రివ్యూ: ఈ నగరానికి ఏమైంది?
రేటింగ్: 2.5/5
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
తారాగణం: విశ్వక్ సేన్, సాయి సుషాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి తదితరులు
కూర్పు: రవితేజ గిరిజాల
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
నిర్మాత: సురేష్ బాబు
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
విడుదల తేదీ: జూన్ 29, 2018
'ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ పెళ్లిచూపులు'… తెలిసిన ఆర్టిస్టులు లేని ఈ చిత్రానికి ఇదే సెల్లింగ్ పాయింట్. మొదటి సినిమాతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న 'పెళ్ళిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండవ సినిమాతో కూడా ఏదైనా యునీక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే చూసాడు. హాలీవుడ్‌లో పాపులర్ అయిన 'బడ్డీ ఫ్లిక్' జోనర్‌లో నలుగురు స్నేహితుల కథని యువతరం ప్రేక్షకులకి నచ్చే శైలిలో రూపొందించాడు. 'దిల్ చాహ్‌తా హై', 'రాక్ ఆన్' లాంటి సినిమాలతో ఈ తరహా కథల్ని ఇండియన్ ఆడియన్స్ కూడా ఆదరిస్తారని రుజువైంది. సో… 'హేంగోవర్' సెటప్‌కి తన బ్యాక్‌గ్రౌండ్‌ని జత చేసి 'షార్ట్ ఫిలిం మేకర్స్' బ్యాక్‌డ్రాప్‌లో 'ఈ నగరానికి ఏమైంది?' తీర్చిదిద్దాడు తరుణ్.
కార్లో మొదటి సీన్ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత నలుగురు స్నేహితులు ఏం చేస్తున్నారని చూపించే వరకు హాస్యభరితంగా, అత్యంత వినోదాత్మకంగా టేకాఫ్ తీసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ముందుకి కదలడానికి మొరాయిస్తుంది. నలుగురు నాలుగు దారులు ఎంచుకోవడానికి గల కారణాలు, ఫ్లాష్‌బ్యాక్‌లో ఎదురైన సంఘటనలు 'నవ్వించాలని' చూస్తాయే తప్ప నలుగురు కుర్రాళ్లు తమకి నచ్చిన దానిని వదిలేసి దొరికిన దానితో సంతృప్తి పడిపోయి, జీవితంతో రాజీ పడిపోయే బలమైన పరిస్థితులు వుండవు. ఈ సినిమా ఇతివృత్తం కొత్తదేమీ కాదు. అభీష్టానికి వ్యతిరేకంగా అందిన దానితో జీవించేస్తోన్న వారు ఇష్టమైనది చేయడంలో వుండే ఆనందాన్ని తెలుసుకుని, కష్టమైనా అదే చేయాలని నిర్ణయించుకోవడం అనేది మెయిన్ ప్లాట్. ఇక్కడ కథానాయకులకి ఇష్టమైనది షార్ట్ ఫిలింస్ తీయడం. స్వతహాగా టాలెంటెడ్ అయినా ఎవరి బలహీనతలు వారికుంటాయి. ఆ ఇన్‌సెక్యూరిటీస్‌ని, ఆ ఆత్మన్యూనతని దాటుకుని అనుకున్నది చేయడమనేది కథకి ముగింపు. సంఘర్షణకి, భావోద్వేగాలకీ, అన్నిటికీ మించి పాత్రలతో 'కనక్ట్' అవడానికి, వారితో 'రిలేట్' చేసుకోవడానికి అనువైన లక్షణాలున్న కథే ఇది.
అయితే 'బడ్డీ ఫ్లిక్'ని 'దిల్ చాహ్‌తా హై', 'రాక్ ఆన్' చిత్రాల మాదిరిగా మన ఎమోషన్స్‌కి తగ్గట్టు తీర్చిదిద్దకుండా, 'హేంగోవర్' తరహాలో కేవలం కామెడీ సిట్యువేషన్స్, ఫన్నీ కాన్వర్‌జేషన్స్‌కే పరిమితం చేయడం వల్ల పైన చెప్పుకున్న లక్షణాలన్నీ మిస్ అయిపోయి ఏమాత్రం సీరియస్‌నెస్ లేని 'టైమ్‌పాస్' వ్యవహారంలా తయారైంది. అసలే తరుణ్ భాస్కర్ ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్ అందరూ రిలేట్ చేసుకోగలిగేది కాదు. షార్ట్ ఫిలింమేకర్స్ అవ్వాలనే యువకులు తొలి సినిమా తీయడం కోసం పడ్డ కష్టాలు వగైరా వాటితో రిలేట్ చేసుకోగలరేమో కానీ 'హ్యాపీడేస్' మాదిరిగా కాలేజ్ డేస్‌ని అందరూ గుర్తు చేసుకోగలిగే తరహా నేపథ్యం కాదిది. ఎక్కువ మంది రిలేట్ చేసుకోలేని బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నపుడు ఎమోషనల్‌గానో, ఏదో విధంగా లాక్ అవడం వలనో సదరు పాత్రలతో ట్రావెల్ చేసే వీలు కల్పించాలి. కానీ సినిమాలో సింహ భాగం మందు ముచ్చట్లు, ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లతోనే గడిచిపోతుంది.
