ఇప్పుడంతా ఐటీఆర్ ఫైలింగ్ టైమ్ నడుస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు ఫైలింగ్ లో మునిగిపోయారు. గడువు ముగిసినప్పటికీ, కొద్దిపాటి ఫైన్ తో ఫైలింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడీ హడావుడిని తమ మోసాలకు మార్గంగా ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఐటీ శాఖ పంపించినట్టు మెసేజీలు, మెయిల్స్ పంపించి బురిడీ కొట్టిస్తున్నారు.
“15వేల రూపాయల ఇన్ కం ట్యాక్స్ రిఫండ్ కు మీరు అర్హులు. మీ బ్యాంక్ ఎకౌంట్ లో త్వరలోనే ఈ మొత్తం జమ అవుతుంది. ఒకవేళ మీ బ్యాంక్ ఎకౌంట్ నంబర్ ఇది కాకుంటే, వెంటనే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఎకౌంట్ డీటెయిల్స్ అప్ డేట్ చేసుకోండి.”
దేశవ్యాప్తంగా చాలామందికి వస్తున్న సందేశం ఇది. ఈ టైమ్ లో ఐటీ శాఖ నుంచి మెసేజీలు, మెయిల్స్ రావడం ఖాయం. ఇది కూడా అలాంటిదే అనుకొని క్లిక్ చేస్తే ఎకౌంట్ లో డబ్బులు మాయమవ్వడం ఖాయం అంటున్నారు సైబర్ నిపుణులు.
ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ ఇలాంటి మెసేజీలు పంపించదని చెబుతున్నారు అధికారులు. కేవలం రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు దానికి సంబంధించిన మెసేజీ మాత్రమే వస్తుందని, ఒకవేళ రిఫండ్ ఉంటే, నేరుగా ఎకౌంట్ లో డబ్బులు పడతాయని, అంతే తప్ప ఎకౌంట్ నంబర్ అప్ డేట్ చేసుకోమని సందేశాలు పంపించదని స్పష్టం చేస్తున్నారు.
ఇలాంటి మెసేజీలు క్లిక్ చేసి, ఎకౌంట్ నంబర్లు అప్ డేట్ చేసే క్రమంలో కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నట్టు ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో వెంటనే కేంద్రం, ఐటీ శాఖ అప్రమత్తమైంది. ఇలాంటి మెసేజీలు నమ్మొద్దంటూ ప్రచారం ప్రారంభించాయి.