అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది రాజకీయాల్లో అడక్కుండానే, ఏ ప్రయోజనాలు ఆశించకుండానే పదవులు ఇస్తారా? ఎప్పటికీ జరగని పని. పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికపై రాజకీయాలు నడుస్తుంటాయి. అదానీ అడగకుండానే, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ సీటు ఇస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తింది. అదానీ గ్రూప్ ప్రకటనతో ఈ చర్చకు తెరలేచింది.
త్వరలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నలుగురు ఎవరనే విషయమై రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో అదానీ కుటుంబ సభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఒక సీటు గౌతమ్ అదానీ లేదా ప్రీతి అదానీకి కట్టబెట్టొచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. గతంలో అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన పరిమళ్ నత్వానీని జగన్ రాజ్యసభకు నామినేట్ చేయడంతో, ప్రస్తుతం అదానీపై సాగుతున్న ప్రచారానికి బలం చేకూర్చింది.
తమ కుటుంబానికి రాజ్యసభ సీటు విషయమై సాగుతున్న ప్రచారంపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. గౌతమ్ అదానీ, ప్రీతి అదానీతో పాటు ఇతర అదానీ కుటుంబ సభ్యులెవరూ రాజ్యసభ స్థానాన్ని ఆశించడం లేదనేది ప్రకటన సారాంశం.
అదానీ సంస్థ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ రేసులో లేమని ఆ ప్రకటన ద్వారా తేల్చి చెప్పడం గమనార్హం. అదానీకి రాజ్యసభ సభ్యత్వం అవసరం లేకున్నా, పాలకులకు వారి అవసరం రీత్యా నామినేట్ చేసే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనను కొట్టి పారేయలేం.