అంతర్జాతీయంగా బదనాం అవుతోన్న టాలీవుడ్‌

తెలుగు సినిమా బాహుబలితో ప్రపంచ యవనికపై జయకేతనం ఎగురవేసిందనే ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా తెలుగు చిత్ర సీమలోని చీకటి కోణం పదే పదే చర్చకి వస్తోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అంతటా వున్నా…

తెలుగు సినిమా బాహుబలితో ప్రపంచ యవనికపై జయకేతనం ఎగురవేసిందనే ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా తెలుగు చిత్ర సీమలోని చీకటి కోణం పదే పదే చర్చకి వస్తోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అంతటా వున్నా కానీ అదేదో తెలుగు సినిమా రంగంలోనే పుట్టి పెరిగినట్టుగా ఇంటర్నేషనల్‌గా కవరేజ్‌ వచ్చింది. శ్రీరెడ్డి నగ్న నిరసనకి అంతర్జాతీయ పత్రికల్లోను ప్రచారం లభించింది.

తాజాగా అమెరికాలో బయట పడ్డ సెక్స్‌ రాకెట్‌ మొత్తం టాలీవుడ్‌ చుట్టే తిరగడంతో మరోసారి అంతర్జాతీయ పత్రికల్లో తెలుగు సినిమాకి మురికి కూపమనే పేరు దక్కింది. డబ్బు కోసం కొందరు తొక్కే అడ్డదారులు, దానికి అలవాటు పడుతోన్న నవతరం తారలు తెలుగు సినిమాని దారుణంగా చిత్రీకరిస్తున్నాయి. చికాగో ట్రిబ్యునల్‌లో ప్రచురితమైన కథనంలో అయితే తెలుగు సినిమా పరిశ్రమ ఒక వ్యభిచార కూపమనేట్టుగా ప్రపంచానికి పరిచయమైంది.

లోకల్‌గా జరిగే దారుణాల సంగతి సరేసరి. ఇప్పటికే పలుమార్లు తెలుగు సినీ తారలు పలువురు ప్రాస్టిట్యూషన్‌ చేస్తూ బయట పడ్డారు. అయినప్పటికీ ఎవరిపైన టాలీవుడ్‌కి చెందిన ఏ అసోసియేషన్లు గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కెరీర్‌కే ప్రమాదం వాటిల్లే అవకాశం వుందంటే సైడ్‌ ఇన్‌కమ్‌ కోసం కక్కుర్తి పడే వాళ్లు కొందరయినా జంకుతారు. తెలిసీ తెలియనట్టుగా, చూసీ చూడనట్టుగా వ్యవహరించినంత కాలం తెలుగు సినిమా పరువు ప్రపంచ వ్యాప్తంగా పోతోంటే తల దించుకుంటే భరించాల్సి వస్తుంది.