సినిమాల్లేకపోయినా, నిత్యం ఏదో ఒక ఊహాగానంతో లైమ్ లైట్లో కొనసాగుతూనే ఉంటాడు హీరో తరుణ్. మరీ ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వ్యవహారంలో మినిమం గ్యాప్స్ లో తరుణ్ పేరు తెరపైకొస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ హీరో పెళ్లిపై పుకార్లు నడుస్తున్నాయి.
“తరుణ్ కు పెళ్లి ఫిక్స్ అయింది. మరో నెల రోజుల్లో పెళ్లి.” ఇది తాజా పుకారు. ఇదేం కొత్తగా పుట్టుకొచ్చిన పుకారు కాదు. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వైరల్ అయిందంతే. దీంతో తరుణ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశాడు తరుణ్. నిజంగా తను పెళ్లి చేసుకుంటే, ఆ విషయాన్ని ముందుగా మీడియాకు చెప్పి, ఆ తర్వాతే పెళ్లి పనులు మొదలుపెడతానని ప్రకటించాడు.
తన పెళ్లిపై ఎందుకు పుకార్లు వస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నాడు తరుణ్. ప్రస్తుతం ఈ హీరో వయసు 42 సంవత్సరాలు.
గతంలో తరుణ్, ఆర్తి అగర్వాల్ ఎఫైర్ పై చాలా పుకార్లు వచ్చాయి. 'నువ్వు లేక నేను లేను' అనే సినిమా టైమ్ లో వీళ్లిద్దరూ బాగా దగ్గరైనట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆర్తి అగర్వాల్ చనిపోయింది. ఆ తర్వాత నటి ప్రియమణితో కూడా తరుణ్ పెళ్లి అంటూ ప్రచారం జరిగింది.
అలా నిత్యం పెళ్లి పుకార్లతో నలుగుతున్న తరుణ్, నిజజీవితంలో మాత్రం ఇంతవరకు పెళ్లి చేసుకోలేకపోయాడు.