సినిమా రివ్యూ: ఆఫీసర్‌

రివ్యూ: ఆఫీసర్‌ రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: ఏ కంపెనీ ప్రోడక్ట్‌ తారాగణం: నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, బేబీ కావ్య, సయాజీ షిండే, అజయ్‌ తదితరులు కూర్పు: అన్వర్‌ అలి, ఆర్‌. కమల్‌ సంగీతం: రవిశంకర్‌ ఛాయాగ్రహణం: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌…

రివ్యూ: ఆఫీసర్‌
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: ఏ కంపెనీ ప్రోడక్ట్‌
తారాగణం: నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, బేబీ కావ్య, సయాజీ షిండే, అజయ్‌ తదితరులు
కూర్పు: అన్వర్‌ అలి, ఆర్‌. కమల్‌
సంగీతం: రవిశంకర్‌
ఛాయాగ్రహణం: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెన్మత్స
నిర్మాతలు: రామ్‌ గోపాల్‌ వర్మ, సుధీర్‌ చంద్ర పదిరి
రచన, దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
విడుదల తేదీ: జూన్‌ 1, 2018

ఆఫీసర్‌ ఫస్ట్‌ సీన్‌లో… ఒక ముగ్గురిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి విలన్‌ ముందు పడేస్తారు. వాళ్ల ముగ్గురి కాళ్లపై యాసిడ్‌ పోసి, చిత్రవధ చేస్తారు. 'నేను మిమ్మల్ని మామూలుగా చంపను. టార్చర్‌ పెట్టి చంపుతాను' అంటాడు విలన్‌. ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ముందుకెళ్లిన 'ఆఫీసర్‌'… నాగార్జున వున్నాడు కనుక ఈసారి వర్మ సినిమా బెటర్‌గా వుంటుందేమో అనే ఆశలకి పాతర వేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోదు.

ఈమధ్య వస్తోన్న వర్మ సినిమాలకీ, ఆఫీసర్‌కి తేడా ఒకటే… నాగార్జున ఒకడే! వర్మ సినిమాలో స్టార్‌ని చూసి చాలా కాలమవుతోంది. శివ, అంతం లాంటి సినిమాలు అందించిన జోడీ కావడంతో ఆఫీసర్‌పై మరీ ఆ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకపోయినా కనీస స్థాయిలో అయినా అలరిస్తుందనే అంచనాలుంటాయి. టీజర్‌, ట్రెయిలర్‌, సౌండ్‌ బైట్స్‌తో ఆ అంచనాలని పూర్తిగా దించేయడానికి శాయశక్తులా కృషి చేసారనుకోండి. అది వేరే సంగతి.

కెమెరాని బూట్ల దగ్గర, కార్ల కింద లేదా రూమ్‌ అంతా కలియతిప్పుతూ అదో రకం వెరైటీ విజువల్స్‌ని చూపించడం వర్మ సినిమాల్లో రివాజుగా మారింది. నాగార్జున లాంటి స్టార్‌ వున్నా కానీ కెమెరా యాంగిల్స్‌ పరంగా ఏ మార్పు లేదు. ఒక ఫైట్‌లో నాగార్జున మణికట్టుకి కెమెరా కట్టేసినట్టున్నారు. అతను పిడిగుద్దులు గుద్దుతుంటే వచ్చే ఎఫెక్టుకి జనం ఘొల్లున నవ్వారు.

ఎక్స్‌పెక్ట్‌ చేసిన ఎఫెక్ట్‌ కాకపోయినప్పటికీ ఏదో ఒక రియాక్షన్‌ అయితే వచ్చిందనుకుని సంతోషపడొచ్చు. ఈ కెమెరా యాంగిల్స్‌లోని 'క్రియేటివిటీ' ఏ స్థాయిలో వుందంటే, స్క్రీన్‌ వైపు నుంచి చూపు తిప్పితే ఒక విచిత్రం మిస్‌ అయిపోవచ్చుననే రేంజిలో ప్రయోగాలు చేస్తూనే వున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. అవి బాగున్నాయని అప్రీషియేట్‌ చేయడం కాదు, కెమెరాని అక్కడ పెట్టాలనే ఆ ఆలోచనలకి నవ్వుకోవాలన్నమాట.

