స్టే ట్యూన్‌డ్ .. ఇదిగిదిగో ఇచ్చేస్తున్నాం!

తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా నానుస్తున్నారంటూ ఎప్పుడైనా విమర్శిస్తే.. గల్లీ లీడర్లనుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ యథోశక్తి ఎదురుదాడి చేయడంలో విజృంభిస్తారు. మేనిఫెస్టోలో…

తెలుగుదేశం పార్టీ పరిపాలన గురించి రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా నానుస్తున్నారంటూ ఎప్పుడైనా విమర్శిస్తే.. గల్లీ లీడర్లనుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ యథోశక్తి ఎదురుదాడి చేయడంలో విజృంభిస్తారు. మేనిఫెస్టోలో చెప్పిన అన్నీ పూర్తిచేశాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మరి నిరుద్యోగ భృతి ఏదీ ఎక్కడ? అని అడిగారనుకోండి.. ఆల్రెడీ విధివిధానాలు అయిపోయాయి.. దరఖాస్తు చేసుకున్న వారి వడపోత జరుగుతోంది. త్వరలోనే ఇచ్చేస్తాం అని చెబుతుంటారు. ‘త్వరలోనే’ అనే మాట గత ఏడాది నుంచి వినిపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2014 లో గద్దె మీదికి రావడానికి ప్రధానం కారణాల్లో రుణమాఫీలాగానే, నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం హామీలు కూడా ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం అనే దాని ఊసే ప్రభుత్వం పట్టించుకోలేదు. నిరుద్యోగ భృతి విషయంలో దాన్ని ఎలా పక్కన పెట్టాలా అని దాదాపు మూడేళ్లకు పైగా నిరీక్షిస్తూ నానుస్తూ వచ్చారు.

తీరా గత ఏడాది చివర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కు పూనుకోగానే.. అసలే యూత్ లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న జగన్.. నిరుద్యోగభృతి విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టకుండా.. తెలుగుదేశం సర్కారు ఓ పాచిక వేసింది. లోకేష్ సారథ్యంలో ఓ కమిటీని ప్రకటించింది. సంక్రాంతి నుంచి నిరుద్యోగ భృతి ఇచ్చేస్తాం అనే సంగతి వెల్లడించారు. అంతే, అక్కడితో ఆ విషయం అటకెక్కింది. దాని అతీగతీ లేకుండా పోయింది. ఇటీవల మళ్లీ కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తులు పిలిచారు. వడపోత పూర్తయింది. జూన్ నుంచి ఇచ్చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు జులై కూడా పూర్తయిపోతోంది. తాజాగా కూడా ప్రస్తుతం ఆ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి యనమల రామకృష్ణుడు త్వరలోనే భృతి ఇచ్చేస్తాం అని అంటున్నారు. త్వరలో అంటే ఇంకా ఎప్పుడు అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

నిజానికి రాష్ట్రంలో పదోతరగతి పాసైన ప్రతి నిరుద్యోగికీ రెండు వేల వంతున భృతి ఇస్తాం అనేది ప్రభుత్వ హామీ. కానీ ఇప్పుడు అర్హతను డిగ్రీ గా, అమౌంట్ ను వెయ్యిగా మార్చేశారు. ఇది చీటింగ్ కాక ఇంకేమిటి? సరే అదయినా ఇస్తారు కదా అని ఎదురుచూస్తోంటే ఇదిగో అదిగో అంటూ నెలలు గడిపేస్తున్నారు.

అందుకే చంద్రబాబు ప్రభుత్వం తీరు.. జటకాకు పూన్చిన గుర్రం ఎదుట గడ్డి మోపును ఓ కర్రకు కట్టి.. అక్కడేదో మేత దొరుకుతుందని దానికి ఆశచూపించి.. ఆ ఆశతో దానిని అదిలించి పరుగులెత్తించినట్లుగా ఉంది. ఎదురుగా కనిపించే గడ్డికోసం ఆ గుర్రం పరుగెడుతూనే ఉంటుంది. కానీ.. ఎంత దూరం పరుగెత్తినా గడ్డి మాత్రం దొరకదు. అదన్నమాట సంగతి.