ఒక్కోసారి అంతే ఏదో చేయబోతే మరేదో అవుతుంది. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను టార్గెట్ చేసారు నారా లోకేష్. తన తండ్రి, తన పార్టీ జనాల పరువును వెండితెర మీద ఆరేస్తాడు అని భయపడి వుంటారు.
ఇలాంటి టైమ్ లో అలాంటి సినిమా జనాల్లోకి వెళ్లడం ప్రమాదకరం అనుకుని వుంటారు. అందుకే ఓ లెెటర్ రాసి ఆ సినిమా సెన్సారు కాకుండా ఆపారు. కానీ ఇక్కడ జనాలకు చాలా మందికి తెలియని సంగతి ఏమిటంటే, అది వైకాపా నెత్తిన పాలు పోసినట్లే అని.
అందరికీ కనిపించే కలర్ వేరు. అసలు సంగతి వేరు. ఆర్జీవీ వ్యూహం సినిమాను జగన్ అనుమతితో తీస్తున్నారు. జగన్ అన్నీ చూసారు. అంతా తెలుసుకున్నారు. ఓకె అన్నారు. అన్నది బయటకు కనిపించే కలర్.
కానీ ఆర్జీవీ తెలివిగా కొందరు వైకాపా నాయకులను పట్టుకోగలిగారు. సినిమా తీసే వ్యూహం అమలు చేసారు. కానీ ఇది జగన్ అస్సలు ఇష్టం లేదు. కానీ అలా అంటే ఆర్జీవీ ఆగుతారా? ఆగరు? పైగా వద్దు అంటే మరింత నెగిటివ్ చేసే రకం. అందులో మీ ఇష్టం కానివ్వండి అన్నారు.
టీజర్ వచ్చినపుడే వైకాపా జనాలు లోలోపల కిందా మీదా అయ్యారు. భారతి పాత్రను అంత ఎలివేట్ చేసి, బయటకు తేవడం అన్నది జగన్ కు ఇష్టం లేదు. పార్టీ జనాలకు ఇష్టం లేదు. భారతి పాత్ర టీజర్ లోనే ఇలా వుంటే సినిమాలో ఇంకెలా తీసివుంటారో? ఆర్జీవీ సినిమా అంటే అది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. ఎవరి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల వ్యూహం సినిమా విడుదల అన్నది వైకాపాకు టెన్షన్ నే.
ఇలాంటి టైమ్ లో ఓ లెటర్ అడ్డం పెట్టి లోకేష్ సినిమాను ఆపారు. హమ్మయ్య అనుకున్నది తెలుగుదేశం జనాలు కాదు. వైకాపా జనాలు, జగన్ అండ్ కో. అదీ ట్విస్ట్.