కథలోకి వెళితే… పోలీస్‌ వ్యవస్థలో వున్న బ్యాడ్‌ పోలీస్‌ చేసే దురాగతాలని బయట పెట్టడానికి వస్తాడో ఆఫీసర్‌. ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది. ఆ చెడ్డ పోలీస్‌ని మంచి పోలీస్‌ ఎలా అడ్డుకున్నాడు అనేది పాయింట్‌. వినడానికి మామూలుగానే వున్నా సరిగ్గా తీస్తే 'డిపార్టెడ్‌' లాంటి పకడ్బందీ థ్రిల్లర్‌ తీసే అవకాశముంది. కానీ సినిమా తీయాలంటే ఏదో ఒక లైన్‌ అంటూ వుండాలిగా అని ఏదో రాసుకున్నట్టే వుంటుంది తప్ప ఈ లైన్‌తో ఒక ఎంగేజింగ్‌ సినిమా తీద్దామనే ధోరణి కనిపించదు.

ఏవేవో పాత్రలు, ఒక దానితో ఒక దానికి పొంతన లేని సన్నివేశాలు, ఏమాత్రం సెన్స్‌ వున్నట్టు అనిపించని సంభాషణలు, మధ్య మధ్యలో తుపాకులు, చెవులు దద్ధరిల్లేలా సౌండ్‌ ఎఫెక్టులు… ఇలా నడిచిపోతున్న సినిమాలో కొన్ని ముఖ్య ఘట్టాలు కూడా ఎలాంటి ఇంపాక్ట్‌ లేకుండా జరిగిపోతుంటాయి. గుడ్‌ వర్సెస్‌ బ్యాడ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ ఎస్టాబ్లిష్‌ చేయగలిగితే ఆ సంఘర్షణే ఇలాంటి కథలని ముందుకు తీసుకెళ్లిపోతుంది. కానీ ఎక్కడా పాత్రల మీద ఫోకస్‌ వున్నట్టు కానీ, ఆకట్టుకునేలా సన్నివేశం తీర్చిదిద్దాలని తపన పడ్డట్టు కానీ కనిపించదు.

మామూలుగా తన కథలని మానవీయ సంబంధాలకి కాస్త దూరంగా వుంచే వర్మ అవసరం లేదనుకుంటే అసలు అలాంటి ఎలిమెంట్స్‌ని టోటల్‌గా ఎలిమినేట్‌ చేసేస్తుంటాడు. కానీ ఇందులో అవసరం లేని తండ్రీ కూతుళ్ల సబ్‌ ప్లాట్‌ ఒకటి వుంది. ఈ సీన్ల వల్ల నిడివి పెరగడం మినహా సినిమాకి హెల్ప్‌ అయిందేమీ లేదు. పైగా ఆ అనుబంధానికి సంబంధించిన సన్నివేశాల్లో ఏమి చేస్తే ఎమోషన్‌ పండుతుందనే దానిపై వర్మకి క్లూ వున్నట్టు అనిపించదు.

ఉదాహరణకి… అంతకుముందే కూతురితో ఫోన్‌లో మాట్లాడిన నాగార్జున దగ్గరకి నెక్స్‌ట్‌ సీన్లో కూతురు పరుగెత్తుకుంటూ రాగానే, చేతిలోని కాఫీ కప్పుని నేల మీదకి విసిరేసి మరీ ఎత్తుకుంటాడు. తండ్రీ కూతుళ్ల సీన్స్‌లోని ఆర్టిఫిషియాలిటీ ఏ లెవల్లో వుందనేది అర్థం చేసుకోండిక.

ఇక కథాపరంగా జరిగే కొన్ని అంశాలయితే 'బొంబాయ్‌లో అంతే, బొంబాయ్‌లో అంతే' అనుకునేలా వున్నాయి. అసలు ఆ పోలీస్‌ అధికారి మాఫియాని ఏరి పారేసి తానే మాఫియా నడపడం ఏమిటో, అతడిని విచారించడానికి వచ్చిన 'సిట్‌' ఆఫీసర్‌ అతడి ముందు నిలబడి అతనిచ్చే ఆదేశాలని తీసుకోవడం ఏమిటో వర్మకే తెలియాలి. అంతవరకు స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ అనిపించుకున్న సదరు సిట్‌ ఆఫీసర్‌ గురించి విలన్‌ బ్యాడ్‌గా చెప్పేసేసరికి అతనే టార్గెట్‌గా మారిపోయి పోలీసుల నుంచి పారిపోతూ వుంటాడట.

