దొందూ దొందే: ఇక్కడ టాక్సీవాలా.. అక్కడ సవ్యసాచి

లెక్కప్రకారం నాగచైతన్యకు సంబంధించి సవ్యసాచి సినిమా ముందుగా థియేటర్లలోకి రావాలి. అటు విజయ్ దేవరకొండకు సంబంధించి టాక్సీవాలా మూవీ ముందుగా రిలీజ్ అవ్వాలి. కానీ అనూహ్యంగా ఇప్పుడీ రెండు సినిమాలు వెనక్కి వెళ్లాయి. మిగతా…

లెక్కప్రకారం నాగచైతన్యకు సంబంధించి సవ్యసాచి సినిమా ముందుగా థియేటర్లలోకి రావాలి. అటు విజయ్ దేవరకొండకు సంబంధించి టాక్సీవాలా మూవీ ముందుగా రిలీజ్ అవ్వాలి. కానీ అనూహ్యంగా ఇప్పుడీ రెండు సినిమాలు వెనక్కి వెళ్లాయి. మిగతా సినిమాల రిజల్ట్ పై ఈ రెండు సినిమాల జాతకాలు ఆధారపడ్డాయి. 

విజయ్ దేవరకొండ విషయానికొస్తే పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా టాక్సీవాలా లేట్ అవుతోందని చెప్పుకొచ్చారు కానీ నిజానికి రీజన్ అది కాదు. ఈ సినిమా ఔట్ పుట్ పై అల్లు అరవింద్ అస్సలు నమ్మకంగా లేరు. దీంతో ఆఖరి నిమిషంలో టాక్సీవాలాను పక్కకునెట్టి, గీతగోవిందం సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. గీతగోవిందం హిట్ అయితే అదే ఊపులో మినిమం గ్యాప్ లో టాక్సీవాలాను విడుదల చేసేస్తారు. లేదంటే.. మళ్లీ రిపేర్లు తప్పవు.

అటు సవ్యసాచి సినిమాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. నాగార్జున ఈ సినిమా చూశాడు. మరోవైపు శైలజారెడ్డి అల్లుడు రషెష్ కూడా చూశాడు. యుద్ధం శరణం లాంటి డిజాస్టర్ తర్వాత మరోసారి సవ్యసాచి లాంటి యాక్షన్ సినిమాను రిలీజ్ చేసే కంటే, శైలజారెడ్డి అల్లుడు లాంటి మసాలా సినిమాను విడుదల చేయడం ఉత్తమమని భావించాడు. 

అలా సవ్యసాచి సినిమా వెనక్కి వెళ్లిపోయింది. నిజానికి సవ్యసాచి సినిమా ఔట్ పుట్ పై నాగ్ కు ఎలాంటి అభ్యంతరాల్లేవు. కానీ ఒక యాక్షన్ సినిమా (అది కూడా ఫ్లాప్) తర్వాత మరో యాక్షన్ మూవీ ఎందుకనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ శైలజారెడ్డి అల్లుడు రిజల్ట్ తేడాకొడితే మాత్రం ఆ ప్రభావం సవ్యసాచిపై గట్టిగానే పడుతుంది. 

ఇలా ఊహించని విధంగా ఇటు సవ్యసాచి, అటు టాక్సీవాలా సినిమాలు రెండూ వెనక్కి వెళ్లిపోయాయి.