సినిమా రివ్యూ: నా పేరు సూర్య

రివ్యూ: నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ తారాగణం: అల్లు అర్జున్‌, అర్జున్‌ సర్జా, అను ఎమాన్యుయేల్‌, నదియా, శరత్‌ కుమార్‌, సాయికుమార్‌,…

రివ్యూ: నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌
తారాగణం: అల్లు అర్జున్‌, అర్జున్‌ సర్జా, అను ఎమాన్యుయేల్‌, నదియా, శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రదీప్‌ రావత్‌, పోసాని కృష్ణమురళి, బొమన్‌ ఇరానీ, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: విశాల్‌ అండ్‌ శేఖర్‌
ఛాయాగ్రహణం: రాజీవ్‌ రవి
సమర్పణ: కె. నాగబాబు
నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్‌
రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ
విడుదల తేదీ: మే 04, 2018

'నా పేరు సూర్య' కథ విని అల్లు అర్జున్‌ అంతగా ఎక్సయిట్‌ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. అతని కోసం రాసే పాత్రలకి పూర్తి భిన్నమైన రీతిలో సాగుతుందీ క్యారెక్టర్‌. సహజంగానే నటుడిగా తనలోని మరో కోణాన్ని చూపించే అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.

అయితే ఈ క్రమంలో తన ప్రతి చిత్రం విషయంలో అన్ని అంశాలు కవర్‌ అవ్వాలని, అన్ని వర్గాలకీ కేటర్‌ చేసేలా వుండాలనీ తీసుకునే జాగ్రత్తలని వదిలేసాడు. రియలిస్టిక్‌గా తీసిన సినిమా అయితే కమర్షియల్‌ అంశాలు లేవనేది కంప్లయింట్‌ అయి వుండేది కాదు. కానీ 'నా పేరు సూర్య' చిత్రాన్ని కమర్షియల్‌గా మలిచేందుకే కృషి జరిగింది. హీరోది ఆర్మీ నేపథ్యం, సీరియస్‌ క్యారెక్టర్‌ అయినా కానీ సగటు కమర్షియల్‌ అంశాలన్నీ కవర్‌ చేసుకునేలానే సెటప్‌ పెట్టుకున్నారు.

కాకపోతే వాటన్నిటినీ పెట్టుకుని కూడా రౌండెడ్‌ స్క్రిప్ట్‌ చేయకుండా, అటు పూర్తి కమర్షియల్‌గా కాకుండా, ఇటు వాస్తవికంగాను లేకుండా మధ్యస్తంగా వదిలేసారు. ఫ్యామిలీ వుంటుంది… తగిన డ్రామాకి స్కోప్‌ వుండదు. రొమాన్స్‌ వుంటుంది… ఎక్కడా ఫీల్‌ కలగదు. విపరీతమైన బిల్డప్‌ ఇచ్చిన విలన్స్‌ వుంటారు… సరైన టైమ్‌లో చేతులెత్తేస్తారు. కామెడీ కోసం అటెంప్ట్‌ లేకపోలేదు… కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో నవ్వించదు. కనీసం దేశభక్తి రగిలించే సన్నివేశాలైనా బలంగా వున్నాయా అంటే అదీ జరగలేదు. అల్లు అర్జున్‌ అభినయంలో కనిపించే లోతు, భావోద్వేగం సన్నివేశాల్లో కానరాదు.

హీరో పాత్ర చిత్రణపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా నాలుగైదు బలమైన సన్నివేశాలు రాసుకుని మధ్యలో ఫిల్లర్‌ సన్నివేశాలు వేసుకుంటూ వెళ్లిపోయిన భావన కలుగుతుంది. సాధారణంగా ఒక కథ రాసుకోవడం మొదలు పెట్టినపుడు స్టార్ట్‌, మిడిల్‌, ఎండ్‌ డిసైడ్‌ అయిన తర్వాత దానిని డెవలప్‌ చేస్తారు. అన్నిసార్లు ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని లేదు కానీ ఎక్కువసార్లు జరిగేది అయితే ఇదే.