అసంబద్ధంగా సాగిపోతున్నా కానీ ఈ సినిమాకి వున్న బెనిఫిట్‌ ఏమిటంటే… తెరపై ఏమి జరుగుతున్నా చూసే వాళ్లకి ఏమీ పట్టదు. 'ఏదో ఒకటిలే కానివ్వండి. ఆ రోలింగ్‌ టైటిల్స్‌ ఏదో వేసేస్తే వచ్చిన దారినే పోతాం' అనే నిర్లిప్త ధోరణి ఎప్పుడో సినిమా మొదలైన కాసేపటికే వచ్చి చేరిపోతుంది కనుక వర్మ ఏం చూపించినా చెల్లిపోయింది.

కొంచెం ఆలోచన పెట్టినా కానీ సెన్సిబుల్‌ సన్నివేశాలకి అవకాశముంటుంది. కానీ అసలు ఆలోచన అనేది ఎందుకన్నట్టు తుపాకులు చేతికిచ్చి రోడ్ల మీద పరుగెడుతూ పొండి అన్నట్టుగా సెకండ్‌ హాఫ్‌ తయారైంది. లాస్ట్‌ ఫైట్‌లో ఎత్తయిన భవనం మీదనుంచి పడిపోబోతూ రాడ్లు పట్టుకుని వేలాడుతుంటాడు విలన్‌. దగ్గరగా వచ్చిన హీరోతో 'ఒకేసారి చంపేయకుండా ఎందుకిలా టార్చర్‌ చేస్తున్నావ్‌?' అని అంటాడు.

ఆ రాడ్డు వదిలేస్తే పోయేదానికి టార్చర్‌ అనుభవించడం దేనికో? ఒకప్పుడు అటెన్షన్‌ టు డీటెయిల్‌, క్యారెక్టర్‌ ఆర్క్‌, టెక్నికల్‌గా అత్యుత్తమ స్టాండర్డ్స్‌లాంటి వాటికి వర్మ సినిమాలు కొలమానంగా నిలిచేవి. ఫ్లాప్‌ అయిన వర్మ సినిమాలు కూడా చాలా సినిమాల కంటే ఉత్తమంగా అనిపించేవి. అలాంటి వర్మ నుంచి కనీసపు నిర్మాణ విలువలు లేని ఇలాంటి చిత్రాలు రావడం దురదృష్టకరం. సాంకేతికంగా స్టాండర్డ్‌ సెట్‌ చేసిన వర్మ ఇప్పుడు షార్ట్‌ ఫిలిం మేకర్స్‌ కంటే తక్కువ స్టాండర్డ్స్‌తో సినిమాలు తీస్తుండడం బాధాకరం.

పోలీస్‌ పాత్రలో ఫిట్‌గా పడడం కోసం నాగార్జున పెట్టిన ఎఫర్ట్స్‌ మెప్పిస్తాయి. అయితే ఎంత ఫిట్‌గా వున్నా ఇలాంటి కథని మోయడం ఎవరి తరం కాదనుకోండి. బేబి కావ్య నటన బాగుంది. విలన్‌గా నటించిన బాలీవుడ్‌ నటుడిలో వర్మ విలన్స్‌లో వుండే ప్రత్యేకత కొరవడింది. మైరా సరీన్‌కి నటన శూన్యం. నాగార్జునతో కెమిస్ట్రీ కూడా కుదర్లేదు. వర్మ ఇటీవల తీస్తోన్న సినిమాల కంటే ఇది మెరుగ్గా అనిపించిందంటే దానికి ఫుల్‌ క్రెడిట్‌ నాగార్జునకే. అయినా ఐస్‌క్రీములతో పోలిస్తే ఏవైనా బెటర్‌గానే వుంటాయంటారా, ఓకే!

బాటమ్‌ లైన్‌: అగమ్యగోచరం!
– గణేష్‌ రావూరి