కొందరంతే, హిట్ లు, ఫ్లాపులతో సంబంధం లేదు. తమ చెక్కుడు తమదే. అలా అలా చెక్కుతూ వుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ వుంటారు. అలాంటి వాళ్లలో హను రాఘవపూడి కచ్చితంగా వుంటారని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి.
ఈ గుసగుసలకు తగినట్లే వుంది ‘పడి పడి లేచె మనసు’ సినిమా వ్యవహారం. ఈ ఏడాది ఫిబ్రవరి 5మొదలు పెట్టారు. ఇప్పటికి నాలుగు నెలలు దాటిపోయింది. కానీ ఇంకా ఎక్కడ మొదలైన కథ అక్కడే వుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా సెప్టెంబర్ కు విడుదల అవుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇంకా చాలా షూట్ వుందని తెలుస్తోంది. అది కూడా డార్జిలింగ్, కలకత్తా, ఇంకా అనేక చోట్ల వుందట.
పైగా హీరో శర్వానంద్ కూడా అందుకు తగినవాడే. అస్సలు గాభరాపెట్టడు. కావాలంటే ఇంకో ఆరు నెలలు తీసుకోండి. తనకు మాత్రం కావాల్సినంత రెస్ట్ ఇవ్వండి అనే టైపు. పైగా నిర్మాతలు కొత్తవారు. ఎన్నారైలు. వాళ్లకి చూస్తూ వుండడం తప్ప, అడిగే పరిస్థితి లేదు.
దాంతో పడి పడి లేచె మనసు సినిమా అలా పడుతూ లేస్తూ, సాగుతోందని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమా సబ్జెక్ట్ కు, సాయి ధరమ్ తేజ్ ఐ లవ్ యు సినిమాకు పోలికలు వున్నాయని కూడా వినిపిస్తోంది. ప్రేమించిన అమ్మాయి ప్రియుడిని మరిచిపోతే అన్న కాన్సెప్ట్ అని తెలుస్తోంది.