సినిమా ఫలితం ముందే తెలిసిపోతే, నిర్మాతలు, డైరక్టర్లు ఇలాగే మాట్లాడతారేమో? ఎవరో ఒకరి మీద నెపం నెట్టేయడానికి ప్రయత్నిస్తారేమో? లవర్ సినిమా ప్రమోషన్లలో నిర్మాత దిల్ రాజు చిత్రంగా మాట్లాడుతున్నారు. తనేదో దయాధర్మానికి హీరో రాజ్ తరుణ్ తో సినిమా తీసినట్లు మాట్లాడుతున్నారు. రాజ్ తరుణ్ కు మార్కెట్ లేదు. రాజ్ తరుణ్ పై ఎనిమిది కోట్లు పెట్టాం అని చెబుతున్న దిల్ రాజు అసలు రాజ్ తరుణ్ తో ఎందుకు సినిమా తీయాల్సి వచ్చిందో? చెప్పరేమి?
తన పార్టనర్, బంధువు హర్షిత్ రెడ్డి ఎన్నిఏళ్లుగా ఈ లవర్ సినిమా కథను రెడీ చేయించి వుంచుకున్నారో? దానిని ఎంతమంది యంగ్ హీరోలకు చెప్పి, ఒప్పించాలని ట్రయ్ చేసారో అన్నదాని మీద ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. ఆఖరికి తనతో ఓ సినిమా చేయమని అడిగిన పాపానికి రాజ్ తరుణ్ దొరికాడు అనుకోవాలి.
వరుణ్ సందేశ్, సునీల్ మీద కోట్లుపెట్టి దిల్ రాజు నష్టపోయిన రోజులు లేవా? నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఎత్తుపల్లాలు ఎన్నో చూసారు. అలాంటిది ఓ హీరో డౌన్ ఫాల్ లో వున్నపుడు ఇలా మాట్లాడితే ఎలా? ఇదంతా చూస్తుంటే సినిమా ఫలితం తెలిసిపోయి, ముందుగానే దీనంతటికీ రాజ్ తరుణ్ నే బాధ్యుడిని చేసేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది.