ఎన్టీఆర్ బయోపిక్ రెండు ముక్కలు ?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎలా వుంటుందో కానీ, సినిమా తీయడానికి జరుగుతున్న వ్యవహారాలు అన్నీ కలిసి ఓ సినిమా కథ రేంజ్ లో వున్నాయి. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి వ్యవహారమూ మారుతూ…

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎలా వుంటుందో కానీ, సినిమా తీయడానికి జరుగుతున్న వ్యవహారాలు అన్నీ కలిసి ఓ సినిమా కథ రేంజ్ లో వున్నాయి. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి వ్యవహారమూ మారుతూ వస్తోంది. ఆఖరికి డైరక్టర్ మారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైరక్టర్ క్రిష్ చేతిలో వుంది సినిమా. 

అయితే క్రిష్ వచ్చిన తరువాత స్క్రిప్ట్ మొత్తాన్ని తన స్టయిల్ లోకి మార్చుకునే పనిలో బిజీగా వున్నారు. అదే సమయంలో ఆయన ఈ స్క్రిప్ట్ మొత్తాన్నిఅనుకున్నట్లు తీయాలంటే ఒక భాగం చాలదు అని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత కమ్ హీరోతో డిస్కషన్లు జరిపి, ఆఖరికి రెండు భాగాలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అంటే ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్, పార్ట్ 2 కింద వస్తుందన్నమాట. అయితే పార్ట్ వన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వుంటుంది? పార్ట్ 2 లో ఏముంటాయి అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసి, ఆఫై అధికారం చేపట్టే వరకు వుంటే, మరి మిగిలిన పార్ట్ లో ఏముంటుంది? ఎన్టీఆర్ ద్వితీయ వివాహం, పదవీ చ్యుతి, మరణం వుండాలి. కానీ ఈ విషయాలన్నీ నిజాయతీగా చర్చించడానికి, తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ కు కావాల్సిన స్వేచ్ఛ లభిస్తుందా? అన్నది అనుమానం. అలా లభించినపుడు ఇక ద్వితీయ భాగంతో కిక్ ఏముంటుంది?

లేదూ సినిమా రంగంలోకి వచ్చి, ఓ టాప్ స్టార్ గా ఎదిగే వరకు పార్ట్ వన్ అని, రాజకీయ రంగ ప్రవేశం పార్ట్ 2 అని అనుకున్నా కూడా సమస్యే. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ ను రాబోయే ఎన్నికలకు వాడాలని అనుకుంటున్నారు. అప్పుడు ఫస్ట్ పార్ట్ తో పెద్దగా ఉపయోగం వుండదు. బాలయ్య తన వేషాల సరదా తీర్చుకోవడం మాత్రమే సాద్యమవుతుంది. మలి పార్ట్ అంత త్వరగా తీయడం సాధ్యం కాకపోవచ్చు.

మరి ఏ ఉద్దేశంతో క్రిష్-బాలయ్య రెండు భాగాలు చేయాలనుకుంటున్నారో తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే ఇప్పటికి రానా, విద్యాబాలన్ లను పిక్స్ చేసారు బయోపిక కోసం. శర్వానంద్ సంగతి ఇంకా తేలలేదు.

యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ ను తీసుకునే ఆలోచన ఇంకా డిస్కషన్ల దగ్గరే వుంది. మిగిలిన అనేకానేక పాత్రలకు క్రిష్ వీలయినంత వరకు కొత్తవారిని, అలాగే నార్త్ కు చెందిన థియేటర్ ఆర్టిస్టులను (రామ్ గోపాల్ వర్మ మాదిరిగా) తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ షూట్ ఆగస్టు నుంచి ప్రారంభం కావాల్సి వుంది. ఆ లోగా ఈ పనులు అన్నీ పూర్తవుతాయా? వేచి చూడాల్సిందే.