కథలోని ఈ ముఖ్య ఘట్టాలు బలంగా అనిపించినపుడు రచయితలు, దర్శకులు ఒక్కోసారి మిగతా డ్రైవ్‌ మీద దృష్టి పెట్టరు. ఇక్కడ డౌన్‌ అయినా ఇంటర్వెల్‌ ముందు వచ్చే ఘట్టం రక్తి కట్టిస్తుందనో, లేదా పతాక సన్నివేశంతో పైసా వసూల్‌ అయిపోతుందనో అలసత్వం చూపిస్తుంటారు. ఈ చిత్రంలోని కథనం సాగే తీరు చూస్తే అలాంటి అలసత్వమే రచయిత మదిలో చొరబడిందా అనిపిస్తుంది.

సూర్య (అల్లు అర్జున్‌) పాత్రని స్ట్రయికింగ్‌గా ఇంట్రడ్యూస్‌ చేసి, పర్‌ఫెక్ట్‌ టేకాఫ్‌ తీసుకున్న తర్వాత కథాగమనం కుదుపులకి లోనవుతుంది. ఒక్కసారి కథ వైజాగ్‌కి షిఫ్ట్‌ అయిన తర్వాత టోన్‌, మూడ్‌ మొత్తం మారిపోతుంది. అంతవరకు చండశాసనుడిగా కనిపించిన సూర్య పాత్ర కూడా డైల్యూట్‌ అయిపోయి సీరియస్‌నెస్‌ కోల్పోతుంది. ఒక కెరియర్‌ ఓరియెంటెడ్‌ స్ట్రిక్ట్‌ పర్సనాలిటీ జీవితంలోని ప్రేమ ఘట్టాన్ని మరీ ఇంత సింపుల్‌గా తేల్చేయడం మెప్పించదు.

అంత బిల్డప్‌ ఇచ్చిన అర్జున్‌ సర్జా వర్సెస్‌ అల్లు అర్జున్‌ ఇంటరాక్షన్స్‌ కూడా కాలక్షేపంలా అనిపిస్తాయే తప్ప సీరియస్‌గా తీసుకోనివ్వవు. ఘనంగా మొదలైన చిత్రం ట్రాక్‌ తప్పి ఎటో పోతున్న దశలో అర్జున్‌లిద్దరి ముఖాముఖి సన్నివేశం రక్తి కడుతుంది. కోపాన్ని ఇరవై ఒక్క రోజులు కంట్రోల్‌లో పెట్టుకోవాలనే మిషన్‌తో సూర్య కార్యోన్ముఖుడవుతాడు. ఆ దశలో అతనిలో రగులుతోన్న ఆవేశాన్ని బయటపెట్టుకునే పర్‌ఫెక్ట్‌ సీన్‌ కుదురుతుంది. మిలటరీలో సూర్య తీసుకున్న ట్రెయినింగ్‌ని సింక్‌ చేస్తూ తీసిన ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌ ఫస్ట్‌ హాఫ్‌కి ఒక స్ట్రాంగ్‌ ఫినిష్‌ ఇస్తుంది.

అర్జున్‌లిద్దరి కాన్‌ఫ్రంటేషన్‌ నుంచి ఇంటర్వెల్‌ ఫైట్‌ వరకు మిడిల్‌ ఘట్టం అనుకుంటే… దానిని చాలా బాగా తెరకెక్కించారు. అటుపై సూర్య ఇరవై ఒక్క రోజుల ఛాలెంజ్‌ని ఫేస్‌ చేస్తూ తన ఆవేశాన్ని అణచిపెట్టుకోవడం, తన చుట్టూ ఏం జరిగినా పట్టించుకోకపోవడం అంతా చాలా సాదాసీదాగా సాగిపోతుంది. ఇక్కడ సన్నివేశాలని కూడా బలంగా రాసుకోకుండా కన్వీనియంట్‌గా, ఎలాంటి ఇంపాక్ట్‌ లేకుండా కానిచ్చేయడం వల్ల ఈ వ్యవహారం అంతా తేలిపోతుంది. ఒక గ్రూప్‌లోని రౌడీలు ఒక వ్యక్తిని అదే పనిగా టార్గెట్‌ చేస్తూ అతడిని అనుసరించడం, అతడిని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టడం చాలా సినిమాటిక్‌గా అనిపిస్తుంది.

