సరిగ్గా 2రోజుల కిందట కింభో యాప్ ను ఘనంగా ప్రకటించింది పతంజలి సంస్థ. పతంజలి పేరిట సిమ్ కార్డులు ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే ఈ మెసేజింగ్ యాప్ ను కూడా సోషల్ మీడియా వేదికలపైకి తీసుకొచ్చింది. భారత్ లో బాగా పాపులర్ అయిన వాట్సాప్ కు ఇది గట్టిపోటీనిస్తుందని ఘనంగా చెప్పుకుంది. కానీ ఇది పెట్టుకుంటే ప్రైవసీ మొత్తం గంగలో కలిసిపోతుందని అంటున్నారు నిపుణులు.
కింభో మేసేజింగ్ యాప్ లో భద్రతా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. గతంలో వచ్చిన బోలో మేసేజింగ్ యాప్ ను కాపీ కొట్టి దీన్ని తయారుచేశారని.. ఇది డౌన్ లోడ్ చేసుకుంటే వినియోగదారుడి సమస్త సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుందని అంటున్నారు.
ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ ఎలియాట్ అండర్సన్ మరో అడుగు ముందుకేశాడు. కింభో యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న ఏ వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్నయినా తను క్షణాల్లో తెలుసుకుంటానని ప్రకటించాడు. అంత లోపభూయిష్టంగా ఉన్న కింభోను డౌన్ లోడ్ చేసుకోకుండా ఉండడమే ఉత్తమం అంటున్నాడు. ఇది డౌన్ లోడ్ చేసుకుంటే పాస్ వర్డులు, పిన్ నంబర్లు, క్రెడిట్ నంబర్లు లాంటి సమస్త సమాచారం థర్డ్ పార్టీకి చేరిపోతుందని అంటున్నాడు.
మరోవైపు పతంజలి మాత్రం ఈ వాదనల్ని ఖండిస్తోంది. ఎప్పటికప్పుడు కింభో యాప్ లో అప్ డేట్స్ వస్తుంటాయని, అవి అప్ డేట్ చేసుకుంటే భద్రత మరింత పెరుగుతుందని అంటోంది. ఈ యాప్ తో భారత్ లో వాట్సాప్ వాడుతున్న యూజర్లంతా కింభోకు షిఫ్ట్ అవుతారని అంటోంది.