హరీష్ సమస్య స్క్రిప్ట్ యేనా?

డిజె తరువాత డైరక్టర్ హరీష్ శంకర్ సినిమా అన్నది చిరకాలంగా వార్తల్లో మాత్రమే వినిపిస్తూ వస్తోంది. అదిగో సినిమా, ఇదిగో షూటింగ్ అన్నట్లు నడుస్తోంది వ్యవహారం. సినిమా టైటిల్ కు తగ్గట్లే దాగుడుమూతలు మాదిరిగా…

డిజె తరువాత డైరక్టర్ హరీష్ శంకర్ సినిమా అన్నది చిరకాలంగా వార్తల్లో మాత్రమే వినిపిస్తూ వస్తోంది. అదిగో సినిమా, ఇదిగో షూటింగ్ అన్నట్లు నడుస్తోంది వ్యవహారం. సినిమా టైటిల్ కు తగ్గట్లే దాగుడుమూతలు మాదిరిగా వుంది అంతా. శర్వానంద్ హీరొ, దిల్ రాజు నిర్మాత అంటే, ఈ మధ్యనే శర్వానంద్ చేయడం లేదని బయటకు వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు కూడా పెద్దగా ఆసక్తిగా లేరని వార్తలు వినిపించడం ప్రారంభమయ్యాయి.

హరీష్ సినిమాకు ఓ సమస్య కాదు. రెండు మూడు సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అన్నిటికన్నా కీలకమైనది కథ. ఇద్దరు హీరోలకు అవకాశం వున్న స్క్రిప్ట్ ఇది. కానీ రెండో హీరో పాత్ర అంత పెద్దది కాదు. నిడివి చాలా తక్కువ. అలాంటి దానికి తనకు కాస్త పేరున్న హీరోనే కావాలన్నది హరీష్ తాపత్రయం. కానీ స్క్రిప్ట్ విన్నాక శర్వానంద్ నో అనేసాడు. మెయిన్ లీడ్ గా నితిన్ రెడీగానే వున్నాడు. కానీ ఈ రెండో క్యారెక్టర్ కే ఎవ్వరూ ఎస్ అనడం లేదు.

మరోపక్క హరీష్ శంకర్ అంటే హీరోలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని ఓ టాక్ వినిపిస్తోంది. మరోపక్క స్క్రిప్ట్ మీద సరిగ్గా వర్క్ చేయలేదని, నలభై నిమషాల స్క్రిప్ట్ నే రెండు గంటలకు సాగదీసినట్లు వుందని, స్క్రిప్ట్ విన్న కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు హరీష్ శంకర్ స్క్రిప్ట్ సినిమాగా ఓకె కావడానికి అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి.