మళ్లీ పెళ్లి.. సీనియర్ నటుడు నరేష్ నటించిన తాజా చిత్రం. నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలకు కూసింత ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన సినిమా ఇది. నరేష్ రియల్ లైఫ్ లో జరిగిన హోటల్ ఎపిసోడ్, షూటింగ్ స్పాట్ లో సన్నివేశాలు… ఇలా చాలా అంశాలు 'మళ్లీ పెళ్లి' సినిమాలో ఉన్నాయి.
దీంతో ఈ సినిమాపై ఆయన భార్య రమ్య రఘుపతి కేసు వేసిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, మహిళను అని కూడా చూడకుండా తనను అవమానించేలా సినిమా తెరకెక్కించారంటూ ఆమె సిటీ సివిల్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆమె వేసిన కేసు, సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. సినిమా రిలీజ్ ను కోర్టు అడ్డుకోలేదు. అయితే కేసు మాత్రం అలా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ కేసుపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ పెళ్లి సినిమా పూర్తిగా కల్పితమని, రమ్య రఘుపతి ఆరోపించిన దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది.
'మళ్లీ పెళ్లి' సినిమా పూర్తిగా కల్పితమని సెన్సార్ బోర్డు నమ్మిందని, సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని, అలాంటప్పుడు రమ్య రఘుపతి ఆరోపిస్తున్న అంశాలను టేకప్ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా రిలీజ్ ను, అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ ను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే హక్కు లేదని తీర్పునిచ్చింది.
దీంతో 'మళ్లీ పెళ్లి' సినిమాకు అన్ని అడ్డంకులు తొలిగినట్టయింది. ఈ సినిమాను స్వయంగా తన సొంత బ్యానర్ పై నరేష్ నిర్మించి, నటించారు.