ట్రంప్ స్వయంగా ధనవంతుడు కాబట్టి ఎన్నికల నిధులకై కంపెనీ విరాళాలపై ఆధారపడడని, వారికి అనుకూలంగా నియమాలు వంచడని ఆశించడం జరిగింది. కానీ అతనూ అలాటివాడే అని, తన లాయరు ద్వారా నిధులు సేకరిస్తూ అవినీతికి పాల్పడుతున్నాడనీ అనుమానం వచ్చింది. ఈ విషయం బయటపడడం కూడా నాటకీయంగానే జరిగింది. ట్రంప్ 2006లో 27 ఏళ్ల స్టార్మీ డేనియల్స్ అనే పోర్న్ స్టార్ (అసలు పేరు స్టిఫెనీ క్లిఫోర్డ్)పై మోజు పడ్డాడు. తగిన రుసుము చెల్లించి మోజు తీర్చుకున్నాడు కూడా.
ట్రంప్ అధ్యక్షపదవికి పోటీ చేసినపుడు ఆ విషయాన్ని బయటపెడతానని స్టార్మీ బ్లాక్మెయిల్ చేసింది. అప్పటికే ట్రంప్‌పై కొందరు ఆరోపణలు చేశారు. ఈమె కూడా చేరితే కష్టమనుకుని 2016 అక్టోబరులో ట్రంప్ తన లాయరు మైకేల్ కోహెన్ ద్వారా 1,30,000 డాలర్లు డబ్బు పంపించి ఆ విషయాన్ని బయట పెట్టకూడదని (నాన్-డిస్క్లోజర్) అగ్రిమెంటు రాయించుకున్నాడు. నిజాన్ని కప్పిపెట్టేశాం, యిక నిర్భయంగా ఉండవచ్చు అనుకున్నాడు. కానీ స్టార్మీ 15 నెలల తర్వాత తమ వ్యవహారాన్ని పత్రికలకు లీక్ చేసింది.
2018 జనవరిలో వాల్‌స్ట్రీట్ జర్నల్ దీనిపై కథనం వేసింది. ట్రంప్ తన లాయరు కోహెన్‌కు సంబంధించిన ఎస్సెన్షియల్ కన్సల్టంట్స్ ఎల్ఎల్సి ద్వారా స్టార్మీకి డబ్బు చెల్లించాడని బయటపెట్టింది. దానిపై కోహెన్ స్టార్మీకి తన జేబులోంచి చెల్లించానని, ట్రంప్ సంస్థల నుంచి కాని, ట్రంప్ ప్రచారానికి అతని అభిమానులు యిచ్చిన విరాళాల నుంచి దాన్ని తీసుకోలేదని ప్రకటించాడు. స్టార్మీ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని ట్రంప్ బుకాయించాడు.
అయితే మార్చి 25న స్టార్మీ ఒక టీవీ ఇంటర్వ్యూలో తను 2006లో ట్రంప్‌తో శయనించానని, ఆ విషయం బయటపెడితే జాగ్రత్త అని తర్వాతి రోజుల్లో బెదిరించారని, ఒప్పందంపై సంతకం పెట్టేలా ఒత్తిడి చేశారని చెప్పింది. అంతకు 19 రోజుల ముందు మార్చి 6న ట్రంప్‌పై కేసు పడేసింది – అగ్రిమెంటుపై ట్రంప్ సంతకం పెట్టలేదు కాబట్టి ఒప్పందం చెల్లదని, కానీ అతని లాయరు కోహెన్ తనను నోరు విప్పవద్దని బెదిరిస్తున్నాడనీ! పరిస్థితి యిక్కడిదాకా వచ్చాక యిక తప్పక ట్రంప్ 2018 ఏప్రిల్‌లో తను చెప్పడం బట్టే కోహెన్ స్టార్మీకి డబ్బిచ్చాడని ఒప్పుకోవలసి వచ్చింది.
ఈ స్టార్మీ ధర్మమాని కోహెన్ తాలూకు ఎస్సెన్షియల్ కన్సల్టంట్స్ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్బిఐ వారు ఏప్రిల్ 9 న అతని ఆఫీసుపై దాడి చేసి, రికార్డులన్నీ స్వాధీనం చేసుకున్నారు. స్టార్మీకి ప్రస్తుతం లాయరుగా పనిచేస్తున్న మైకేల్ ఎవెనాట్టీ మే8న ఒక ట్వీట్ చేసి అందర్నీ ఉలిక్కిపడేలా చేశాడు. 2016 అక్టోబరు నుంచి 2018 జనవరి వరకు కోహెన్ కంపెనీలోకి వచ్చిన, వెళ్లిన 44 లక్షల డాలర్ల విలువైన లావాదేవీల జాబితా తన దగ్గర ఉందని.
ట్రంప్ నిర్ణయాల వలన ప్రభావితమయ్యే కంపెనీల నుంచి ఆ ఖాతాలోకి డబ్బులు వచ్చాయని ప్రకటించాడు. ఉదాహరణకు కొన్నిటి గురించి – ఎటి అండ్ టి సంస్థ టైమ్ వార్నర్ సంస్థతో కలుద్దామని జస్టిస్ డిపార్టుమెంటు ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. తనకు అనుకూలంగా నిర్ణయం వచ్చేందుకు దఫదఫాలుగా 2 లక్షల డాలర్లు ఎస్సెన్షియల్ ఖాతాలో వేసింది. దాన్ని బయటపెడుతూ ఎవెనాట్టీ ట్వీట్ రాగానే 'అవును, డబ్బులు పంపాం నిజమే.
