రివ్యూ: నేల టిక్కెట్టు
రేటింగ్: 1.5/5
బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: రవితేజ, జగపతిబాబు, మాళవిక శర్మ, అలీ, సుబ్బరాజు, సంపత్ రాజ్, శరత్ బాబు, బ్రహ్మానందం, పృధ్వీ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, శివాజీరాజా, సురేఖవాణి, జ్యోతి తదితరులు
కథనం: సత్యానంద్
కూర్పు: చోటా కె. ప్రసాద్
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
ఛాయాగ్రహణం: ముఖేష్ జి.
నిర్మాత: రజని తాళ్ళూరి
కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల
విడుదల తేదీ: మే 25, 2018
''చుట్టూ జనం… మధ్యలో మనం. లైఫ్ అంటే అదిరా'' అంటాడు 'నేల టికెట్' హీరో. నిజంగానే చుట్టూ జనం వుంటే సందడిగానే వుంటుంది కానీ… అంత మంది చుట్టూ వున్నా ఎదురుగా 'నేల టిక్కెట్టు' లాంటి సినిమా ప్లే అవుతుంటే మాత్రం ''ఇదేమి లైఫ్‌రా బాబూ'' అనిపించక మానదు. 'నేల టికెట్ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు' అంటూ సటిల్ మెసేజ్ ఒకటి మనకి పాస్ చేసినా కానీ అదంతా ఎలివేషన్‌లో భాగమని టికెట్ కొనేస్తే, ఆ డైలాగ్‌లోని అంతరార్ధం తెలిసిరావడానికి ఎక్కువ సమయం తీసుకోదు.
'నేల టికెట్' రూపాయి ధర పలికిన రోజుల్లో ఇలాంటి కథలు చాలానే వచ్చేవి. అప్పట్లో సినిమా అంటే లవ్వు-నవ్వు, ఫైటు-మెసేజు లాంటివన్నీ వుండాలనే పడికట్టు రూలుండేది. అన్ని సినిమాలూ అలాగే వుండే సరికి ఫైట్లూ, నవ్వులూ బాగున్న సినిమాలకి టికెట్లు బాగా తెగేవి. కానీ కాలం చెల్లిపోయిన ఈ కథలు ఇప్పుడు ఎక్కువగా రావడం లేదు. వచ్చినా కొత్తదనం కోరుకుంటోన్న ఈతరం ప్రేక్షకుల నుంచి థంబ్సప్‌లు రావు. కళ్యాణ్‌కృష్ణ అసలు ఏమనుకుని ఇలాంటి పాత చింతకాయ కథ రెడీ చేసాడో, రవితేజ ఇందులో ఏముందని ఓకే చేసాడో కానీ మొదలైన దగ్గర్నుంచి ముగింపు కోసం ఎదురు చూసేలా చేస్తుంది నేల టిక్కెట్టు.
కథ ఎలాగున్నా కథనంతో కాలక్షేపం అయిపోయేలా చేయవచ్చు. కానీ కథనం రాయడానికి కూడా సత్యానంద్ లాంటి వెటరన్‌ని ఎంచుకోవడంతో ఆయన ఈ కథకి ఎయిటీస్ మార్కు స్క్రీన్‌ప్లేనే రాసిచ్చేసారు. కనీసం సన్నివేశాలయినా రక్తి కడితే పాస్ మార్కులు వేయవచ్చు. కానీ ఇందులోని సన్నివేశాలు చూస్తుంటే ఈ చిత్రంలోని కథానాయకుడి మాదిరిగా పక్క సీటు వారితో రిలేషన్ కలుపుకుని మరీ బాధ పంచుకోవాలి అనిపించ మానదు.
ఉదాహరణకో సన్నివేశం… రోడ్డుపై ఓ పెద్ద గుంపుని చూసి హీరో ఆగి చూస్తాడు. మధ్యలో ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోతే చుట్టూ జనం గుమికూడి చూస్తున్నారని తెలుసుకుంటాడు. ఆయనని ఏమిటిలా ఇని అడిగితే 'మా వీధిలో యాపిల్ ఒకటీ ముప్పయ్ చెబుతున్నారు. ఇక్కడయితే ముప్పయ్‌కి రెండు యాపిల్స్ వస్తాయని ఇటొచ్చాను' అని చెప్తాడు. 'ఇంత ఎండలో మీరెందుకిలా, పిల్లలు లేరా?' అంటే 'ఎందుకు లేరు' అంటాడు. వెంటనే మన హీరో ఆయనతో పాటు వాళ్ల ఇంటికి వెళ్లి 'మీ నాన్నని కోటి రూపాయలకి కొనేసుకుంటాను' అంటాడు. వాళ్లేమో 'మా అమ్మని కూడా తీసుకుపోయి మరో కోటి ఇవ్వు' అంటారు.
