ఏపీలో ఇసుక సరఫరా వ్యవహారాలపై ఇప్పుడు నానా రాద్ధాంతం జరుగుతోంది. పచ్చ మీడియా ఒక వంటకాన్ని వండి వార్చడమూ, దాన్ని పట్టుకుని ఇక పచ్చ పార్టీ రెచ్చిపోవడమూ చాలా సాధారణమైన సంగతి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
ఇసుక సరఫరా అనే వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా? లేదా? అనే విషయంపై అందరి ధ్యాస పక్కకు మళ్లిపోయింది. ఏం అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టంగా చెప్పకుండానే.. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి భారీగా దండుకుంటున్నారనే ప్రచారం మీదనే దృష్టి పెడుతున్నారు. జగన్ మీద బురద చల్లడానికి తప్ప మరో విషయం పట్టించుకోవడం లేదు.
ఏపీలో ఇసుక సరఫరా అనే వ్యవహారాన్ని జేపీ వెంచర్స్ అనే కంపెనీకి ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. వారు చెన్నైకు చెందిన టర్న్ కీ సంస్థకు సబ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వారి ఆధ్వర్యంలోనే ఏపీలో ఇసుక సరఫరా వ్యవహారం జరుగుతోంది.
అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న ఒకే ఒక్క ఆరోపణ.. ఆన్ లైన్ వే బిల్లులు, రసీదులు ఇవ్వకుండా ప్రింటెడ్ రసీదులు ఇస్తున్నారని, దానివల్ల అక్రమాలు జరిగే అవకాశం ఉన్నదనీ మాత్రమే. అంతవరకే ప్రజలకు సంబంధం. అది నిజమో కాదో తేల్చాలి. ఆన్ లైన్ బిల్లుల విషయంలో మంత్రి, అధికారులు తలోరకంగా మాట్లాడడం వల్ల క్లారిటీ రాలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించినంత వరకు అదొక్కటే కీలకాంశం. అయితే విపక్షాల రాద్ధాంతం అంతా ఈ పాయింటు కంటె ఇతర అంశాల మీదనే ఎక్కువగా సాగుతోంది.
ఏదో ఒక రీతిగా టర్న్ కీ సంస్థ.. జగన్ బినామీ సంస్థ అని చాటి చెప్పడానికి వారు ఆరాటపడుతున్నారు. వారు ఈ రకమైన ఆరోపణలన్నీ కూడా అదుగోపులి అంటే ఇదిగో తోక అంటున్న చందంగానూ, తలాతోకా లేకుండానూ సాగుతున్నాయి. ఎలాగంటే..
శేఖర్ రెడ్డి అనే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడికి గతంలో తమిళనాడులో ఇసుక సరఫరాకు సంబంధించిన ఒక వ్యాపారం ఉండేది. ఆయన కంపెనీలో అప్పట్లో శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి పనిచేసేవారు. 2017లోనే ఆయన ఆ వ్యాపారం మూసేశారు. సీన్ కట్ చేస్తే..
ఇప్పుడు ఏపీ ఇసుక సరఫరాను సబ్ కాంట్రాక్టు తీసుకున్న టర్న్ కీ సంస్థకు శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి డైరక్టరు. ఈ రెడ్డి- నాయుడు పదాల మధ్య తేడాను తెలుగుదేశం నాయకులు తుంగలో తొక్కేశారు. ఈ టర్న్ కీ డైరక్టరు శ్రీనివాసరెడ్డి గతంలో శేఖర్ రెడ్డికి వ్యాపార భాగస్వామి అని.. ఇప్పుడు ఆయన పేరు మీద జగనే స్వయంగా దందా నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ శ్రీనివాసరెడ్డి ఎవరో తనకు తెలియదు.. తన కంపెనీలో ఉన్నది శ్రీనివాస నాయుడు మాత్రమే అని శేఖర్ రెడ్డి మొత్తుకుంటున్నా వారు వినడం లేదు.
టర్న్ కీ అనేది ఎవరి సంస్థ అయినా కావొచ్చు. అది ఎవరిదనేది ప్రధానం కాదు. వారు చేస్తున్న వ్యాపారంలో ఏం తప్పులు జరుగుతున్నాయి. ప్రజలు, లేదా రాష్ట్ర ఖజానా ఏ రకంగా నష్టపోతున్నది అనే అంశం మాత్రమే ప్రతిపక్షాలు చర్చిస్తే, పచ్చ మీడియా ఎత్తి చూపిస్తే వారికి చాలా పరువుగా ఉండేది.
రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడకుండా.. ‘శ్రీనివాస’ అనే పేరు కనపడగానే.. కులం తోకలు మర్చిపోయి.. శేఖర్ రెడ్డితెో సంబంధం అంటగట్టి, అటునుంచి జగన్ తో సంబంధం అంటగట్టి.. దుష్ప్రచారం సాగించడానికి పూనుకోవడం చాలా హేయం. నీచం కూడా. ఇలాంటి అసహ్యమైన ప్రచారాల్ని ప్రజలు ఈసడించుకుంటారని వారు తెలుసుకోవాలి.