ఎందుకంటే కొత్త ఎడ్మినిస్ట్రేషన్ను అర్థం చేసుకోవడానికి మాకు సమాచారం అందివ్వడానికి మేం వాళ్లను కన్సల్టెంట్లగా పెట్టుకున్నాం.' అని చెప్పుకుంది. అమెరికన్ ఎయిర్‌ఫోర్స్‌కు ట్రైనర్ జెట్స్ సప్లయి చేయడానికి అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టర్ లాక్‌హీడ్ మార్టిన్‌తో బాటు కొరియా ఎయిర్‌స్పేస్ అనే కొరియన్ కంపెనీ పోటీ పడుతోంది. ఈ మల్టీ బిలియన్ డాలర్ల బేరం తమకు అనుకూలంగా ఉండేటందుకు 2017 నవంబరులో 1.5 లక్షల డాలర్లు ఎస్సెన్షియల్ ఖాతాలో వేసింది. ట్వీట్ బయటకు వచ్చాక వాళ్లూ యీ సంగతి ఒప్పుకున్నారు.
నోవార్టిస్ అనే స్విస్ ఫార్మా కంపెనీ తన ఉత్పాదనలను అమెరికాలో అమ్ముకోవడానికి అమెరికన్ డాక్టర్లకు లంచాలిచ్చింది. దానిపై అమెరికన్ ప్రభుత్వం నోవార్టిస్పై కేసు పెట్టింది. ఆ విచారణ సందర్భంగా అమెరికన్ కోర్టు దానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు యిమ్మనమని కంపెనీని 2017 మార్చిలో అడిగింది. ఇటువంటిది జరుగుతుందని ముందే పసిగట్టిన నోవార్టిస్ సిఇఓ జో జిమెనెజ్ ట్రంప్‌ను 2017 జనవరిలో కలిశాడు. ఆ పై నెల నుంచి నెలనెలా లక్ష డాలర్ల చొప్పున ఏడాది పాటు ఎస్సెన్షియల్ ఖాతాలో వేసింది.
అదేమంటే 'అమెరికన్ హెల్త్‌కేర్ పాలసీ వ్యవహారాలపై మాకు సేవలందిస్తున్నందుకు…' అని చెప్పింది. అలా ఏడాది పాటు పంపింది. ఈ ట్వీట్ తర్వాత 'మేం చెల్లించిన మాట నిజమే కానీ మేం కోరిన సర్వీసులను కోహెన్, ఆ కంపెనీ అందివ్వలేకపోయాయి.' అని చెప్పిందా కంపెనీ. సేవలందించే సత్తా ఎస్సెన్షియల్ కంపెనీకి ఉందా అన్నదే పెద్ద సందేహం. ఎందుకంటే లక్షలాది డాలర్లు వచ్చివెళుతున్నాయి కానీ దానికి ఒక వెబ్సైట్ లేదు, ఓ బోర్డు ఆఫ్ డైరక్టర్స్ లేదు, ఉద్యోగులు లేరు.
పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలు వాషింగ్టన్లో ఉండే కన్సల్టెన్సీ కంపెనీల సేవలు ఉపయోగించుకుని ప్రభుత్వ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడడం అమెరికాలో సహజం. దానిలో చట్టవిరుద్ధమైనదేదీ లేదు. ఫార్చ్యూన్ 500 కంపెనీలు కోట్లాది డాలర్ల వీటికై ఖర్చు పెడతాయి. ట్రంప్‌కి తెలియకుండా కోహెన్ డబ్బు తీసుకుంటున్నాడా? లేక ట్రంప్ డబ్బు తీసుకోవడానికి కోహెన్ పేర ఒక షెల్ కంపెనీ పెట్టాడా? అన్నది విచారణలో బయటపడాలి.
ఈ వ్యవహారంలో రష్యా కోణం కూడా బయటకు వచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడైన విక్టర్ వెక్సెల్బర్గ్ అనే అల్యూమినియం వ్యాపారి ఉన్నాడు. అతనికి సంబంధించిన రెనోవా గ్రూపు, న్యూయార్క్‌లో ఉన్న కొలంబస్ నోవా అనే యిన్వెస్ట్మెంటు ద్వారా పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. కొలంబస్ నోవా నుంచి ఎస్సెన్షియల్స్కు 5 లక్షల డాలర్లు నిధులు వచ్చాయి.
2016 నాటి తమ దేశపు ఎన్నికలలో రష్యా తరఫున జోక్యం చేసుకున్నారని విక్టర్, అతని రెనోవా గ్రూపులపై అమెరికన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాటిని ఎత్తివేయించుకోవడానికే యీ లంచమా? అని యీ వ్యవహారాలపై విచారణ జరిపిన రాబర్ట్ మ్యూలెర్ అడిగాడు. ఎవెనాట్టీ చేసిన ట్వీట్‌కు కొలంబస్ నోవా స్పందిస్తూ తాము పంపిన డబ్బుకు, విక్టర్‌కు సంబంధం లేదు అని ప్రకటించింది. నమ్ముదామా? (ఫోటో – కోహెన్, స్టార్మీ, మధ్యలో ట్రంప్)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]