి రేకెత్తదు.

చాలా కీలకమైన విషయాల్లో లాజిక్‌ వదిలేసి కన్వీనియంట్‌గా తీసేయడం వల్ల ఉత్కంఠ కలగదు. దానికి తోడు కొన్ని పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు కూడా సీన్‌ ఇంపాక్ట్‌ని తగ్గించేసింది. ఒంటరి స్త్రీకి అన్ని వైపుల నుంచి ముంచుకొస్తోన్న ప్రమాదం ఉత్కంఠ రేకెత్తించాలి. కానీ అటు ఎస్‌ఐ క్యారెక్టర్‌ కానీ, విలన్‌ తండ్రి కానీ, లేదా ఆమె అంతు చూడమని విలన్‌ పురమాయించిన మనుషులు కానీ ఎక్కడా త్రెట్‌లానే అనిపించకపోగా, డ్రామా ఆర్టిస్టుల మాదిరి పర్‌ఫార్మెన్స్‌తో తమని సీరియస్‌గా తీసుకునే అవకాశమే లేకుండా చేసారు. మర్డర్‌ చేసిన వాడిని దీక్ష కనుగొనే విధానం కూడా హడావిడిగా అనిపిస్తుందే తప్ప ఏదో మిస్టరీ చేధిస్తోన్న భావన కలగదు. ఇక విదేశాల్లో వున్న అతడిని తన వద్దకి రప్పించే సన్నివేశాలు కూడా కన్వీనియంట్‌గా చేసేసుకున్నవే అనిపిస్తాయి తప్ప కన్విన్సింగ్‌గా తోచవు.

కథలో ట్విస్ట్‌ తెలిసాక గానీ అంతకుముందు జరిగిన కొన్ని సన్నివేశాల్లో సెన్స్‌ వున్నట్టు అనిపించదు. ఈ ట్విస్ట్‌లో షాక్‌ వేల్యూ వుండాలి కానీ విద్యాబాలన్‌ నటించిన 'కహానీ' చూసిన వారికి ఇది అంత ట్విస్ట్‌లా అనిపించకపోగా, ఆ చిత్రానికి పూర్‌ కార్బన్‌ కాపీలా తోచే అవకాశముంది. సస్పెన్స్‌ని మెయింటైన్‌ చేస్తూ, ఆద్యంతం ఉత్కంఠభరితంగా, లీడ్‌ క్యారెక్టర్‌ పట్ల సింపతీతో అనుక్షణం ఆమె మంచి కోరుతూ ప్రేక్షకులు లీనమైపోయేలా ఎలా 'కథ' చెప్పాలనే దానికి కహాని చక్కని ఉదాహరణ. అయితే దానిని పెద్ద బడ్జెట్‌, స్టార్‌ కాస్ట్‌ వున్నా కానీ శేఖర్‌ కమ్ముల కూడా సరిగా రీమేక్‌ చేయలేకపోయాడు. ఆ చిత్రం కంటే వనరులు తక్కువ వున్న వైఫ్‌ ఆఫ్‌ రామ్‌కి చిత్రీకరణ పరంగా ఇంకా ఎంతో జాగ్రత్త చూపించాల్సిన అవసరం వుంది. చివర్లో వచ్చే ట్విస్టుతో అన్నిటికీ సమాధానం దొరికేస్తుందనే నిర్లిప్త ధోరణిలో థ్రిల్లర్‌ చిత్రాన్ని తీయడం చాలా పెద్ద బ్లండర్‌.

అక్కడక్కడా తన మార్కు డైలాగ్‌ డెలివరీని పట్టించుకోకపోతే, లీడ్‌ క్యారెక్టర్‌లో మంచు లక్ష్మి సిన్సియర్‌గా నటించింది. అయితే తనకున్న ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కారణంగా తనకేదైనా ఆపద ముంచుకొస్తుందేమో అనే ఫీల్‌ కొంతవరకు తగ్గిపోయింది. ఈ కారణంగా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళుతున్నా కానీ దీక్షకి ఏమి జరుగుతుందోననే ఆందోళన కలిగే ఆస్కారం కూడా తగ్గింది. ఆమెకి సహాయపడే పోలీస్‌గా ప్రియదర్శి నటన బాగుంది. అయితే ఆదర్శ్‌తో సహా మిగిలిన సహాయక పాత్రలు పోషించిన నటీనటులంతా ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లిపోయి సీరియస్‌నెస్‌ తగ్గించారు.

నేపథ్య సంగీతంతో పాటు కెమెరా యాంగిల్స్‌, లైటింగ్‌ కూడా థ్రిల్లర్‌ మూడ్‌ మెయింటైన్‌ చేసాయి. ఎడిటింగ్‌ ఇంకా క్రిస్ప్‌గా వుండాల్సింది. దర్శకుడు విజయ్‌ యెలకంటి ఎంచుకున్న కథాంశంతో పాటు దానిని సస్పెన్స్‌ మెయింటైన్‌ చేస్తూ ట్విస్ట్‌తో చెప్పిన విధానం బాగున్నా కానీ కథని ఆసక్తికరంగా మలిచే కథనం రాసుకోలేకపోవడం వల్ల తేలిపోయింది. చిన్న బడ్జెట్‌ సినిమాలకి కూడా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌ మెయింటైన్‌ చేసే తమిళ చిత్రాల నుంచి స్ఫూర్తి తీసుకుని ఇలాంటి సినిమాలకి అత్యున్నత ప్రమాణాలు పాటించాలి.

రొటీన్‌ సినిమాల మధ్య భిన్నమైన చిత్రమే అయినప్పటికీ ఆకట్టుకునే రీతిన తెరకెక్కకపోవడం వల్ల 'వైఫ్‌ ఆఫ్‌ రామ్‌' నిరాశపరుస్తుంది. 'కహానీ' లేదా 'అనామిక' చూడని వారిని ఆ ట్విస్ట్‌ కాస్త థ్రిల్‌ చేయవచ్చు కానీ ఇదే తరహా సెటప్‌తో సాగే 'కహానీ' లాంటి అత్యుత్తమ చిత్రం చూసిన వారికి ఇది చాలా ఇన్‌ఫీరియర్‌గా అనిపించడానికే ఆస్కారం ఎక్కువ వుంది.

బాటమ్‌ లైన్‌: కహాని బానే వుంది, కానీ..!
– గణేష్‌ రావూరి