అవార్డులు ఇచ్చేవాళ్లు భలే పేర్లు కనిపెడతారు. ఎంతమందికి అవార్డులు ఇవ్వాలనిపిస్తే అన్ని రకాల పేర్లు. సినీ గోయర్ అవార్డులు అంటూ ప్రభుత్వ సహకారంతో ఈసారి అవార్డులు ఇవ్వబోతున్నారు.
ఈ అవార్డుల కింద 2017కి బెస్ట్ హీరో చిరంజీవి (ఖైదీ 150), బెస్ట్ యాక్టర్ బాలకృష్ణ (గౌతమీ పుత్ర శాతకర్ణి), బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఫెర్ ఫార్మెన్స్ ఎన్టీఆర్ (జై లవకుశ) బెస్ట్ యూనివర్సల్ హీరో ప్రభాస్ (బాహుబలి) . అంటే ఈ విధంగా నలుగురికి పంచేయగలిగారు.
ఇవి చాలదనట్లు సెన్సేషనల్ హీరో అవార్డు కూడా వుంది. అది నాని (నిన్నుకోరి)కి ఇస్తున్నారు. భలేగా వుందిగా.. అప్పుడే అయిపోలేదు. ఇంకో స్పెషల్ వుంది. బెస్ట్ కొత్త హీరో అవార్డు ఒకటి వుంది. అది మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవికి అందిస్తారు.
పోనీ ఇక్కడితో ఆపారా? హీరోలకు అవార్డులు అంటే అదీ లేదు. షైనింగ్ హీరో అంటూ వరుణ్ తేజకు.. కామిక్ హీరో అంటూ శ్రీనివాసరెడ్డికి, మాజికల్ హీరో అంటూ నిఖిల్ కు, డైనమిక్ యాక్టర్ అంటూ రాజశేఖర్ కు, యూత్ ఐకాన్ హీరో అంటూ విజయ్ దేవరకొండకు, అవార్డులు అంట.
అంటే ఈ పేరు, ఆ పేరు ఏదయితేనేం మొత్తం 11మంది హీరోలకు అవార్డులు అన్నమాట. పాపం ఇద్దరో ముగ్గురో మిగిలి పోయినట్లున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ఏం పాపం చేసుకున్నారో? ఇక డైరక్టర్ అవార్డులు వున్నాయి. పేర్లు ఏవయితేనేం, ఏదో పేరు చెప్పి రాజమౌళికి, క్రిష్ కు, ప్రవీణ్ సత్తారు, అనిల్ రావిపూడి, ఆర్ జయకు (వైశాఖం), సందీప్ వంగాకు, అక్షత శ్రీనివాస్ (శేఖరంగారి అబ్బాయి), డాక్టర్ ఫ్రభాకర్ జైనీలకు అంటే ఎనిమిది మందికి అన్నమాట.
ఇంకా ఇలాంటి పంపకాలే చాలా వున్నట్లున్నాయి. ఈ వేడుక తొలిసారి ప్రభుత్వ సహకారంతో జరగడం విశేషం. ఓ ఫ్రయివేటు అవార్డుల కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రభుత్వం, ఇంతకీ తన అవార్డులను ఎప్పుడు అందిస్తుందో?