ఎమ్బీయస్‌: పూరీ గుడి తాళంచెవి మిస్టరీ

    తిరుపతి గుడిలో స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అని మన దగ్గర అనుమానాలు చెలరేగిన సమయంలోనే పూరీ జగన్నాథుని  నగల గురించి కూడా భక్తుల్లో ఆందోళన ప్రారంభమైంది. భక్తులతో పాటు,…

    తిరుపతి గుడిలో స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అని మన దగ్గర అనుమానాలు చెలరేగిన సమయంలోనే పూరీ జగన్నాథుని  నగల గురించి కూడా భక్తుల్లో ఆందోళన ప్రారంభమైంది. భక్తులతో పాటు, ఆ గుడి ధర్మకర్తలైన గజపతి మహారాజులు గుడికి ఎన్నో విలువైన కానుకలు సమర్పించారు. అనంగ భీమదేవుడనే రాజు ఆ రోజుల్లోనే 1457 కిలోల బంగారపు ఆభరణాలు యిచ్చాడట. 1466లో కపిలేంద్ర దేవ్‌ గజపతి కూడా ఎన్నో ఆభరణాలు యిచ్చాడట. గుడి రికార్డుల ప్రకారం 1952లో 150 రకాల వివిధ ఆభరణాలు ఉన్నాయట. గుడిలో 7 గదులున్న రత్న భండారం అనే చోట వీటిని భద్రపరచారు. వాటిలో మూడు గదులు వాడుతూంటారు. స్వామివారి నిత్యసేవకు ఉపయోగించే ఆభరణాలు యీ మూడు గదుల్లో పెట్టారు. తక్కిన గదులకు తాళాలు వేసి వుంటాయి. బయటి ద్వారానికి మూడు తాళం చెవులుంటాయి. వాటిలో ఒకటి గజపతి వంశీకుల వద్ద, ఒకటి దేవాలయ బోర్టు – శ్రీ జగన్నాథ టెంపుల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (ఎస్‌జిటిఎ) వద్ద, మూడోది ప్రభుత్వాధికారి ఐన పూరీ జిల్లా కలక్టరు వద్ద ఉంటాయి. లోపలి ద్వారానికి కూడా యిలాటి ఏర్పాటే ఉంది కానీ 1960లో గజపతుల నుంచి ఆలయనిర్వాహణ ఒడిశా ప్రభుత్వం తీసేసుకున్నాక ఆయన వద్ద మూడో తాళం చెవి లేదు. కలక్టరు, ఎసిజిటిఎ మధ్యే ఉంటోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటప్పుడు ప్రతీ ఆర్నెల్లకు భండారం తెరుస్తామని, మూడేళ్ల కోసారి ఎస్‌జిటిఎ కమిటీ మారినప్పుడల్లా జాబితా తయారు చేస్తూంటామని లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంది. కానీ అలా జరగలేదు. 1964లో ఒకసారి భండారం తెరిచి, లోపల ఏమున్నాయో జాబితా తయారుచేశారు. ఆ తర్వాత 1978లో చేశారు. 1984లో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ) అధికారులతో కలిసి తలుపులు తీయబోయారు. రెండు తలుపులు తెరిచేసరికి లోపల్నుంచి విషసర్పాల బుసబుసలు వినబడడంతో అందరూ అడిలిపోయారు. భాండారం తరచుగా తెరవడం జగన్నాథుడికి యిష్టం వుండదని, తెరిస్తే యిక్కట్లు వస్తాయనే నమ్మకం ఒకటి ప్రచారంలో ఉంది. దాంతో ఎందుకొచ్చిన గొడవ అని భాండారం సాంతం తెరవకుండా ఊరుకున్నారు. ఆ తర్వాత కూడా అదే భయంతోనో, మరే కారణంతోనో తెరవలేదు.
 
