ఎమ్బీయస్‌: గోవాలో పడకేసిన పాలన లేస్తుందా?

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పర్రీకర్‌ (63) విదేశాల నుంచి తిరిగి వచ్చాడు కాబట్టి యిప్పటికైనా గోవాలో ప్రభుత్వం పట్టాలెక్కుతుందని ఆశించాలి. కానీ మనోహర్‌లో మునపటి ఆరోగ్యం లేదు కాబట్టి అతను వ్యవహారాలు ఎలా చక్కబెడతాడా…

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పర్రీకర్‌ (63) విదేశాల నుంచి తిరిగి వచ్చాడు కాబట్టి యిప్పటికైనా గోవాలో ప్రభుత్వం పట్టాలెక్కుతుందని ఆశించాలి. కానీ మనోహర్‌లో మునపటి ఆరోగ్యం లేదు కాబట్టి అతను వ్యవహారాలు ఎలా చక్కబెడతాడా అని వేచి చూడాల్సిందే. గోవాలో బిజెపికి మనోహర్‌ తప్ప మరో నాయకుడు కానరావటం లేదు. అతన్ని దిల్లీకి రప్పించి కేంద్రమంత్రిని చేస్తే, వేరే అతన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే గోవాలో పాలన అస్తవ్యస్తమైంది. చివరకు ఎన్నికల వేళ 40 సీట్ల ఎసెంబ్లీలో కాంగ్రెసు కంటె 4 సీట్లు తక్కువగా 13 వచ్చాయి. వెంటనే మనోహర్‌ను పంపితే అతను తన చాకచక్యమంతా ఉపయోగించి, 3 సీట్లున్న మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ పార్టీ (ఎంజిపి), 3 సీట్లున్న గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జిఎఫ్‌పి)లను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచాడు. ఏదోలా వ్యవహారం గడుపుకుని వస్తూ ఉంటే ఫిబ్రవరి నెలలో అతనికి కడుపులో ఏదో బాధ మొదలై ముంబయిలో లీలావతీ హాస్పటల్లో చూపించుకున్నాడు. పాన్‌క్రియాస్‌కు కాన్సర్‌ సోకిందని, బాగా ముదిరిపోయిందని, అమెరికాలో చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఉపముఖ్యమంత్రి ఉంటే అతనికి బాధ్యతలు అప్పగించేవాడు కానీ అలా ఎవరూ లేరు. తన పార్టీలో ఫ్రాన్సిస్‌ డిసౌజాకు అప్పగిస్తే భాగస్వామ్య పక్షాలు ఊరుకోవు. పోనీ సీనియర్‌, ఎంజిపికి చెందిన పిడబ్ల్యుడి మంత్రి సుదీన్‌ ధావ్లీకర్‌కో, జిఎఫ్‌పికి చెందిన వ్యవసాయ మంత్రి విజయ్‌ సర్దేశాయికో అప్పగిద్దామంటే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిద్దరికీ అస్సలు పడదు. దాంతో వాళ్లిద్దరితో పాటు డిసౌజాను కూడా చేర్చి సెంట్రల్‌ ఎడ్వయిజరీ కమిటీ అని ఏర్పరచి తన గైరుహాజరీలో నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్లకు అప్పగించి అమెరికాకు వెళ్లాడు. 
 
ముగ్గురి మధ్యా ఎన్నడూ లేని అవగాహన యిప్పుడు మాత్రం ఎలా వస్తుంది? వాళ్లు సమావేశం కావటం అరుదై పోయింది. మరి పాలన ఎలా సాగుతుంది? సాగడం లేదని, నిర్ణయాలన్నీ ఆగిపోయాయనీ కాంగ్రెసు ఆందోళన చేయసాగింది. అవతల మనోహర్‌కు అమెరికాలో కాన్సర్‌ చికిత్స సాగుతోంది. ఎప్పుడు తిరిగివస్తాడో తెలియని పరిస్థితి. కాంగ్రెసు మాటలు ప్రజలు నమ్మేస్తారేమోనని భయపడి బిజెపి 'ముగ్గురు సభ్యులు కలిసి కూర్చోకపోయినా విడివిడిగా అమెరికాలోని ముఖ్యమంత్రితో ఈమెయిల్‌ ద్వారా డైరక్టుగా టచ్‌లో ఉన్నారనీ, ఆయన సూచనల ప్రకారమే ప్రభుత్వాన్ని నడుపుతున్నార'నీ చెప్పసాగింది. ఇంతలో డిసౌజాకు ఏం పుట్టిందో ఏమో 'నేను నెల్లాళ్ల సెలవుపై పోర్చుగల్‌కు విహారయాత్రకై వెళుతున్నాను' అని వెళ్లిపోయాడు. జోక్‌ ఏమిటంటే వెళుతూ వెళుతూ తన మంత్రిత్వ శాఖలను అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రికి అప్పగిస్తున్నానని ప్రకటించడం! ఇది చాలనట్లు ఒక హై ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టును ఒక రియల్‌ ఎస్టేటు బిల్డర్‌కు అనువుగా మారుస్తున్నారని, బ్యాకప్‌ సరిగ్గా పెట్టుకోకపోవడం చేతనే ఉత్తర గోవాలో ఒక వారం రోజుల పాటు కరంటు సరఫరా లేకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సమయంలోనే బిజెపి విద్యుత్‌ మంత్రి పాండురంగ్‌ మద్కైకర్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ముంబయి హాస్పటల్‌లో చేరాడు. 
 
