అమ‌రావ‌తిని పందేనికి ఒడ్డిన బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి స్వార్థానికి మ‌రోసారి రాజ‌ధాని అమ‌రావ‌తిని బ‌లి పెట్టారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో రోడ్ షో నిర్వ‌హించారు. బాబు అవ‌కాశ‌వాద రాజ‌కీయానికి అమ‌రావ‌తిని మ‌రోసారి పావుగా…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి స్వార్థానికి మ‌రోసారి రాజ‌ధాని అమ‌రావ‌తిని బ‌లి పెట్టారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో రోడ్ షో నిర్వ‌హించారు. బాబు అవ‌కాశ‌వాద రాజ‌కీయానికి అమ‌రావ‌తిని మ‌రోసారి పావుగా వాడుకున్నారు. అయితే ఇంత కాలం అమ‌రావ‌తి కోసం అక్క‌డ చేప‌ట్టిన ఉద్య‌మం కేవ‌లం ఎల్లో మీడియా సృష్టే అనే విమ‌ర్శ‌ల‌కు బాబు మాట‌లు మ‌రింత బ‌లాన్ని ఇచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

‘అమరావతిలో రాజధానిని నా కోసం కట్టామా? మీ కోసం, రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటే మిమ్మల్ని ఏమనాలి? ఇంటికో మనిషైనా బయటకు రారేం?’ అంటూ విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌ల్ని చంద్ర‌బాబు నిందించారు, నిష్టూర‌మాడారు.

‘రోషం, పట్టుదల లేవా? తెలుగువారి ఆత్మగౌరవం ఏమైంది?’ అని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు.  

‘అమరావతి కోసం నేను పోరాడుతుంటే సంఘీభావం తెలియజేసి.. మీరు లక్షణంగా ఇంట్లో పడుకుంటే పనైపోతుందా? ఎందుకయ్యా.. విజయవాడలో ఇంటికో మనిషి ఎందుకు బయటకు రారని అడుగుతున్నా. మీరు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి పాచి పనులు చేసుకోవడానికి వెళ్లేందుకైనా  సిద్ధంగా ఉన్నారు గానీ.. అమరావతిని కాపాడుకోవడానికి సిద్ధంగా లేరు. 

అవునా.. కాదా? పట్టిసీమను నా కోసం తెచ్చానా? నీళ్లు తాగుతున్నవాళ్లకు అర్థం కాదా?  కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోకపోతే రాజధాని అమరావతిని తరలించుకుపోవడానికి వైసీపీకి మద్దతిచ్చినట్లే అవుతుంది’ అని చంద్ర‌బాబు బ్లాక్ మెయిల్ చేశారు.

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు చంద్ర‌బాబు అమ‌రావ‌తి రాజ‌ధాని సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారు. ఒక‌వేళ చంద్ర‌బాబు రాజ‌కీయ పాచిక పారి విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో టీడీపీ గెలిస్తే …అమ‌రావ‌తి ఇష్యూ స‌జీవంగా ఉంటుంది. ఒక‌వేళ అక్క‌డ అధికార పార్టీ గెలిస్తే …చంద్ర‌బాబు మాట‌ల్లో చెప్పాలంటే రాజ‌ధాని అమ‌రావ‌తిని త‌ర‌లించుకుపోవ‌డానికి వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చేన‌ని ప్ర‌జాతీర్పును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అధికార పార్టీ తెలివిగా రాజ‌ధాని అంశాన్ని తెర‌పైకి తేలేదు. ఇదే చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే జూద‌క్రీడ‌లో  అమ‌రావ‌తిని పందేనికి పెట్టారాయ‌న‌. ఇందులో అమ‌రావ‌తి రైతుల ప్ర‌మేయం ఏ మాత్రం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

బాబు త‌న రాజ‌కీయ స్వార్థం కోసం ఎవ‌రినైనా బ‌లి పెడ‌తార‌ని ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన వాళ్లు చెబుతారు. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తి అంశాన్ని తెర‌పైకి తేవ‌డం ద్వారా అన‌వ‌స‌రంగా నిప్పుతో చెల‌గాటం అడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విజ‌య‌వాడ‌లో మేయ‌ర్ పీఠాన్ని టీడీపీ కైవ‌సం చేసుకోక‌పోతే మాత్రం ఇక శాశ్వ‌తంగా అమ‌రావ‌తికి స‌మాధి క‌ట్టిన‌ట్టే.

ఇప్ప‌టికే అమ‌రావ‌తితో పాటు రాజ‌ధాని ప‌రిస‌ర పంచాయ‌తీల్లో టీడీపీ బొక్క బోర్లా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్‌ల‌లో కూడా టీడీపీ ఓట‌మి పాలైతే మాత్రం రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత రైతుల‌కు ద్రోహం చేసిన మొద‌టి ముద్దాయిగా చంద్ర‌బాబు చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక వారంలో విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల భ‌విష్య‌త్ ఏంటో ఓట‌ర్లు తేల్చ‌నున్నారు. అంత వ‌ర‌కూ ఉత్కంఠ త‌ప్ప‌దు మ‌రి!

దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి

లోకేష్ పార్టీని నడపగలుగుతారా?