కాలక్రమేణా గుళ్లు శిథిలం కావడం సహజం కాబట్టి భాండారం స్థితిగతులు ఎలా ఉన్నాయో ఎఎస్‌ఐ సాయంతో పరిశీలించమని ఒడిశా హైకోర్టు ఈ మార్చిలో ఆదేశించింది. కోర్టు ఉత్తర్వు అమలు చేయడానికి ఎస్‌జిటిఎ తమ వద్దనున్న తాళం చెవి బయటకు తీసి, కలక్టరు ఆఫీసులో ఉన్న 25 అంగుళాల పొడవున్న యిత్తడి తాళం చెవి పట్టుకురమ్మనమని కలక్టరుకి కబురు పెట్టింది. అయితే వాళ్ల వద్ద ఉండవలసిన చెవి కనబడలేదు. వెంటనే పోలీసు రిపోర్టు యివ్వాల్సింది, కానీ యివ్వలేదు. ఏదోలా నాటకం ఆడేద్దామనుకున్నారు. ఏప్రిల్‌ 4న ఎస్‌జిటిఎ, ఎఎస్‌ఐ, ప్రభుత్వాధికారులు కొందరు మొత్తం 17 మంది టీముగా ఏర్పడి గుళ్లో తిరిగారు. ఆ తర్వాత ఎస్‌జిటిఎకి చీఫ్‌ ఎడ్మినిస్ట్రేటర్‌ (మన టిటిడి ఇఓ లాటివాడు)గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ జేనా బయటకు వచ్చి పత్రికల వాళ్లతో ''మేం సెర్చిలైట్ల సాయంతో నిర్మాణాలను బయటనుంచి పరిశీలించాం. అంతా బాగానే ఉంది. రత్నభండారంలోకి ప్రవేశించ వలసిన అవసరం ఏమీ కనబడలేదు.'' అని చెప్పాడు. అందరికీ వింతగా తోచింది కానీ ఎవరూ ఏమీ అనలేదు. అయితే జూన్‌ మొదటివారంలో కలక్టరాఫీసులో ఉండవలసిన చెవి కనబడకపోవడం చేతనే అలా చెప్పారని బయటకు పొక్కింది. దాంతో పెద్ద గొడవ అయింది. రత్న భండారాన్ని ఎవరైనా కొల్లగొట్టారా అనే సందేహాలు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించాలని, సిబిఐ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 
 
అసలేం జరిగిందో తేల్చడానికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ జూన్‌ 6న రిటైర్డ్‌ హైకోర్టు జజ్‌ జస్టిస్‌ రఘువీర్‌ దాష్‌ నేతృత్వంలో కమిటీ వేసి మూణ్నెళ్లలో రిపోర్టు యిమ్మన్నాడు. వ్యవహారాన్ని రిపోర్టు చేయకుండా తొక్కిపెట్టిన ప్రదీప్‌ జేనాను జూన్‌ 11న తొలగించి, ఆయన స్థానంలో ప్రదీప్త మహాపాత్రను వేశాడు. ఇంకో రెండు రోజులకు జూన్‌ 13న తాళం చెవి దొరికిందంటూ జిల్లా కలక్టరు అరవింద్‌ అగర్వాల్‌ ప్రకటించాడు. 'అది ఎక్కడుందో వెతకమని నలుగురు సభ్యుల టీముని వేశాం. వాళ్లు జిల్లా ట్రెజరీ ఆఫీసులోని రికార్డు రూములో ఒక కవర్లో అది ఉందని కనుగొన్నారు' అన్నాడు. అయితే చిక్కు ఎక్కడ వచ్చిందంటే దానికి 'డూప్లికేట్‌' అని ఒక ట్యాగ్‌ కట్టి ఉంది. ''ఒరిజినల్‌ని ఏం చేశారు?'' అని కాంగ్రెసు, బిజెపి నాయకులు గర్జించడంతో యిది మళ్లీ కొత్త వివాదానికి దారి తీస్తుందని భయపడిన న్యాయశాఖా మంత్రి ప్రతాప్‌ జేనా ''1984లో రత్న భాండారాన్ని తెరిచినప్పుడు కూడా దీన్నే వాడారు'' అని ప్రకటించాడు. ''ఏది ఏమైనా కమిటీయే అన్ని విషయాలు బయటకు తీస్తుంది.'' అని చేర్చాడు. ప్రభుత్వం కమిటీ యొక్క విచారణాంశాలను విస్తరింపజేసింది.  తాళం చెవుల సంరక్షణ, వాడకం విషయంలో వ్యక్తుల/సంస్థల/అధికారుల పాత్రను, లోపాలను కూడా తరచి చూడమని కోరింది. జస్టిస్‌ దాష్‌ అధికారులు, మహంతుల నుంచే కాకుండా ప్రజల నుంచి అఫిడవిట్లు కోరుతున్నారు. జులై 25 లోగా తనకు అందివ్వాలని, జులై 30న మొదటి సమావేశం నిర్వహిస్తానని అంటున్నారు. 
 
ఆ నివేదిక బయటకు వస్తేనే దీని వెనుక ఉన్న 'జగన్నాటకం' లోకవిదితమవుతుంది.
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2018)