మొత్తానికి భరత్ అలా బయటపడిపోతున్నాడు. వరస పరాజయాల మీదున్న మహేశ్‌కు ఊరటదక్కింది. మంచి విజయం దక్కింది. మామూలుగా అయితే ఈ కథా, కథనాల మీద కొన్ని విమర్శలు వచ్చేవి. అయితే వాటిని నిరోధిస్తూ మహేశ్‌బాబు ఈ సినిమాను నడిపించాడు. అయితే మహేశ్‌బాబు సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పుకోవడానికి మాత్రం 'భరత్ అనే నేను' అర్హత సంపాదించలేకపోయింది. డబ్బులు వస్తే రావొచ్చు కానీ.. కానీ మహేశ్ నుంచి బెస్ట్ సినిమా ఇదైతే కాదు. ఇంకా రావాల్సి ఉంది!
తెలుగునాట ఈ సినిమా ఓకే కానీ, ఇతర భాషల్లోకి అనువాదంతో వర్కవుట్ అవుతుందా? అనేది ప్రశ్నార్థకమే. తెలుగులో వందకోట్ల రూపాయల పైస్థాయి వసూళ్ల సినిమాగా ఇది పక్క భాషల్లోకి అనువాదం కావొచ్చు. అయితే అక్కడ ఇది ఒక సాధారణ సినిమాగా నిలిచిపోవచ్చు. ప్రత్యేకించి తమిళంలోకి దీన్ని అనువదిస్తే అక్కడ 'ముదల్వన్'తో పోలిక వస్తుంది. 'ఒకే ఒక్కడు' తమిళ వెర్షన్ పేరు ఇది. భరత్… కాన్సెప్ట్, కొన్నిసీన్లు ఒకే ఒక్కడును గుర్తు చేస్తాయి.
అనూహ్యంగా హీరో సీఎం కావడం, మార్పు కోసం ప్రయత్నించడం, అక్కడిక్కడే సస్పెన్షన్లు, జనాలమధ్యకు వెళ్లడం, చీఫ్ సెక్రటరీతో కామెడీ, హీరోయిన్‌తో రొమాన్స్ కోసం మారు వేషాల్లో వెళ్లడం.. ఇవన్నీ ఒకే ఒక్కడులోని సీన్లే. కాబట్టి.. భరత్ తమిళంలోకి అనువాదం అయితే అక్కడ ఒకే ఒక్కడుతో పోలిక వస్తుంది. ఇక హిందీలో కూడా అప్పట్లోనే ఒకే ఒక్కడు రీమేక్ అయ్యింది. అనిల్ కపూర్ చేసినట్టున్నాడు.
సో హిందీలో ఈ సినిమాను సీరియస్‌గా చూసినా, పోలికలు తప్పవు. అయితే అలా కాకుండా… హిందీలో మాస్ మసాలా సౌత్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది కాబట్టి.. నడిచేస్తుంది అనుకుంటే భరత్ కూడా అలాంటి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అంతకు మించి మెరుపులు ఉండకపోవచ్చు!