ఈ గందరగోళం మధ్య పతాక సన్నివేశానికి పునాది వేస్తూ సాయికుమార్‌ కుటుంబానికి చెందిన ఉపకథ నడుస్తుంది. తన లక్ష్యం కోసం ఐడెంటిటీ కోల్పోయి, తన వ్యక్తిత్వాన్ని సయితం పక్కన పడేసిన కథానాయకుడికి తప్పు తెలిసిరావడానికో సన్నివేశం పడుతుంది. ఎండ్‌ దిశగా వెళుతోన్న టైమ్‌లో ఇదో మంచి సీన్‌. ఈ సీన్‌ నుంచి విలన్‌ చల్లా (శరత్‌కుమార్‌) ఇంటికెళ్లి అతడిని హడలెత్తించే వరకు రేసుగుర్రంలా దూసుకుపోతుంది స్క్రీన్‌ప్లే. హీరో తన వ్యక్తిత్వం కోల్పోవడం, తర్వాత మరో పాత్ర ద్వారా తప్పు తెలుసుకోవడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడమనే త్రెడ్‌ వక్కంతం వంశీనే రాసిన 'టెంపర్‌'ని గుర్తు చేస్తుంది.

దేశభక్తి ఇతివృత్తము కనుక పతాక సన్నివేశాలు అందుకు అనుగుణంగా రాసుకున్నారు. మంచి డైలాగ్స్‌, అల్లు అర్జున్‌ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ వున్నా కానీ ఈ సీన్స్‌ సగటు సినీ ప్రేక్షకులని అలరించకపోవచ్చు. ఎపిసోడ్‌ల వారీగా బాగుందనిపించిన ఈ చిత్రంలో ఆకట్టుకునే సన్నివేశాలు మధ్య మధ్యలో వచ్చిపోతూనే వుంటాయి. అయితే ఆ సన్నివేశాలని కలిపే బలమైన స్క్రీన్‌ప్లే లేకపోవడంతో కథాగమనం పడుతూ లేస్తూ ముందుకి సాగుతుంటుంది.

అన్ని ఎమోషన్లకీ ఆస్కారమున్న సెటప్‌ పెట్టుకుని కూడా కేవలం కథానాయకుడి పాత్రతోనే రచయిత ట్రావెల్‌ చేసేయడంతో అవేమీ పండకుండా పోయాయి. తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ కానీ, తల్లీ కొడుకుల మధ్య ఏర్పడిన దూరం కానీ ఏదీ హైలైట్‌ కాకపోగా, సినిమా అంతటా ఒక పాయింట్‌ నుంచి మరో పాయింట్‌కి వెళుతూ ముగింపు ఒకటే లక్ష్యమనే యాంత్రికత గోచరిస్తుంది.

దేశ సరిహద్దుల్లో కంటే సైనికుడి అవసరం దేశంలోనే వుందనే సంగతి చెప్పాలనుకున్నపుడు ఉపద్రవాలన్నీ ఒక వ్యక్తి కారణంగానే వస్తున్నట్టు చూపించడం కూడా సమంజసం కాదు. ఇక్కడే సగటు కమర్షియల్‌ సినిమా స్థాయి నుంచి ఒక సందేశాత్మక, అర్థవంతమైన చిత్రంగా దీనిని మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పోనీ ఒక విలన్‌ని అంత పవర్‌ఫుల్‌గా చూపించి అతడిని కథానాయకుడికి సమవుజ్జీని చేసారే అంటే అదీ లేదు. ఒకసారి హీరో ఎంటర్‌ కాగానే అంత బిల్డప్‌ ఇచ్చిన విలన్‌ కాస్తా పిల్లి అయిపోతాడు. విలన్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌తో ఈ సీన్‌కి లింక్‌ కలిపి దర్శకుడు చాతుర్యం చూపించాడు కానీ ఆ పాత్రని తేల్చి పారేయడాన్ని అయితే కవర్‌ చేయలేకపోయాడు.

