సునీల్ ను దిల్ రాజును వాడేస్తున్నారు

అదిగో సినిమా.. ఇదిగో దిల్ రాజు కొన్నారు. అల్లదిగో సినిమా, ఇదిగో సునీల్ కొన్నారు. ఈ మధ్య ఈ టైపు వార్తలు కామన్ అయిపోయాయి. నైజాంలో ఇప్పుడు రెండే సినిమా పంపిణీ ఆఫీసులు మిగిలాయి.…

అదిగో సినిమా.. ఇదిగో దిల్ రాజు కొన్నారు. అల్లదిగో సినిమా, ఇదిగో సునీల్ కొన్నారు. ఈ మధ్య ఈ టైపు వార్తలు కామన్ అయిపోయాయి. నైజాంలో ఇప్పుడు రెండే సినిమా పంపిణీ ఆఫీసులు మిగిలాయి. ఒకటి సునీల్ నారంగ్, రెండవది దిల్ రాజు. ఈ రెండు సంస్థలు వీలయినంత వరకు సినిమాలు పంపిణీ చేయడానికే చూస్తున్నాయి తప్ప కొనడానికి కాదు.

పైగా కొన్నా ఆచి తూచి కొంటున్నాయి తప్ప, పోటీపడిపోయి, రేట్లు పెంచేసి ఫ్యాన్సీ రేట్లకు కొనేంత సీన్ అయితే లేదు. పైకి పోటీగా కనిపిస్తూన్నా, దిల్ రాజు, సునీల్ మాంచి అండర్ స్టాండింగ్ తోనే వున్నారని టాక్ వుంది.

సినిమాను ఆంధ్ర, సీడెడ్ లో అమ్ముకోవడానికి, అక్కడి బయ్యర్లలో తమ ప్రొడెక్ట్ కు క్రేజ్ పుట్టించడానికి నైజాం అమ్మకాలను లీడ్ గా చూపించడం ఈ మధ్య అలవాటైపోయింది. ఆ మధ్య ఓ సినిమాను దిల్ రాజు కొన్నారని తెగ హడావుడి చేసారు. నిజానికి ఆ సినిమా నిర్మాత మీద కాస్త సానుభూతితో దిల్ రాజు పంపిణీ చేసి పెట్టారన్నది వాస్తవం.

ఈ మధ్య ఓ యంగ్ హీరో, క్రేజీ హీరోయిన్  సినిమా ఎపి ఆంధ్ర సీడెడ్ హక్కులు భారీ రేట్లకు సునీల్ కొన్నారంటూ ప్రచారం ప్రారంభమైంది. కేవలం సునీల్ ను మధ్యలో పెట్టి, బిజినెస్ చేయడం కోసం తప్ప వేరు కాదని తెలుస్తోంది.

అలాగే ఓ యంగ్ హీరో ప్రాజెక్ట్ ను దిల్ రాజు భారీ రేటుకు నైజాం కొన్నారని వార్తలు పుట్టించారు. ఆ హీరోకి స్టార్ డైరక్టర్ తోడయితే ఓకె కానీ, యావరేజ్ డైరక్టర్ తోడయితే అంత రేటు, అంత క్రేజ్ ఎలా వస్తుంది? కానీ సినిమాకు ఆంధ్ర సీడెడ్ ల్లో బోణీ కొట్టాలంటే, నైజాం రేటును సాకుగా చూపించాలి. నైజాం రేషియోలో ఆంధ్ర సీడెడ్ రేట్ కోట్ చేయాలి. అదీ ప్లాన్.

తాము ఆంధ్ర, సీడెడ్ కు ఏ రేటుకు అమ్మాలని అనుకుంటున్నారో, ఆ రేటుకు కాస్త అటుగా నైజాం రేటు అమ్ముడుపోయినట్లు వార్తలు పుట్టిస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, అసలు విషయం వేరు.

నిజానికి ఈ మధ్య ఆంధ్ర అయినా సీడెడ్ అయినా బయ్యర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏ సినిమాను కూడా అంత తొందరపడి కొనడం లేదు. అవసరం అయితే అడ్వాన్స్ లు ఇస్తున్నారు తప్ప, కొనుగోలుకు ముందుకు రావడం లేదు. చాలా సినిమాలు ఇలా అడ్వాన్స్ ల మీదే విడుదల చేసుకోవాల్సి వస్తోంది. మహానటి లాంటి మంచి సినిమా అయినా, నేలటికెట్ లాంటి మాస్ సినిమా అయినా అదే పరిస్థితి.

కేవలం ఎక్కడో ఒకరో అరో బయ్యర్ బకరాగా దొరక్కపోతాడా? అని దిల్ రాజు కొన్నాడు, సునీల్ నారంగ్ కొన్నారు. అంటూ రూమర్లు పుట్టించేస్తున్నారు. అసలు సంగతి ఆ ఇద్దరికీ బాగా తెలుసు. సర్లే, ఇండస్ట్రీలో మామూలే అని సైలెంట్ గా వుంటున్నారు. ఎవరైనా అడిగితే, అబ్బే.. మనం ఎందుకు కొంటాం అని అసలు విషయం ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.