కాబినెట్‌లో ఉన్నదే 12 మంది. హోం, ఫైనాన్స్‌, జనరల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ చూసే ముఖ్యమంత్రి అమెరికాలో. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రి డిసౌజా పోర్చుగల్‌లో. విద్యుత్‌ శాఖామాత్యుడు పాండురంగ్‌ హాస్పటల్లో. కాగితాలు కదులుతున్నాయంటే ఎవరు నమ్ముతారు? ఈ పరిస్థితుల్లో మనోహర్‌ తనకు ఆత్మీయులైన జర్నలిస్టులు నలుగురికి అమెరికా నుంచి ఫోన్‌ చేసి పలకరించాడు. రాష్ట్రంలో జరుగుతున్న సంగతులన్నీ టెలిఫోన్‌ ద్వారా తను అక్కణ్నుంచే పర్యవేక్షిస్తున్నానని, డాక్యుమెంట్లు స్కాన్‌ చేసి తనకు ఈమెయిల్లో పంపిస్తున్నారనీ చెప్పుకున్నాడు. అయితే కాంగ్రెసు యిదంతా కొట్టి పడేసింది. ముఖ్యమంత్రి ఈమెయిల్‌ను ఆఫీసర్లు గోవాలోనే ఆపరేట్‌ చేస్తున్నారని ఆరోపించింది. గోవాకు పని చేసే ప్రభుత్వమూ, పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కావాలని నినాదాలు యిచ్చింది. కాబినెట్‌ సమావేశం జరిగి మూణ్నెళ్లు దాటింది కాబట్టి యీ అసాధారణ పరిస్థితికి పరిష్కారం కనుగొనమని రాష్ట్రపతికి అభ్యర్థన పంపుతున్నామని కాంగ్రెసు అంది. 
 
చికిత్స పూర్తయిందో లేదో తెలియదు కానీ యింకా ఆలస్యం చేస్తే విషమౌతుందని భయపడి కాబోలు మూణ్నెళ్ల అమెరికా వాసం తర్వాత మనోహర్‌ జూన్‌ 15న భారత్‌కు, 18 న గోవాకు తిరిగి వచ్చేశాడు. తను ఆరోగ్యంగానే ఉన్నాననీ, కానీ గతంలో రోజుకి 14 గంటలు పనిచేసే తను యిప్పుడు 6-7 గంటల కంటె ఎక్కువ పని చేయలేనని చెప్పాడు. పబ్లిక్‌ ఫంక్షన్లకు హాజరు కానని కరాఖండీగా చెప్పాడు. రాగానే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాడు. మండోవి, జువారీ నదుల పైన వంతెనల నిర్మాణాన్ని 2019 మార్చిలోగా పూర్తి చేసి ఎన్నికల నాటికి ప్రదర్శించాలని బిజెపి ఆత్రుత పడుతోంది. కానీ అవి ఆలస్యమయ్యాయి. గోవా సముద్రతీరంలో ఉధృతంగా అలలు వచ్చే ప్రాంతంలో 50 మీటర్ల లోపున నిర్మాణాలను అనుమతిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయించింది. దానివలన కోస్తాలోని 3,200 గ్రామాల్లో జాలరుల ఉపాధి పోతుందని స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి. గని తవ్వకాల్లో స్కాము జరగడంతో సుప్రీం కోర్టు మార్చి 16 నుంచి గోవాలో నాలుగు చోట్ల మైనింగ్‌ నిషేధించింది. దానివలన 2 లక్షల మంది జీవనోపాధి ప్రభావితమౌతుంది. 
 
మనోహర్‌ యీ చిక్కుముడులన్నీ విప్పాలి. అతను లేనప్పుడు వీటిని పరిష్కరించే నాధుడు లేకపోయాడు. అధికారాలన్నీ ఒకరి చేతిలో కేంద్రీకృతమైతే వచ్చే చిక్కే గోవాలోనూ వచ్చింది. మనోహర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఏ ప్రకటనా వెలువడకపోవడంతో పుకార్లు చిత్తం వచ్చినట్లు షికారు చేశాయి. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకుని వచ్చిన మనోహర్‌ వీటన్నిటితో ఎలా వేగుతాడో చూడాలి. మనోహర్‌ తిరిగి రావడంతో ఏమనుకున్నాడో ఏమో డిసౌజా తన సెలవు తగ్గించుకుని తిరిగి వచ్చాడు. జులైలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షాలు తమను నిలదీస్తాయి కాబట్టి ఆ దాడికి సిద్ధం కావడానికట! 
(మనోహర్‌ పర్రీకర్‌ – కాన్సర్‌ అమెరికా పర్యటనకు ముందు, తర్వాత)
 
ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2018)