ఇంతలో మరొకడు వచ్చి నాలుగు కోట్లకి ఇద్దరినీ తీసుకుపోతానంటాడు. వీళ్లకి ఇంత గిరాకీ ఏమిటని ఆ పిల్లలకి అర్ధం కాకపోతే 'మీ తాతగారి స్థలమొకటి యాభై కోట్లు పలుకుతోంది. అది మీ నాన్నకి వస్తుంది. అందుకే ఈ డిమాండ్. ఎవరైతే వాళ్లని బాగా చూసుకుంటారో వారికే ఆస్తి చెందుతుంది. అందుకోసం కోర్టు సిఐడిని కూడా నియమించింది' అని చెబితే వెంటనే వాళ్లు తల్లిదండ్రులని బాగా చూసుకోవడం మొదలెడతారు.
'వ్వాట్?' అనిపిస్తోందా? 'వావ్!' అని ఫీలయినట్టున్నారు రచయితలు. కించిత్ మొహమాటం లేకుండా ఈ సీన్‌ని ఇలాగే తెరకెక్కించేసారు. తెరపై చూసుకున్నాక కూడా దానిని యథాతథంగా వుంచేసి ప్రేక్షకులకీ ఆ 'రసానుభూతి' పంచారు. ఇలాంటి 'సిత్రాలు' సినిమా అంతటా కనిపిస్తూనే వుంటాయి. కామెడీ కోసం పెట్టిన కామెడీ నవ్వించకపోయినా, ఇలాంటి అసంబద్ధమైన సన్నివేశాల్లో అమాయకత్వాన్ని చూసి నవ్వుకునే వీలుంటుంది.
హోమ్ మినిస్టర్ వర్సెస్ అనామకుడు (లిటరల్‌గా. హీరో పేరే నేల టికెట్!) మధ్య పోటీ తలెత్తితే నిజ జీవితంలో అయితే ఆ అనామకుడు గల్లంతయిపోయినా ఎక్కడా వార్త కూడా వుండదు. కానీ ఇది సినిమా కనుక సదరు నేల టికెట్ నచ్చినపుడల్లా హోమ్ మినిస్టర్ ముందుకెళ్లిపోయి వార్నింగ్‌లు ఇచ్చేసి వచ్చేస్తుంటాడు. హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గర బందోబస్తు బలంగా వుంటుంది కదా అని అనిపించినట్టయితే ఈ సినిమా చూసే అర్హత మీకు లేదు.
అయితే ఇక్కడ హోమ్ మినిస్టర్ ఎంత తింగరి మేళం అనేది ఫస్ట్ సీన్‌లోనే చూపించేస్తారు. డే లైట్‌లో హత్య చేసి, ఆ అఛీవ్‌మెంట్ గురించి మాట్లాడుకోవడానికి చీకటి పడే వరకు గానీ, కనీసం ఇంటికి వెళ్లే వరకు గానీ ఆగలేడు. చుట్టూ వందల మంది జనం వుండగానే దాని గురించి గొప్పగా తమ్ముడితో చెప్పేసుకుంటాడు. తన తమ్ముడిని కొట్టిన వాడిని పిలిపించినపుడు కూడా అతడిది అదే ధోరణి. గుట్టుచప్పుడు కాకుండా చేయాలనేది తన డిక్షనరీలోనే లేనట్టు వందల మంది ఆడియన్స్ ఎదురుగా అతనితో ముఖాముఖి పెట్టుకుంటాడు. పోలీస్ సెలక్షన్స్ తాలూకు స్కామ్ చేయడానికి తనే కుర్చీలో కూర్చుని మరీ అంతమంది సిబ్బంది ముందు తాపీగా బేరాలు పెడతాడు.
ఇలాంటి 'జీనియస్' మినిస్టర్ చేసిన మర్డర్‌ని చేధిస్తుంది ఓ బ్రిలియంట్ రిపోర్టర్. హోమ్ మినిస్టరే హత్య చేసినట్టు ఆమె కనుగొనే వీడియో ఫుటేజ్ తాలూకు సన్నివేశాన్ని చూస్తే కానీ దాంట్లోని బ్రిలియన్స్ అర్థం కాదు. బాంబ్ పేలగానే 'గుడ్‌షాట్ సర్' అన్నట్టు అక్కడే వుండి నవ్వుతూ అభినందిస్తాడు అజయ్. అతడి అభినందనకి మెచ్చుకోలుగా చిన్న రియాక్షన్ ఇస్తాడు జగపతిబాబు. ఈ రెండు షాట్స్‌ని బేరీజు వేసుకున్న రిపోర్టర్‌కి మినిస్టర్ వాచ్ రిమోట్ నొక్కిన విజువల్ కూడా దొరికేస్తుంది. విలన్ తాలూకు వ్యూహం కంటే అక్కడి కెమెరామెన్ పనితనం, అంతకుమించి ఆ విజువల్స్‌ని పేర్చుకుని ఆ రిపోర్టర్ ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చిన విధానం 'వారెవ్వా' అనిపిస్తుంది.