షార్ట్ ఫిలింకి కథ దొరక్క పాట్లు పడే వివేక్ పాత్రలానే తరుణ్ భాస్కర్ కూడా తన దగ్గరున్న కొంచెం కంటెంట్‌తో షార్ట్ ఫిలిం కాకుండా ఫుల్ ఫీచర్ తీయడానికి చాలా అవస్థలు పడ్డాడు. రిపీటెడ్ దృశ్యాలు, సంభాషణలతో, కథ నడిపించడానికి కంటెంట్ లేక జోకులు, సుదీర్ఘమైన కామెడీ సన్నివేశాలతో కాలక్షేపం చేయడం తెలిసిపోతూనే వుంటుంది. ప్రథమార్ధంలో ఈ ధోరణి వల్ల పెద్ద సమస్య తలెత్తదు. పాత్రల పరిచయం, వారి నేపథ్యం తాలూకు సన్నివేశాలతో చాలా వరకు సమయం గడచిపోతుంది కనుక కంటెంట్ లేమి అక్కడ పెద్ద అవరోధం అనిపించదు. కానీ ద్వితియార్ధంలో కూడా ఇదే ధోరణి కనబరచడం వల్ల కేవలం జోకులేసి మార్కులు కొట్టేయాలనే ఎస్కేపిజం కనిపిస్తుంది. 'పెళ్ళిచూపులు'కి కూడా అన్‌కన్వెషనల్ సెటప్, క్యారెక్టర్స్ ఎంచుకున్నా కానీ దానికి బలమైన సంఘర్షణ, నెమ్మదిగా మొగ్గ తొడిగే ప్రేమకథ అత్యంత సహజంగా అమిరేట్టు చూసుకున్నాడు. కానీ ఇక్కడ ఈ జోక్ పేలితే పనైపోతుంది, ఇక్కడీ సీన్ పండితే పది నిమిషాలు కంటెంట్ లేకున్నా పాస్ అయిపోతుంది అన్న రీతిన తేలికపాటి వ్యవహారం తేటతెల్లమవుతుంది.
అలాగని దర్శకుడిగా తరుణ్ ఫామ్ కోల్పోయాడనడానికి లేదు. ఎగ్జామ్ హాల్‌లో మాటలు లేకుండా హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశం కానీ, ఆమెకి ఐలవ్యూ అని చెప్పకుండానే తన మనసులో మాట బయటపెట్టే విధానం కానీ, ఆ తర్వాత బ్రేకప్ కాలేదని తనని తాను మోసం చేసుకుంటోన్న టైమ్‌లో తను బహుమతిగా ఇచ్చిన కుక్కపిల్లని కూడా వదిలేసి పోయిందని తెలిసే దృశ్యం కానీ తరుణ్ టాలెంట్‌ని చూపిస్తాయి. గ్లాస్ డోర్‌కి అటు ఇటు నిలబడి డాన్స్ చేసే సీన్ కూడా బ్రిలియంట్ టచ్. ఇంత హృద్యంగా సన్నివేశాలని తెరకెక్కించే సామర్ధ్యం వుండీ, భావోద్వేగాలని అన్‌కన్వెన్షనల్‌గానే బలంగా పలికించగల నేర్పు వుండీ ఎస్కేపిస్ట్ రూట్ ఎంచుకుని కాలక్షేపం ఎపిసోడ్లతో దాటవేయడం నిరాశ కలిగిస్తుంది.
ఈ చిత్రానికి విజువల్‌గా సరికొత్త అనుభూతి తీసుకురావడం వెనుక దర్శకుడిగా తరుణ్ విజన్‌కి చాలా క్రెడిట్ దక్కుతుంది. కీ టెక్నీషియన్లు అందరూ తమ శక్తిమేరకు కృషి చేసి ఈ చిత్రానికి విజువల్‌గా సరికొత్త లుక్ తీసుకురావడానికి దోహదపడ్డారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ప్రతిభ చాలా సన్నివేశాల్లో హైలైట్ అవుతుంది. వివేక్ సాగర్ కూడా మ్యూజిక్‌ని, సైలెన్స్‌ని సమర్ధవంతంగా వాడిన విధానం మెప్పిస్తుంది. 'ఆగి ఆగి' పాట మినహా వివేక్ స్వరాలు ఈసారి అంతగా ఆకట్టుకోలేదు.
విదేశీ చిత్రాల ప్రభావం అధికంగా వున్న ఈ చిత్రానికి రూపం ఫారిన్‌ది సెట్ చేసినా హార్ట్ ఇండియన్‌ది వుంచే ప్రయత్నం చేయాల్సింది. దోస్తానా అంటే నాలుగు జోకులు, ఆరు తాగుడు సన్నివేశాలు అనే బాపతు వారికి మస్తు కాలక్షేపం అయిపోవచ్చునేమో కానీ అంతకు మించి వుండాలని కోరుకునే వారికి ఇందులో శరీరమే తప్ప ఆత్మ కానరాదు. లిమిటెడ్‌లో లిమిటెడ్ సెక్షన్‌ని టార్గెట్ చేసిన ఈ బడ్డీ కామెడీకి ఎంత బాక్సాఫీస్ పొటెన్షినల్ వుందనేది వేచి చూడాల్సిందే.
బాటమ్ లైన్: ఈ నగరంలో ఏముంది?
గణేష్ రావూరి