పవన్‌ లక్ష్యం..ఎమ్మెల్యేగా గెలవడమేనా!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీరు ఎప్పటికీ మారదేమో! ఆయన ఏపీలో వివిధ జిల్లాల పర్యటనలో చేసిన ప్రసంగాలు చూస్తే ఆ భావన కలుగుతుంది. కౌలు రైతుల ఆత్మహత్యలు అంటూ పవన్‌ కొత్త పల్లవి…

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీరు ఎప్పటికీ మారదేమో! ఆయన ఏపీలో వివిధ జిల్లాల పర్యటనలో చేసిన ప్రసంగాలు చూస్తే ఆ భావన కలుగుతుంది. కౌలు రైతుల ఆత్మహత్యలు అంటూ పవన్‌ కొత్త పల్లవి అందుకున్నారు. నిజంగానే ఎవరైనా రైతులు ఆత్మహత్య చేసుకుని ఉంటే, అది కూడా వ్యవసాయ సంబంధిత కారణాలతో జరిగి ఉంటే వారికి సాయం చేయవచ్చు. కాని అలాకాకుండా వందలు, వేల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అర్థసత్యాలు ప్రచారం చేయడానికి పవన్‌ కళ్యాణ్‌ పూనుకున్నారు. 

కొన్ని ఆత్మహత్య కేసులలో ప్రభుత్వం ఏడు లక్షల రూపాయల చొప్పున చెల్లించింది. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలన సమయంలో తెలంగాణలో కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ అలాంటి వారి కుటుంబాలకు సాయం చేయాలని డిమాండ్‌ చేసేది. ఆ తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం అంటే అలాంటివాటిని ప్రోత్సహించడమే అవుతుందని వాదించేది. ఆ తర్వాత రోజుల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలోకి రాగానే అదే పరిహారం డిమాండ్‌ చేసేది. అది వేరే విషయం.

అనంతపురం జిల్లాలో అప్పట్లో కరువు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవి. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీవారు ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని రప్పించి ఆ కుటుంబాలకు కొంత సాయం ఇప్పించాయి. అందులోను రాజకీయ కోణం ఉందన్నది వాస్తవం. పవన్‌ కళ్యాణ్‌ సడన్‌గా కౌలు రైతుల ఆత్మహత్యల గురించి ప్రచారం చేయడం, ఆయన లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం వంటివి ఆసక్తికరంగా ఉన్నాయి. ఎవరికైనా సాయం చేయడాన్ని ఆక్షేపించజాలం. కాకపోతే రాజకీయ దురుద్దేశాలతోనే ఉన్నవి, లేనివి చెబితేనే సమస్య అవుతుంది. 

గతంలో జగన్‌ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించినవారిని పరామర్శించి ఆర్థిక సాయం చేయడానికి ఓదార్పు యాత్ర నిర్వహించారు. అది ఏపీలో పెద్ద సంచలనం అయింది. తద్వారా ప్రజలలో విశేష గుర్తింపు పొందారు. అలా చేయడం కరెక్టా? కాదా? అంటే ఎవరికి వారు ఆలోచించుకోవాలి. కొందరు విమర్శించారు. మరికొందరు సమర్థించారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అలాగే ప్రజలలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక తేడా ఉంది. అప్పట్లో జగన్‌ ఓదార్పు యాత్రలో రాజకీయ ప్రకటనలు, ఉపన్యాసాలు చేసేవారు కారు. తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారు కారు. 

కాని ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కేవలం వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడానికే టూర్‌ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన తెలిసో, తెలియకో కొన్ని వాస్తవాలు కూడా చెబుతున్నారు. 2019లో యువత తనను చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చేదని, కాని ఓట్లు మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వేశారని అన్నారు. మరి ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోందా? లేదా అన్నది ఆయన బెరీజు వేసుకోవాలి. జగన్‌ పాలన ప్రభావం ఎంత లేకపోతే, ఒక జిల్లాలో ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో జై జగన్‌ అన్న నినాదాలు చేయడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం జరుగుతుంది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్‌ కళ్యాణ్‌ 2019 అనుభవం గుర్తుచేసుకుని ఉండవచ్చు. జగన్‌ తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ స్కీములను అమలు చేశారు. దాని వల్ల పేద ప్రజలు లాభపడ్డారు. వారు ఊహించనంత స్థాయిలో ఆర్థిక ప్రయోజనం పొందారు. దాని వల్ల 2024లో కూడా వైసీపీ గెలుపొందుతుందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దానిని ఎంతో కొంత మార్చే లక్ష్యంతో పవన్‌ ఈ టూర్లు చేస్తున్నారు. కాకపోతే ఆయన తన సొంత ఆలోచనలతో కాకుండా తెలుగుదేశం కళ్లద్దాల నుంచి చూస్తూ ప్రసంగాలు చేయడం వల్ల ప్రజలలో పలచన అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలనే ఈయన పునరావృతం చేస్తున్నారు. ఉదాహరణకు విజయవాడలో జరిగిన అత్యాచార ఘటనపై చంద్రబాబు మాదిరే మాట్లాడారు. 