బలహీనతలు చాలానే వున్న ఈ చిత్రానికి బలమయ్యాడు బన్నీ. ఆర్మీ సోల్జర్‌గా కనిపించడానికి అతను పడ్డ శ్రమ, కష్టం తెరపై కనిపిస్తుంది. అచ్చమైన సైనికుడిలానే కనిపించిన అల్లు అర్జున్‌ తను రెగ్యులర్‌గా చేసే క్యారెక్టర్లకి పూర్తి విభిన్నమైన పాత్రని రక్తి కట్టించిన తీరు నటుడిగా అతను సాధించిన పరిణితి తెలియజేస్తుంది. సూర్య పాత్రలో తన కెరీర్‌ బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడని ఎవరైనా ఒప్పుకుని తీరాలి. అర్జున్‌తో కాన్‌ఫ్రంటేషన్‌ సీన్‌లో, పతాక సన్నివేశాల్లో అతని నటనకి హేట్సాఫ్‌ చెప్పాలి. ఇక స్టయిలిష్‌ స్టార్‌గా తనకున్న పేరుని నిలుపుకుంటూ ఇలాంటి టఫ్‌ క్యారెక్టర్‌ని కూడా స్టయిలిష్‌గా ప్రజెంట్‌ చేసిన విధానం అభినందనలు అందుకుంటుంది.

కీలకమైన పాత్రలో అర్జున్‌ సర్జా ఈ చిత్రానికి అదనపు బలమయ్యారు. అను ఎమాన్యుయేల్‌ పాత్ర అసలు కథకి అడ్డు పడడం మినహా హెల్ప్‌ అవలేదు. ఆమెకి నటించడానికి స్కోప్‌ కూడా దక్కలేదు. చిన్న పాత్ర అయినా సాయి కుమార్‌ నటన మెప్పిస్తుంది. అతని తనయుడిగా నటించిన విక్రమ్‌ లగడపాటి కూడా మెచ్చుకోతగిన అభినయం ప్రదర్శించాడు. శరత్‌కుమార్‌, రావు రమేష్‌, నదియా, పోసాని తదితర ప్రముఖులున్నారు కానీ ఇది ప్రధానంగా అల్లు అర్జున్‌ షో. మిగతా వారిదంతా ఉడత సాయమంతే.

తెరవెనుక పనితనంలో సినిమాటోగ్రాఫర్‌కే అగ్ర తాంబూలం. పాటలు వినడానికి కొత్తగా, ఆకట్టుకునేలానే వున్నా అల్లు అర్జున్‌ చిత్రాల్లో వుండే పాపులర్‌ గీతాలు లేకపోవడం మైనస్‌ పాయింట్‌. సంభాషణలు మెప్పిస్తాయి. దర్శకుడిగా వక్కంతం వంశీ ముద్ర వేసిన సందర్భాలున్నాయి. కాకపోతే తన దగ్గరున్న ఒక స్ట్రాంగ్‌ పాయింట్‌ని సాలిడ్‌ సినిమాగా మలచడంలో మాత్రం అతని బలహీనతలు బహిర్గతమయ్యాయి.

జాగ్రత్తగా కొరియోగ్రాఫ్‌ చేసుకున్న యాక్షన్‌ దృశ్యాలు, ఇంపాక్ట్‌ వేసేలా రాసుకున్న ఆది, మధ్య, అంతిమ ఘట్టాలు, అన్నిటికీ మించి అల్లు అర్జున్‌ సిన్సియారిటీ, హార్డ్‌ వర్క్‌ ప్లస్‌ టాలెంట్‌లు ఈ చిత్రానికి ఎస్సెట్‌గా నిలిచాయి. ఆసక్తికరమైన కథనం, బిగి సడలని కథాగమనం లేకపోవడం, ప్రధానంగా ఒక కంప్లీట్‌నెస్‌ లేని వెలితిని మిగిల్చేయడం సూర్యని కేవలం ఓ సగటు చిత్రంగా మాత్రమే నిలబెట్టాయి.

బాటమ్‌ లైన్‌: బన్నీదే భానుడి ప్రకాశమంతా!

– గణేష్‌ రావూరి