రంగస్థలం సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు పవన్. చరణ్ ను అదే పనిగా మెచ్చుకున్నాడు. దీనికి కారణం చరణ్ మెగాహీరో కాబట్టి. ఇక ఛల్ మోహన్ రంగ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. దీనికి కారణం ఆ సినిమాకు పవన్ నిర్మాత కాబట్టి. పైగా నితిన్ తనకు వీరభక్తుడు కాబట్టి ఎటెండ్ అయ్యాడు. మరి నేలటిక్కెట్ ఆడియో ఫంక్షన్ కు పవన్ ఎందుకు వస్తున్నాడు.. ఏంటి కనెక్షన్?
రవితేజ హీరోగా నటించిన సినిమా నేలటిక్కెట్. కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేసిన సినిమా ఇది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను 10వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ వేడకకు ప్రత్యేక అతిథిగా హాజరవ్వబోతున్నాడు పవన్ కల్యాణ్. నిజానికి ఈ సినిమాతో పవన్ కు ఎలాంటి సంబంధం లేదు. రవితేజ, పవన్ మధ్య చెప్పుకునే స్థాయిలో ఫ్రెండ్ షిప్ కూడా లేదు. మరి ఎందుకు స్పెషల్ గెస్ట్ గా వస్తున్నట్టు?
నేలటిక్కెట్టుపై పవన్ ప్రత్యేక అభిమానానికి కారణం ఆ సినిమా నిర్మాత రామ్ తాళ్లూరి. పవన్ కు ఇతడితో మంచి సంబంధాలున్నాయి. పైకి ఎక్కడా కనిపించకపోయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య బంధం అంతా ఊహించుకునే దానికంటే కాస్త ఎక్కువే. పవన్ స్థాపించిన జనసేన పార్టీకి దశలవారీగా ఫండింగ్ అందిస్తోంది ఈ నిర్మాతే అనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. పవన్ కు ఎప్పుడు ఏం సమకూర్చాల్సి వచ్చినా రామ్ ముందుంటారట.
అంతేకాదు.. జనసేనకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో రామ్ తాళ్లూరికి చెందిన కంపెనీనే అన్నీ దగ్గరుండి చూసుకుంటుందట. అలా పబ్లిసిటీ డిజైనింగ్ మొత్తాన్ని తెరవెనక రామ్ చూసుకుంటారట. రామ్ తో ఇంత సన్నిహిత సంబంధం ఉంది కనుకే నేలటిక్కెట్టు ఆడియో ఫంక్షన్ కు పవన్ వస్తున్నాడు.