ఇలా ఒక్కటి కాదు. అన్ని అంతే. జగన్‌ గతంలో ఏ జైలులో ఉన్నారో తెలియక తప్పు చెబితే నరసాపురం ఎంపీ సరిచేశారట. తద్వారా ఎవరు, ఎవరితో సంబంధాలు పెట్టుకున్నది చెప్పకనే చెప్పేశారు. తాను ఎవరికి దత్తపుత్రుడిని కానని చెబుతూనే, తనను దత్తపుత్రుడిగా ఎవరూ భరించలేరని అంటున్నారు. దాని అర్ధం ఏమిటో ఆయనే విడమరచి చెప్పగలగాలి. ప్రజలు ఎన్నుకుంటే సీఎంను అవుతానని మరో సందర్భంలో అన్నారు. లేకుంటే ఇలాగే ఉంటానని కర్మ సిద్ధాంతం చెప్పారు. ఒక వైపు సీఎం కావాలన్న ఆశ, మరో వైపు కాలేమోనన్న నిరాశ ఆయనను వేదాంతం వైపు నడిపిస్తున్నట్లుగా ఉంది. 

అంతేకాక రానున్న రోజులలో బీజేపీని వదలి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి షరతుగా తనను సీఎంను చేయాలన్న ఆలోచనను ఆయన వ్యక్తం చేసి ఉండవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ ఒంటరిగా పోటీచేసే పరిస్థితిలో లేరన్నది వాస్తవం. అలాగే తెలుగుదేశం పార్టీ ఎలాగొలా పవన్‌కు ప్రజలలో సినీమా గ్లామర్‌ను వాడుకోవాలన్న తాపత్రయంతో ఉంది. ఈ పరిస్థితిలోనే పవన్‌ తెలుగుదేశం ట్రాప్‌లో పడి వారు చెప్పినట్లుగానే టూర్‌లు చేస్తున్నారని, జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇక ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన దానిని కొనసాగిస్తామని గట్టిగా చెప్పలేకపోతోంది. బీజేపీ వారు పవన్‌పై ఆశలు పెట్టుకుంటే, పవన్‌ కళ్యాణ్‌ తెలుగుదేశం వారి మీద ఆశలు పెంచుకుంటున్నారు. 

బహుశా దానికి ఒకటే కారణం కావచ్చు. అధికారం రావడం సంగతి ఎలా ఉన్నా, తాను అయినా వచ్చే ఎన్నికలలో గెలవకపోతే పరిస్థితి మరీ అసహ్యంగా ఉంటుందన్నది ఆయన భావన కావచ్చు. ఆ తర్వాత పార్టీ ఈ మాత్రం నిలబడడం కూడా కష్టం కావచ్చు. కొన్ని చోట్ల తెలుగుదేశం, జనసేన ఓట్లు కలిస్తే విజయావకాశాలు ఉంటాయని ఆ పార్టీల భావన. ఆచరణలో అలా జరుగుతుందా? లేదా అన్నది వేరే విషయం. కాని ఏదో ఒక ఆశతో రాజకీయాలు సాగుతుంటాయి. తను వెళ్లినప్పుడు జనం రావడం వేరు. ఓట్లు వేయడం వేరు అన్న సంగతి ఇప్పటికే పవన్‌కు అర్థం అయింది. ఆ విషయంలో 2019కి, 2024కి తేడా రావాలంటే ఏమి చేయాలో ఆయనకే తెలియదు. అందువల్ల ఆయన ప్రసంగాలు ఎప్పుడూ గందరగోళంగానే సాగుతుంటాయి. ఆయన 2019లో భీమవరం, గాజువాకలలో పోటీ చేసి ఓడిపోయారు. తదుపరి మూడేళ్లలో ఎన్నడూ ఆ నియోజకవర్గాల వైపు పవన్‌ చూడలేదట. 

గెలిచినా, ఓడినా సేవ చేస్తానని కర్మ సిద్దాంతం చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌ తనకు ఓట్లేసిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలవైపు కన్నెత్తి చూడలేదంటేనే ఆయనకు ఉన్న రాజకీయ చిత్తశుద్ధి, అపరిపక్వత తెలియచేస్తుంది. అందువల్లే జనం ఆయనను నమ్మడం లేదు. కాని జగన్‌ అలా చేయలేదు. 2014లో వైసీపీ ఓడిపోయినా, జగన్‌ జనాన్ని వదలిపెట్టలేదు. ఆయా అంశాలపై పర్యటనలు చేయడం, పాదయాత్రల ద్వారా ప్రజలలో మమేకం అవడం, తన హామీలను ప్రజలకు తెలియచెప్పడం వంటివి చేశారు. మరి పవన్‌ కళ్యాణ్‌ అలా చేయగలరా? ఇప్పటికైతే సినిమా షూటింగ్‌ల మధ్య గ్యాప్‌లోనే పర్యటనలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. 

పవన్‌ పూర్తి కాలపు, సీరియస్‌ రాజకీయ నేతగా మారతారా? లేదా అన్నది కూడా చర్చనీయాంశమే. ఆయన ఒంటరిగా తన పార్టీని ఎన్నికలలో పోటీకి నిలబెట్టకలిగే విధంగా తయారు చేయగలరా? వీటి గురించి ఆలోచించుకుంటే జగన్‌కు ప్రజలు ఎందుకు జై కొడుతున్నారో పవన్‌ అర్థం చేసుకోగలుగుతారు. కాని ఆయన మానసికంగా అందుకు సిద్ధంగా లేరేమో!