మున్నాభాయ్ బయోపిక్ ట్రైలర్లో రణ్‌బీర్ కపూర్‌తో చెప్పించిన డైలాగ్ ఇంకా మార్మోగుతూనే ఉంది. సంజయ్ దత్ నిజంగానే మూడు వందల యాభై మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడా? అనే దానిపై మీడియా చర్చను కొనసాగిస్తూ ఉంది. దశాబ్దాల పాటు బాలీవుడ్లో స్టార్‌గా.. మాస్ ఇమేజ్ బ్రహ్మాండంగా ఉన్న హీరోగా కొనసాగిన, కొనసాగుతున్న హీరో సంజయ్ దత్. తెలుగునాట మాస్ హీరోలకు ఎలాంటి భక్తులున్నారో సంజయ్ దత్‌కు కూడా అదే హిందీ మాట్లాడే జనాల్లో అదే స్థాయి భక్తులున్నారు. వ్యక్తిగత జీవితంలో దత్ ఎన్ని వివాదాల్లో ఇరుక్కొన్నా.. అతడి సినీ గ్లామర్ మాత్రం ఏనాడూ తగ్గుముఖం పట్టలేదు. సినీ జనాల్లో కూడా అంతే దత్ అంటే.. అదో క్రేజ్.
సహచర బాలీవుడ్ హీరోలు కూడా దత్ ఒక పెద్దన్నలా చూస్తారు. దత్ పట్ల గౌరవాన్ని ప్రకటించుకుంటారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లాంటి వాళ్లు సంజయ్ దత్ ముందు చేతులు కట్టుకుని నిలబడే టైప్. సల్మాన్ కు స్వయంగా బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్నా.. దత్ ను ఒక సీనియర్ గా గౌరవిస్తాడు. ఇలా బాలీవుడ్ స్టార్లలో కూడా తనపై గౌరవాన్ని క్రేజ్ ను కలిగి ఉన్న హీరో సంజయ్ దత్.
మరిలాంటి హీరోకి హీరోయిన్లలో క్రేజ్ ఉండదా? అమ్మాయిల్లో క్రేజ్ ఉండదా? ఉండే ఉంటుంది కానీ, మరీ 350 మందితో రొమాన్సా? అనేది మాత్రం సంచలన అంశమే. అయితే ట్రైలర్లో ఆ డైలాగ్ లో కొంత సరదా కూడా ఉంది. ‘309 మందితో రొమాన్స్ చేశా.. 350 మందితో అని రాసుకో..’ అని దత్ పాత్రలోని రణ్‌బీర్ అంటాడు. ఈ డైలాగ్ విని తను కూడా ఆశ్చర్యపోయానని అంటోంది దియా మీర్జా.
దత్ బయోపిక్‌లో ఆయన మూడో భార్య మాన్యత పాత్రను చేసింది దియా. 350 మందితో.. అనే డైలాగ్ విని తను కూడా ఆశ్చర్యపోయానని, ఈ విషయం గురించి రాజ్ కుమార్ హీరానీతో కూడా ఆరాతీశానని దియా చెప్పింది. అది నిజమేనా? అనే విషయం మీరు కూడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అని అంటోంది దియా. సంజయ్ దత్ జీవితం అతడి ఇంట్లో వాళ్లకు ఓపెన్ సీక్రెట్ అని, దత్ గురించి మాన్యతకు పూర్తిగా తెలుసని, అన్నీ తెలిసే పెళ్లి చేసుకుందని దియా చెప్పుకొస్తోంది.