ఇక ఎవరైనా వరస పెట్టి పిలిస్తే చాలు వారికోసం ఏదైనా చేసేసే హీరోకి సంబంధించిన సదరు సెంటిమెంట్ సీన్లకయితే స్క్రీన్ కనబడనంతగా సీట్లో కిందకి జారిపోయి కూర్చోవాలనిపిస్తుంది. లవ్‌స్టోరీ కోసం 'శంకర్‌దాదా' తరహాలో ఏదో ట్రై చేసారు. ఆ సన్నివేశాలు, పృధ్వీతో వేసే మందు సిట్టింగ్‌లు, అన్నిటికీ మించి సుదీర్ఘంగా సాగే యాక్షన్ దృశ్యాలు టికెట్ కొని చేసిన మిస్టేక్‌కి అనుక్షణం రిగ్రెట్ అయ్యేట్టు చేస్తాయి.
గంటన్నర పాటు సాగే ప్రథమార్ధంలో ఎంత తరచి చూసినా ఏమీ వుండదు. ఎలాంటి కథ లేకుండా అంతసేపు సాగదీసి, పైగా దానిని మొత్తం ఫైనల్ కట్‌లో వుంచిన దర్శకుడి ఔదార్యానికి, ధైర్యానికి ఏమనాలో తోచదు. ఇంటర్వెల్ వరకు కథ చెప్పకుండా, ఇంటర్వెల్ సీన్లోనే మొత్తం వెనక, ముందు కథ అంతా చెప్పేసి 'మిషన్ స్టార్ట్స్ నౌ' అనడం మరో మెచ్చుతునక. ఏమాత్రం ఎక్సయిట్ చేయని ఇంటర్వెల్ బ్లాక్‌తో ఇక ఏమి మిషన్ వుంటుందని జనం అనుకుంటారని భావించారో, లేక ఏమి మిషన్ నడిపిద్దామనుకున్నారో వారికే ఎరుక.
ఎలాంటి సినిమాలో అయినా రవితేజ తన మార్కు వినోదంతో, ఉత్సాహంతో కాలక్షేపం ఇవ్వగలుగుతాడు. అలాంటిది ఈ సినిమాలో అతను సయితం చేయడానికి ఏమీ లేదు. రవితేజ పాత్ర చిత్రణపై, అతని బాడీ లాంగ్వేజ్‌కి అనుగుణంగా సన్నివేశాలు రాయడంపై దృష్టి పెట్టినా అంతో ఇంతో వినోదానికి ఆస్కారముండేది. రవితేజ లాంటివాడే తేలిపోయిన చోట ఇక మిగతా ఆర్టిస్టులు ఎవరు మాత్రం నిలబడతారు? హీరోయిన్ మరీ చిన్నపిల్లలా అనిపించడంతో రవితేజ సరసన ఆమె అస్సలు మ్యాచ్ కాలేదు. జగపతిబాబుకి 'ఫణీంద్ర భూపతి' ఎంత పేరు తెచ్చిందో ఈ 'ఆదిత్య భూపతి' అంత పాయింట్‌లెస్‌గా మిగిలిపోతుంది. సంపత్‌రాజ్, అలీ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ లాంటి హేమాహేమీలే వున్నా ఎవరినీ కనీసం గుర్తుంచుకునే ఛాన్సే ఇవ్వలేదు.
తెరపైనే ఇలాగుంటే తెరవెనుక నుంచి కూడా గొప్ప అవుట్‌పుట్ ఎవరినుంచీ లేదు. పాటలు 'బ్రేక్ తీసుకోండి' అని చెబుతున్నట్టున్నాయి. మాటలు 'ఈ కంటెంట్‌కి ఇంతకంటే ఏమి రాస్తామండీ' అన్నట్టున్నాయి. చెప్పుకోతగింది కెమెరా పనితీరు మాత్రమే. అది కూడా కొన్ని సన్నివేశాల వరకు పరిమితమంతే. దర్శకుడిగా మొదటి రెండు చిత్రాల్లోను తెలిసిన కథలే ఎంచుకున్నా వినోదాత్మకంగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ఇందులో పూర్తిగా క్లూలెస్‌గా అనిపించాడు. రవితేజ హీరో… నేల టికెట్ టైటిల్.. అద్దిరిపోయింది, ఎలాగైనా ఆడేస్తుంది అని ఫీలయి తోచింది తీసేసినట్టున్నాడు.
ప్రథమార్ధం పాయింట్‌లెస్‌గా, ఇంటర్వెల్ ఎప్పుడా అని పడిగాపులు పడేట్టు చేస్తే… ద్వితియార్ధం మోతాదుకు మించిన బలవంతపు ఎమోషన్స్‌తో ఇది ఆపేసి ఫస్ట్ హాఫే ఇంకోసారి వేసేయండన్నట్టు సాగిన 'నేల టిక్కెట్టు' రవితేజ గత చిత్రం 'టచ్ చేసి చూడు' బెటర్ అనిపించడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తే అది మీ తప్పు కానే కాదు.
బాటమ్ లైన్: సేల్ అయ్యే టిక్కెట్టు కాదు!
– గణేష్ రావూరి