కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఈమధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. నా పేరు సూర్య రిలీజ్ టైమ్ లో ఈ పుకార్లు కాస్త గట్టిగానే వినిపించాయి. మరీ ముఖ్యంగా బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎప్పటికీ ఎనౌన్స్ చేయకపోవడంతో చాలామంది ఈ కాంబినేషన్ ఉందనుకున్నారు. అలా కొన్నిరోజులకు సద్దుమణిగిన ఈ రూమర్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. దీనికి కారణం ఇద్దరూ పారిస్ వెళ్లడమే.
అవును.. కొరటాల శివ, బన్నీ ఒకేసారి హాలిడే ట్రిప్ కు వెళ్లారు. ఇద్దరూ పారిస్ కే వెళ్లారు. కాకపోతే వేరువేరుగా. బన్నీ వెళ్లిన షార్ట్ గ్యాప్ లో కొరటాల కూడా పారిస్ వెళ్లాడు. దీంతో మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ పై ప్రచారం ప్రారంభమైంది.
నిజానికి ఇప్పుడు బన్నీ, కొరటాల కాంబినేషన్ చర్చలో లేదు. చిరంజీవితో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు కొరటాల. ఇప్పటికే చిరుకు స్టోరీలైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడు కొరటాల. ఆ స్టోరీలైన్ ను పూర్తిస్థాయి స్క్రీన్ ప్లేగా మార్చే క్రమంలో పారిస్ ట్రిప్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ట్రిప్ పూర్తవ్వగానే కొరటాల-చిరు సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
అటు బన్నీ కూడా విక్రమ్ కుమార్ కు దాదాపు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు బన్నీకి స్టోరీ నెరేట్ చేశాడు విక్రమ్ కుమార్. ప్రస్తుతం సెకెండాఫ్ రాసే పనిలో ఉన్నాడు. ఈ గ్యాప్ లో రిలాక్స్ అవ్వడం కోసం పారిస్ వెళ్లాడు బన్నీ. సో.. ప్రస్తుతానికి బన్నీ-కొరటాల సినిమా లేనట్టే.