మెగా మూవీ: బోయపాటి స్థానంలో కొరటాల?

చిరంజీవి, బోయపాటి కాంబోలో సినిమా చాన్నాళ్ల కిందటే ఫిక్స్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా ఈ సినిమా లాక్ అయింది. సైరా మూవీ రిలీజ్ అయిన వెంటనే ఈ…

చిరంజీవి, బోయపాటి కాంబోలో సినిమా చాన్నాళ్ల కిందటే ఫిక్స్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా ఈ సినిమా లాక్ అయింది. సైరా మూవీ రిలీజ్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది. ఇప్పటివరకు అందరికీ తెలిసిన మేటర్ ఇదే. కాకపోతే ఇప్పుడీ ప్రాజెక్టులో భారీ మార్పులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి.

హీరోగా చిరంజీవి కామన్. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కూడా ఉంటారు. కానీ దర్శకుడిగా బోయపాటి ఉంటాడా అనేదే డౌట్. ఎందుకంటే అతడి స్థానంలో కొరటాలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట చిరంజీవి. రీసెంట్ గా చిరు-కొరటాల మధ్య జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తోంది. సైరా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట చిరంజీవి.

అలా అని బోయపాటిని పూర్తిగా పక్కనపెట్టినట్టు కాదు. అతడితో కూడా సినిమా ఉంటుంది కానీ ఎప్పుడనేది చెప్పలేం. నిజానికి ఈ లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. చిరంజీవి-త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది చెప్పలేం.

అటు రామ్ చరణ్ తో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు కొరటాల. అన్నీ అనుకున్నట్టు జరిగితే బ్యాక్ టు బ్యాక్ తండ్రికొడుకుల్ని డైరక్ట్ చేయబోతున్నాడు. సురేందర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. చరణ్ తో ధృవ సినిమా చేసిన వెంటనే, చిరుతో సైరా చేస్తున్నాడు. ఏదేమైనా మెగాస్టార్ తో మూవీ కోసం బోయపాటికి సుదీర్ఘ నిరీక్షణ తప్పదేమో.