బయోపిక్స్‌కు శుభారంభం..!

సినిమా అంటే.. ఎంతో కథ, మరెన్నో ట్విస్టులు, థ్రిల్స్‌, ప్రతిదాన్నీ ఎగ్జాగరేట్‌ చేయడమే సినిమా అంటే. హీరో ఈడ్చికొడితే విలన్‌ ఎముకలు విరిగిపోతాయి. ఎత్తికొడితే బౌన్సర్‌ లాంటి మనిషి బౌన్స్‌ అవుతూ పడిపోతాడు. ఒకేసారి…

సినిమా అంటే.. ఎంతో కథ, మరెన్నో ట్విస్టులు, థ్రిల్స్‌, ప్రతిదాన్నీ ఎగ్జాగరేట్‌ చేయడమే సినిమా అంటే. హీరో ఈడ్చికొడితే విలన్‌ ఎముకలు విరిగిపోతాయి. ఎత్తికొడితే బౌన్సర్‌ లాంటి మనిషి బౌన్స్‌ అవుతూ పడిపోతాడు. ఒకేసారి పాతిక మందిని తిప్పి అలా పడేయగలడు హీరో. ఇంతేనా.. ఇలా చెబుతూపోతే సినిమాల ముచ్చట్లెన్నో ఉంటాయి. వాస్తవిక జీవితానికి చాలా దూరంగా ఉంటుంది సినిమా. మరి అలాంటి సినిమాలో వాస్తవిక జీవితాన్ని చూపడం అంటే మాటలు కాదు!

సినిమాల్లో చూపించేది ఏదీ వాస్తవిక జీవితంలో ఉండదు. పాట, ఫైటు. ఇవేవీ వాస్తవ జీవితంలోని నిజాలు కాదు. అవి మాత్రమేగాక సినిమాలో మరెన్నో అబద్ధాలు, కల్పితాలుంటాయి. అవే ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలు కూడా. మరి అలాంటి ఆకట్టుకునే అబద్ధాలేవీ లేని మనిషి జీవితాన్ని తెరపై చూపడం అంటే చాలా ప్రయోగమే. కాస్త మసాలా జోడిస్తే జోడించవచ్చు గాక.. బయోపిక్స్‌ మాత్రం ఆకట్టుకునేవే. వాస్తవ జీవితంలోని మనుషుల జీవితాల ఆధారంగా, వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందే సినిమాలు ఇండియన్‌ సినిమాలో ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి.

బాలీవుడ్‌లో విజయవంతం అయిన ఈ ట్రెండ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ మొదలైంది. ముందుగా వచ్చిన బయోపిక్‌ పాజిటివ్‌ రిజల్ట్‌ పొందడం గమనార్హం. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన 'మహానటి' ప్రశంసలు అందుకొంటూ ఉండటం.. బయోపిక్స్‌కు తెలుగునాట లభించిన శుభారంభం అని చెప్పవచ్చు. రానున్న మరిన్ని బయోపిక్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు.. మరిన్ని బయోపిక్స్‌ రూపొందడానికి పాజిటివ్‌ పాయింట్‌గా నిలుస్తోంది 'మహానటి'.

తెలుగులో ఇప్పుడు ప్రతిపాదన దశలో ఉన్న, పట్టాలెక్కిన బయోపిక్స్‌ చాలా ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌ 'యాత్ర' ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఇక 'ఎన్టీఆర్‌' కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. ఇది కూడా రూపొందుతోంది. ఇవి మాత్రమేగాక 'సైరా నరసింహారెడ్డి' పేరుతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ తెరకెక్కుతోంది. ఇలా వ్యక్తుల జీవితాల కథలు వరసగా రాబోతున్నాయి.

వ్యక్తుల జీవితాలను సినిమాలుగా తెరకెక్కిస్తే అవి జనాలకు నచ్చుతాయా? అలాంటి సినిమాలను తెలుగు జనాలు ఆహ్వానిస్తారా? అనేవి ఏమూలో ఉన్న సందేహాలు. అయితే చక్కగా తీస్తే తాము ఆదరిస్తామని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు. కాబట్టి మరిన్ని బయోపిక్స్‌కు స్వాగతమిక!