రిలీజైన సినిమాను గంటల్లో పైరసీ చేసే తమిళ రాకర్స్ టీం, హీరో విశాల్ పై కక్ష కట్టిన విషయం తెలిసిందే. విశాల్ నటించిన సినిమాలన్నింటినీ క్షణాల్లో పైరసీ చేసి నెట్ లో పెడతామని శపథం కూడా చేశారు వాళ్లు. గతంలో ఓసారి విశాల్ కు ఈ సెగ తగిలింది. కానీ ఆ దెబ్బ నుంచి ఈ హీరో ఎలాంటి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు.
తాజాగా విశాల్ నటించిన ఇరుంబు తిరై సినిమా తమిళనాట విడుదలైంది. ఎప్పట్లానే ఈ సినిమాను కూడా విడుదలైన కొన్ని గంటలకే పైరసీ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడపడితే అక్కడ పైరసీ లింక్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలపై డైరక్ట్ గా ఈ సినిమా ప్రత్యక్షమౌతోంది.
ఇరుంబు తిరై తెలుగు డబ్బింగ్ రిలీజ్ కు ఈ పైరసీ పెద్ద అడ్డంకిగా మారింది. తెలుగులో ఈ సినిమాను అభిమన్యుడు పేరుతో విడుదలకు సిద్ధం చేశారు. ఈ శుక్రవారం ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే అంతకంటే ముందే విశాల్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పైరసీ ద్వారా చాలామంది తెలుగు ఆడియన్స్ చూసేస్తున్నారు. యాక్షన్-థ్రిల్లర్ జానర్ కావడంతో భాషతో సమస్య లేదు.
గతంలో డిటెక్టివ్ విషయంలో కూడా ఇదే జరిగింది. తెలుగు రిలీజ్ కు ముందే హెచ్ డీ క్వాలిటీ పైరసీని చాలామంది చూసేశారు. దీని వల్ల టాలీవుడ్ రిలీజ్ పై ఆ ప్రభావం గట్టిగా పడింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు రాలేదు. ఇప్పుడు అభిమన్యుడు సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అయ్యేలా ఉంది.
నిజానికి తమిళ వెర్షన్ తో పాటు ఎలాగోలా కష్టపడి తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. మెహబూబాతో పాటు అభిమన్యుడు వచ్చి ఉంటే బాగుండేది. కానీ విశాల్ ఈ విషయంలో తప్పు చేశాడు. తాజా దెబ్బతో డిటెక్టివ్ తరహాలో అభిమన్యుడు తమిళ వెర్షన్ ను కూడా, తెలుగు రిలీజ్ కు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో పెట్టేస్తారేమో.