కరుసైపోతున్న ఎన్నారై ప్రొడ్యూసర్లు

ఎన్నారైలను చూస్తుంటే జాలేస్తోంది. కష్టపడి అమెరికాల్లో, హాంగ్ కాంగ్ ల్లో పని చేసి, డాలర్లు సంపాదించి, సినిమాల మీద మోజుతో ఇక్కడకు వచ్చి, రాంగ్ ట్రాక్ లో పడి, కోట్లు జల్లేసి, గుల్లయిపోతున్నారు. విదేశాల…

ఎన్నారైలను చూస్తుంటే జాలేస్తోంది. కష్టపడి అమెరికాల్లో, హాంగ్ కాంగ్ ల్లో పని చేసి, డాలర్లు సంపాదించి, సినిమాల మీద మోజుతో ఇక్కడకు వచ్చి, రాంగ్ ట్రాక్ లో పడి, కోట్లు జల్లేసి, గుల్లయిపోతున్నారు. విదేశాల నుంచి వచ్చి, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇక్కడి వ్యవహారాలు తెలియక, ఎవర్నిపడితే వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని, కోట్లకు కోట్లు నష్టపోతున్నారు.

మైత్రీ మూవీస్ మినహా మరే ఎన్నారైలు టాలీవుడ్ లో డబ్బులు సంపాదించిన దాఖలాలు కనిపించడం లేదు. పివిపి విదేశాల్లో వందల కోట్లు ఆర్జించారు. ఇక్కడికి వచ్చి దాదాపు వంద కోట్లు పోగోట్టుకున్నారు. ఇక సినిమాల మీద విసుగు వచ్చి, సైలంట్ అయ్యారు. విదేశాల నుంచి వచ్చిన రామ్ తాళూరి ఆది సాయికుమార్ లాంటి హీరోను, వీరభద్రమ్ చౌదరి లాంటి డైరక్టర్ ను పట్టుకుని, చుట్టాలబ్బాయి తీసారు. ఆ తరువాత రవితేజ-కళ్యాణ్ కృష్ణను నమ్ముకుని, ఇప్పుడు ఓ ఇరవై కోట్లు అర్పించేసుకున్నారు.

హాంగ్ కాంగ్ తదితర దేశాల్లో మంచి వ్యాపారాలు చేసి, సంపాదించి, కొత్త దర్శకుడు సుందర్ ను, హీరో నాగశౌర్యను పట్టుకుని అమ్మమ్మగారిల్లు సినిమా తీసి దిగాలు పడ్డారు ఆ సినిమా నిర్మాతలు.

పవన్-త్రివిక్రమ్ క్రేజ్ చూసి అజ్ఞాతవాసి సినిమాను అమెరికాలో భయంకరమైన రేటుకు కొని మొత్తం లాసైపోయారు. కనీసం అదే సంస్థ నిర్మించే ఎన్టీఆర్ సినిమా రైట్స్ కూడా వాళ్లకు దక్కలేదు. ఇప్పడు తెలిసి వచ్చి వుంటుంది టాలీవుడ్ అంటే ఎంత కమర్షియల్ గా వుంటుందో? ఇక్కడ జాలి, దయ లాంటివి వుండవని అర్థం అయివుంటుంది.

ఇక్కడి మార్కెట్ ఏమిటి? అసలు దర్శకుడి స్టామినా ఏమిటి? హీరో రేంజ్ ఎంత? ఎంత పెడితే, ఎంత వస్తుంది? ఎంతలో తీయాలి? అసలు తీసిన తరువాత మార్కెటింగ్ ఎలా? ఇవేవీ తెలియకుండానే రంగంలోకి దిగిపోతున్నారు. హీరో మార్కెట్ చూసుకోకుండా కోట్లకు కోట్లు ఖర్చు చేసి కరుసైపోతున్నారు.

వీళ్లే కాదు, ఇంకా చాలా మంది చిన్న సినిమాలు తీసి, కట్టలు సమర్పించుకుని, కన్నీళ్లతో టాలీవుడ్ కు బై బై చెప్పినవారే ఎక్కువ మంది వున్నారు. ఓవర్ సీస్ లో చిన్న చిన్న సినిమాలు కొని గుల్లయిపోయిన వారే ఎక్కువ.

దీనంతటికీ రెండు కారణాలు. సినిమా రంగంపై మోజు. అదే సమయంలో ఆ రంగం ఆనుపానులు తెలియని తనం. అన్నింటికి మించి ఇలాంటివాళ్లను పట్టుకుని, బుట్టలో వేసి, డబ్బు చేసుకునే బాపతు జనాల మాటలు నమ్మడం. ఒకడు పోతే మరొకడు వస్తూనే వుంటారు. కోట్లు సమర్పించుకుంటేనే వుంటారు.